పాతకాపులకు సీపీఎం స్వాగతం!
త్వరలో సోమనాథ్ ఛటర్జీ, గౌరి అమ్మ చేరిక పార్టీని వదలిపోయిన, బహిష్కరణ వేటుకు గురైన పాతకాపులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) స్వాగతం పలుకుతోంది. ఏడేళ్ల క్రితం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీపీఎం సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ త్వరలో సీపీఎంలో తిరిగి చేరబోతున్నారు. పదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన 86 ఏళ్ల సోమనాథ్‌ను పార్టీలోకి తిరిగి చేర్చుకోవలసిందిగా బెంగాల్ కమిటీ గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆయనను తిరిగి చేర్చుకునే అంశాన్ని పార్టీ […]
BY sarvi21 July 2015 7:23 AM IST
X
sarvi Updated On: 21 July 2015 7:23 AM IST
త్వరలో సోమనాథ్ ఛటర్జీ, గౌరి అమ్మ చేరిక
పార్టీని వదలిపోయిన, బహిష్కరణ వేటుకు గురైన పాతకాపులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) స్వాగతం పలుకుతోంది. ఏడేళ్ల క్రితం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీపీఎం సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ త్వరలో సీపీఎంలో తిరిగి చేరబోతున్నారు. పదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన 86 ఏళ్ల సోమనాథ్‌ను పార్టీలోకి తిరిగి చేర్చుకోవలసిందిగా బెంగాల్ కమిటీ గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆయనను తిరిగి చేర్చుకునే అంశాన్ని పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా పరిశీలిస్తున్నదని ఏకేజీ భవన్ వర్గాలంటున్నాయి. ప్రకాశ్ కారత్ ప్రధానకార్యదర్శిగా ఉండగా పార్టీకి దూరమైపోయిన పాతకాపులు అనేకమంది నాయకత్వ మార్పు తర్వాత తిరిగి పార్టీ వైపు చూస్తున్నారు. అందరినీ కలుపుకుని పోయే చాతుర్యం ఉన్న సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. గత నెలలో జ్యోతిబసు 102వ జయంతి వేడుకల సందర్భంగా బెంగాల్ సీపీఎం సీనియర్ నాయకులు బుద్ధదేవ్ భట్టాచార్య, బిమన్ బసులతో పాటు సోమనాథ్ ఛటర్జీ కూడా హాజరయ్యారు. ఆ వేడుకల్లో సీతారాం ఏచూరితో సోమనాథ్ భేటీ అయ్యారు. అపుడే సోమనాథ్ చేరికకు రంగం సిద్ధమవుతున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. తన స్వస్థలమైన బోల్పూర్‌లో జరిగే ఓ అభివృద్ధి కార్యక్రమానికి ఏచూరిని సోమనాథ్ ఆహ్వానించారు. కోటి రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో సోమనాథ్ పలు కార్యక్రమాలు నిర్వహించారు. శాంతినికేతన్ కళాశాలలో జరిగే ఆ కార్యక్రమంలో సీతారాం ఏచూరి పాల్గొంటున్నారు. అలాగే కేరళలో కూడా ఇలాంటి ప్రయత్నాలే ప్రారంభమయ్యాయి. మార్క్సిస్టు వెటరన్ నాయకురాలు కె ఆర్ గౌరి అమ్మ ఆగస్లు 19 న జరిగే ఓ కార్యక్రమంలో పార్టీలోకి తిరిగి చేరుతున్నారు. 1957లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ఏర్పాటైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో గౌరి అమ్మ సభ్యురాలు. నాటి తొలి తరం నాయకులలో జీవించి ఉన్నది ఆమె ఒక్కరే. 1994లో ఆమె పార్టీని వీడి సొంత పార్టీ (జెఎస్ఎస్)ని ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు ఆ పార్టీని సీపీఎంలో విలీనం చేయబోతున్నారు.
Next Story