మరో ఇద్దరు ప్రత్యూషలు
కన్నతండ్రి, సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కథనం మరువక ముందే మరో రెండు కేసులు వెలుగు చూశాయి. పద్దెనిమిదేళ్ల బాలికను చిత్రహింసలు పెడుతున్న బంధువులు, నాలుగేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెడుతున్న సవతి తండ్రిపై పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు. నేరెడ్‌మెట్‌లోని వాయుపురి కాలనీలో భవానీ అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయిని దత్త తల్లిదండ్రులు చిత్రహింసలు పెడుతున్నారని పక్కింటివాళ్ళు పోలీసులకు, బాలలహక్కుల సంరక్షాణాధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు, బాలల హక్కుల సంరక్షణాధికారులు […]
కన్నతండ్రి, సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కథనం మరువక ముందే మరో రెండు కేసులు వెలుగు చూశాయి. పద్దెనిమిదేళ్ల బాలికను చిత్రహింసలు పెడుతున్న బంధువులు, నాలుగేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెడుతున్న సవతి తండ్రిపై పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు.
నేరెడ్‌మెట్‌లోని వాయుపురి కాలనీలో భవానీ అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయిని దత్త తల్లిదండ్రులు చిత్రహింసలు పెడుతున్నారని పక్కింటివాళ్ళు పోలీసులకు, బాలలహక్కుల సంరక్షాణాధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు, బాలల హక్కుల సంరక్షణాధికారులు ఆమెను కాపాడారు. హైదరాబాద్‌లోని వాయుపురి కాలనీలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ దంపతులు భవానీ తల్లిదండ్రులు చనిపోయిన ఏడాదికి 2008లో ఆమెను దత్తత తీసుకున్నారు. మొదట రెండు నెలలు బాగా చూసినా, తర్వాత నుంచి ప్రతిరోజూ హింసిస్తున్నారని భవానీ పోలీసులకు తెలిపింది. కొట్టడం, తిట్టడమే కాకుండా ఒళ్లంతా వాతలు పెడుతున్నారని కాలిన గాయాలను పోలీసులకు చూపించింది. పుష్కరాలకు వెళుతూ తనను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లడంతో ధైర్యం చేసి అధికారులకు సమాచారం ఇచ్చానని భవానీ తెలిపింది. భవానీ దత్తత తల్లిదండ్రులు పుష్కరాల నుంచి తిరిగి రాగానే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
మరోకేసులో నాలుగేళ్ల చిన్నారిని వేధిస్తున్న సవతి తండ్రిని కూడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జవహర్ నగర్లో నివసిస్తున్న ప్రమీలకు సన్‌షైన్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న సంధ్య అనే నాలుగేళ్ల కూతురుంది. అయితే, సంధ్య తండ్రి చనిపోవడంతో తల్లి ఫార్మా ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కన్నతండ్రిలా సంధ్య ఆలనాపాలనా చూడాల్సిన ప్రశాంత్ పాపను ప్రతిరోజూ బెల్ట్‌తో వాతలు తేలేలా కొడుతున్నాడని, కాల్చిన ఇనుపకడ్డీతో వీపుపై వాతలు పెడుతున్నాడని సంధ్య అమ్మమ్మ సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుశీల ఫిర్యాదు మేరకు చిన్నారిని చిత్రహింసలు పెడుతున్న ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యను అమ్మమ్మ సంరక్షణలో ఉంచారు.