వందేళ్ల తరువాత తనవారిని కలిసిన రక్తబంధం
ఎక్కడ దక్షిణాఫ్రికా….ఎక్కడ చిత్తూరు జిల్లాలోని నెల్లిమండ అనే చిన్న గ్రామం. కానీ అంత దూరం ప్రయాణించినా అది ఓ మహిళకు ఎంతో దగ్గరే అనిపించింది. దూరభారాలు అనేవి మనిషి శరీరానికే కానీ, మనసుకి కాదని నిరూపించింది మనిర్మినీ నాయుడు. వంద సంవత్సరాల క్రితం అదే గ్రామం నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన ఒక వ్యక్తికి మనుమరాలు ఆమె. విద్యావంతురాలైన మనిర్మిని ఒక కార్పొరేట్ వాణిజ్య సంస్థలో పనిచేస్తున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. మనిషికి తన మూలాలను వెతుక్కోవడంలో ఉన్న ఆనందం ఎంతటిదో ఆమె నిరూపించారు. […]
ఎక్కడ దక్షిణాఫ్రికా….ఎక్కడ చిత్తూరు జిల్లాలోని నెల్లిమండ అనే చిన్న గ్రామం. కానీ అంత దూరం ప్రయాణించినా అది ఓ మహిళకు ఎంతో దగ్గరే అనిపించింది. దూరభారాలు అనేవి మనిషి శరీరానికే కానీ, మనసుకి కాదని నిరూపించింది మనిర్మినీ నాయుడు. వంద సంవత్సరాల క్రితం అదే గ్రామం నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన ఒక వ్యక్తికి మనుమరాలు ఆమె. విద్యావంతురాలైన మనిర్మిని ఒక కార్పొరేట్ వాణిజ్య సంస్థలో పనిచేస్తున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. మనిషికి తన మూలాలను వెతుక్కోవడంలో ఉన్న ఆనందం ఎంతటిదో ఆమె నిరూపించారు.
నెల్లి మండ గ్రామంలో యాభై కుటుంబాలు మాత్రమే ఉంటాయి. మూడువందల మంది జనాభా. చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరుకి ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి వంద సంవత్సరాల క్రితం రంగయ్యనాయుడు అనే వ్యక్తి దక్షిణాఫ్రికాకు బతుకుతెరువు వెతుక్కుంటూ వలస వెళ్లాడు. మనదేశ స్వాతంత్ర్యానికి పూర్వం పుంగనూరులో జమిందారులు ఉండేవారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం విపరీతమైన కరువుతో అల్లాడింది. అలాంటి సమయంలో ఎంతోమంది వివిధ ప్రాంతాలకు వలసలు వెళుతుండేవారు. వారిలో రంగయ్యనాయుడు ఒకరు.
అప్పట్లో దక్షిణాఫ్రికాని నేటాల్ అనేవారు. ఇక్కడ ఉన్న వజ్రాల గనులు సైతం ఆఫ్రికా వెళ్లాలనుకునేవారికి పెద్ద ఆకర్షణగా మారాయి. అందుకే మన దేశం నుండేకాక సింగపూర్, బర్మా, పెనాంగ్ తదితర గ్రామాల నుండి కూడా ఎంతోమంది వలసలు వెళ్లారు. పేదరికం, వ్యవసాయపనులు లేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ కారణాలు వలసలను మరింతగా ప్రోత్సహించాయి.1900 తొలి సంవత్సరాల్లో యువకుడిగా ఉన్న రంగయ్య నాయుడు తనతోటి వలస వెళ్లేవారితో కలిసి ఒక ఏజంటు ద్వారా రెండు జతల బట్టలతో దక్షిణాఫ్రికా చేరాడు. పని దొరికింది. కానీ బ్రిటీష్‌వారి కంపెనీల్లో వెట్టిచాకిరీ ఉద్యోగం ఆయనకు నచ్చలేదు. దాంతో అందులోంచి బయటపడి రకరకాల ఉద్యోగాలు చేస్తూ, అదృష్టాన్ని వెతుక్కుంటూ జీవితంలో ఎదిగారు. వలస భారతీయుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కొడుకులను చదివించుకున్నారు. అలా అక్కడ స్థిరపడిపోయినా పుట్టి పెరిగిన సొంతూరి జ్ఞాపకాలుమర్చిపోలేదు. తన కొడుకులకు, ఇతర కుటుంబ సభ్యులకు సొంత ఊరి విశేషాలు చెబుతుండేవారు. కానీ కొడుకులెప్పుడూ ఆ విషయాలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ రంగయ్యనాయుడు మనుమరాలు మనిర్మినిని మాత్రం ఆ విషయాలు బాగా ప్రభావితం చేశాయి.
