Telugu Global
NEWS

పుష్కర ఘాట్‌ వద్ద అగ్ని ప్రమాదం... బెంబేలెత్తిన జనం

గోదావరి పుష్కరాలకు వచ్చిన యాత్రికులతో కిటకిటలాడుతున్న రాజమండ్రిలో మరో దుర్ఘటన చోటుచేసుకొంది. గోకవరం బస్టాండ్‌ వద్దనున్న మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముగ్గురు గాయాల పాలవగా, 12 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మున్సిపల్‌ కాంప్లెక్స్‌ సమీపంలో విద్యుత్‌ స్తంభం నుంచి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. పక్కనే ఉన్న వాహనాలకు ఉన్న పెట్రోల్‌ ట్యాంకులు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ ఘటనతో […]

పుష్కర ఘాట్‌ వద్ద అగ్ని ప్రమాదం... బెంబేలెత్తిన జనం
X

గోదావరి పుష్కరాలకు వచ్చిన యాత్రికులతో కిటకిటలాడుతున్న రాజమండ్రిలో మరో దుర్ఘటన చోటుచేసుకొంది. గోకవరం బస్టాండ్‌ వద్దనున్న మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముగ్గురు గాయాల పాలవగా, 12 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మున్సిపల్‌ కాంప్లెక్స్‌ సమీపంలో విద్యుత్‌ స్తంభం నుంచి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. పక్కనే ఉన్న వాహనాలకు ఉన్న పెట్రోల్‌ ట్యాంకులు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న వేలాది జనం పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సాగిన శారద (72), కిళ్లీ షాపు యజమాని గొర్లె సుబ్రహ్మణ్యం (50), అనకాపల్లికి చెందిన వేలూరి ప్రేమ్‌కుమార్‌ (25) గాయపడ్డారు. వీరిని 108లో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌లోని బ్లీచింగ్‌ పౌడర్‌, ముగ్గు, చీపుర్లు వంటి వాటితో నిల్వలు కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపకదళ సిబ్బంది అగ్నికీలలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించారు. ఘటనలో నలుగురికి గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో మూడు పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మరి కొన్ని వాహనాలకు నిప్పంటుకుని రెండు బస్సులు, జీప్, ఆటో, కొన్ని బైక్‌లు తగలబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటంతో పుష్కరాలకు వచ్చిన జనం భీతిల్లి పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన కిళ్లీ దుకాణం వద్ద షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసినట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న ఒక ప్రత్యక్ష సాక్షిని అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. వదంతులు వ్యాపించకుండా సంయమనం పాటించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పుష్కరఘాట్ పరిసరాల్లోని భక్తులను ఇతర మార్గాల్లో క్షేమంగా తరలించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. మొదట బాంబు పేలుడు లాంటి శబ్దం వినిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోదావరి నదికి నిత్య హారతి ఇచ్చే సమయం కూడా అదే కావడంతో ఆ పరిసరాలకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి వాహనాలను, పాదచారులను అనుమతించకుండా అర కిలోమీటరు దూరంలోనే నిలిపివేశారు. పుష్కరాలకు వచ్చిన భక్తులు అగ్ని ప్రమాదం బారిన పడకుండా కాపాడేందుకు పోలీసులు, స్వచ్ఛంద సేవకులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఎవరూ భయపడవద్దని, మెల్లగా దూరం జరిగితే తొక్కిసలాట జరగకుండా అంతా బయట పడవచ్చని విజ్ఞప్తి చేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి జనం బయటపడ్డారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం పంపేందుకు అంబులెన్స్‌లను రప్పించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి స్థానికులు కూడా తమ వంతు సహకారం అందించారు.

ప్రజలు ఆందోళన చెందొద్దు: బాబు
సిఎం చంద్రబాబునాయుడు పుష్కరఘాట్‌లో నిత్య హారతిని తిలకిస్తుండగా ప్రమాద వార్త తెలిసి హుటాహుటిన సంఘటనా ప్రాంతానిని చేరుకొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆస్తి నష్టపరిహారం ఎంతైనా అందజేస్తానని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఆయన పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందని బాబు అన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారని సీఎం వివరించారు.

First Published:  23 July 2015 4:43 AM IST
Next Story