కోతుల్ని పట్టడమెలా? (Devotional)
పూర్వం ఒక కోతి వుండేది. దానికి చెర్రిపళ్ళంటే యిష్టం. ఒకరోజు చెట్టు మీద నించి చెర్రిపండును చూసింది. చెట్టుదిగి పండు తీసుకుందామని వచ్చింది. ఆ చెర్రిపండు ఒక గాజుపాత్రలో వుంది. కోతి కొంత కష్టపడి గాజుపాత్రలోకి చేయి జొనిపి చెర్రి పండును పట్టుకుంది. చెర్రి పండయితే చేజిక్కింది కానీ చేయి గాజుపాత్ర నించి బయటికి రాలేదు. కారణం పండు పిడికిటితో పట్టుకోవడం వల్ల, గాజుపాత్ర మూతి సన్నగా వుండటం వల్ల చేయి యిరుక్కుపోయింది. పండును వదిలేస్తే చేయి […]
పూర్వం ఒక కోతి వుండేది. దానికి చెర్రిపళ్ళంటే యిష్టం. ఒకరోజు చెట్టు మీద నించి చెర్రిపండును చూసింది. చెట్టుదిగి పండు తీసుకుందామని వచ్చింది. ఆ చెర్రిపండు ఒక గాజుపాత్రలో వుంది. కోతి కొంత కష్టపడి గాజుపాత్రలోకి చేయి జొనిపి చెర్రి పండును పట్టుకుంది. చెర్రి పండయితే చేజిక్కింది కానీ చేయి గాజుపాత్ర నించి బయటికి రాలేదు. కారణం పండు పిడికిటితో పట్టుకోవడం వల్ల, గాజుపాత్ర మూతి సన్నగా వుండటం వల్ల చేయి యిరుక్కుపోయింది.
పండును వదిలేస్తే చేయి సులభంగా బయటకు వస్తుంది. కానీ పండును వదలడానికి మనసు వప్పదు. పండూ కావాలి, చేయి గాజుపాత్ర నించీ బయటికి రావాలి అనుకుంటే కుదరదు. స్వేచ్ఛా దొరకదు, పండూ అందదు.
సీసాలో చెర్రిపండు పెట్టడమన్నది ప్రయత్నపూర్వకంగా కోతులు పట్టేవాళ్ళు పన్నే పన్నాగం. కోతులు ఎట్లా ఆలోచిస్తాయో వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలుసు.
గాజుపాత్రలో చేయి యిరుక్కుని కోతి కిచకిచలాడుతూ వుంటే వేటగాడు రంగంలోకి వస్తాడు. కోతి చెర్రిపండును వదిలేస్తే దాని చేయి సులభంగా పాత్ర నించి బయటికి వస్తుంది. కానీ కోతి పండును వదలదు. గాజుపాత్రతో సహా పరిగెడుతుంది.
గాజుపాత్ర బరువుగా వుండడంతో దానివేగం మందగిస్తుంది. వేటగాడు సులభంగా కోతిని పట్టుకుంటాడు. వేటగాడు దాని నుదురు మీద ఒక చరుపు చరిస్తే ఆ క్షణం కోతి చేయి పట్టుతప్పి గాజుపాత్ర నించి చేయి బయటికి వస్తుంది.
కోతికి స్వేచ్ఛ దొరికింది. కానీ వేటగాడికి దొరికింది. గాజుపాత్రను, చెర్రిపండును ఉపయోగించిన వేటగాడికి వాటి రెంటితోబాటు కోతి కూడా దొరికింది.
మనుషులు కూడా భౌతిక బంధనాల్లో తగులుకుని వుంటారు. వాటిని వదులుకుంటే ఆధ్మాత్మికమైన స్వేచ్ఛ దొరుకుతుంది. కానీ వదలరు. జోడు గుర్రాల స్వారీ ఎప్పటికీ సాధ్యపడదు.
స్వేచ్ఛ కావాలంటే వ్యామోహాలు, బంధనాల నించి బయట పడాలి.
– సౌభాగ్య