Telugu Global
Others

తెలంగాణలో కుంభమేళాను తలపిస్తున్నపుష్కరాలు

తెలంగాణలో గోదావరి మహా పుష్కరాలు కుంభమేళాను తలపిస్తున్నాయి. కందకుర్తి సంగమ స్థానం మొదలుకుని.. భద్రాద్రి రామయ్య పాద సాన్నిధ్యం వరకూ జల గోదావరి కాస్తా.. జన గోదావరిగా మారిపోతున్నది. సెలవు రోజులు కావడంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లోనూ దాదాపు 500 కిలోమీటర్ల మేరకు రోడ్లన్నిటా జనసందోహమే కనిపించింది. పుష్కరఘాట్‌లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సమీప దైవక్షేత్రాలు భక్తకోటి భగవన్నామస్మరణతో మారుమోగిపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన పుష్కరాల్లో ఆరు రోజుల వ్యవధిలో దాదాపు కోటీ 81 లక్షల మంది […]

తెలంగాణలో కుంభమేళాను తలపిస్తున్నపుష్కరాలు
X

తెలంగాణలో గోదావరి మహా పుష్కరాలు కుంభమేళాను తలపిస్తున్నాయి. కందకుర్తి సంగమ స్థానం మొదలుకుని.. భద్రాద్రి రామయ్య పాద సాన్నిధ్యం వరకూ జల గోదావరి కాస్తా.. జన గోదావరిగా మారిపోతున్నది. సెలవు రోజులు కావడంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లోనూ దాదాపు 500 కిలోమీటర్ల మేరకు రోడ్లన్నిటా జనసందోహమే కనిపించింది. పుష్కరఘాట్‌లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సమీప దైవక్షేత్రాలు భక్తకోటి భగవన్నామస్మరణతో మారుమోగిపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన పుష్కరాల్లో ఆరు రోజుల వ్యవధిలో దాదాపు కోటీ 81 లక్షల మంది పుష్కర స్నానం చేశారని అంచనా. శనివారం 60 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేయగా.. ఆదివారం అంతే స్థాయిలో 61 లక్షల మంది భక్తులు వచ్చారు. అంటే సగం రోజులు కూడా పూర్తికాకముందే దాదాపు సగం తెలంగాణ జనాభా పుష్కరాల్లో పునీతమైంది. వీరికి తోడు రాష్ట్ర సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తెలంగాణ నదీ క్షేత్రాలకు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. ఆదివారం మొత్తంగా 61,35,302 మంది పుష్కరాలకు వచ్చినట్లు అంచనా వేశారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 23.5 లక్షల మంది, నిజామాబాద్‌లో 15 లక్షలు, ఆదిలాబాద్‌లో 10 లక్షలు, ఖమ్మం 8.5 లక్షలు, వరంగల్‌లో 4 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారని అంచనా. కరీంనగర్‌, కాళేశ్వరం మార్గాల్లో తప్ప మిగిలిన చోటెక్కడా ట్రాఫిక్‌కు పెద్ద ఇబ్బందులు కలగలేదు. భక్తులకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు పెంచడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పోలీస్ బందోబస్తును, నిఘాను ముమ్మరం చేసింది. హెలికాప్టర్‌ద్వారా డీజీపీ అనురాగ్‌శర్మ కందకుర్తినుంచి భద్రాచలంవరకు విహంగవీక్షణం చేశారు. పుష్కర ఏర్పాట్లను, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణను సీఎం కూడా నేరుగా పర్యవేక్షించడంతో అధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు.
గవర్నర్ రాజమండ్రి, భద్రాద్రిలో స్నానాలు
గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ఉదయం 7.15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వెళతారు. అక్కడ ఉదయం 9 గంటలకు సతీసమేతంగా గోదావరిలో స్నానమాచరించి, 11 గంటల సమయంలో తెలంగాణలోని భద్రాచలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు పుష్కర స్నానం తర్వాత 12.40 గంటలకు సీతారామచంద్రస్వామి దేవాలయంలో గవర్నర్ దంపతులు పూజలు నిర్వహిస్తారు.

First Published:  20 July 2015 5:42 AM IST
Next Story