ఎక్కడో భారతదేశంలో మారుమూల గ్రామంలో తమపూర్వీకులు ఉన్నారని, తమ కుటుంబ మూలాలు అక్కడ ఉన్నాయని చిన్నతనం నుండి వింటూ వచ్చిన మనిర్మినిలో (మనోరమణి కావచ్చు)ఉద్వేగం పెరుగుతూ వచ్చింది. తన తాతముత్తాతలు పుట్టి పెరిగిన ఊరు, తమ సమీప బంధువుల వివరాలు ఇవన్నీ మనిర్మినిలో ఎంతో ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉండగా కేప్‌టౌన్‌లో ఉన్న యూనివర్శిటీ లైబ్రరీలో దొరికిన ఒక పుస్తకంలోని ఆర్టికల్ ఆమెను ఆకర్షించింది. 1800-1948 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని పుంగనూరు జమిందారీలో ఏర్పడిన కరువు సమస్యని ఎలా పరిష్కరించారు…అనే వివరాలతో కూడిన వ్యాసాన్ని హైదరాబాద్ నుండి ప్రచురితమైన ఆ పుస్తకంలో ప్రచురించారు. పుంగనూరు అనే పేరుని అప్పటికే ఆమె చాలాసార్లు విని ఉంది. అక్కడకు నెల్లిమండ దగ్గరన్న సంగతి కూడా ఆమెకు తెలుసు.
ఆ ఆర్టికల్ రాసింది ఒక హిస్టరీ ప్రొఫెసర్. ఆన్‌లైన్ ద్వారా ఆయనతో మాట్లాడగలిగింది. ఇదే విషయం మీద మరింత సమాచారం ప్రచురించిన పుస్తకాల వివరాలు సైతం తెలుసుకుంది. విపరీతమైన వెతుకులాట తరువాత షిప్పింగ్ రికార్డుల్లో మరిన్ని వివరాలు తెలిశాయి. పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లిమండకు చెందిన 27 సంవత్సరాల రంగయ్య 1903లో మద్రాసు నుండి నేటాల్ కు ప్రయాణించినట్టుగా నమోదై ఉంది. అందులో ఓడ పేరు వివరాలు సైతం ఉన్నాయి. తన తాతగారి వలస ప్రయాణం ఒక చారిత్రక ఘట్టంగా ఆమె కళ్లముందు నిలిచింది.
అప్పటినుండి ఎప్పుడెప్పుడు తాతగారి ఊరు చూద్దామా అని మనసు తొందర పెట్టడంతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తనను గైడ్ చేసేందుకు ఒక ట్రావెల్ ఏజంటుని ఏర్పాటు చేసుకుని చెన్నైలో దిగింది. 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లిమండ గ్రామం చేరుకుంది. తన సన్నిహిత బంధువులను వెతికి పట్టుకుని తననితాను పరిచయం చేసుకుంది. దశాబ్దాల క్రితం తెగిన బంధాన్ని గుర్తుచేసి వారిని అప్రతిభులను చేసింది. వెంకట రమణ అనే బంధువు ఇంట్లో బస చేసింది. తన తాత గురించి తన చుట్టూచేరినవారికి చెప్పుకొచ్చింది. కొంతమంది పెద్దవాళ్లు తమకు ఆ పేరు లీలగా గుర్తుందని, ఆయన గురించిన వివరాలు తమ పెద్దవాళ్ల ద్వారా విని ఉన్నామని అన్నారు. మనిర్మిని లాగానే ఆమె రాక అక్కడ ఉన్నవారినీ ఉద్వేగానికి గురిచేసింది. భాష రాకపోయినా మనిర్మిని తన వారితో కలిసిపోయింది. వారితో ఫొటోలు దిగింది. వీడియో షూట్ చేసి వారందరి పేర్లు వారితో తమకున్న బంధుత్వ వివరాలను రాసుకుంది. కొన్ని గంటల తర్వాత తన కజిన్ వెంకటరమణ నుండి వీడ్కోలు తీసుకుంది.
ఒక పక్క ఆనందంతో నిండిపోయిన గుండెతో, మరోపక్క బరువెక్కిన హృదయంతో మనిర్మిని అక్కడి నుండి వెనక్కు తిరిగింది. దక్షిణ ఆ్రఫికా నుండి అక్కడకు చేరడానికి తాను పడిన శ్రమ, చేసిన ఖర్చు, తాను పొందిన తృప్తి ముందు ఏ మాత్రం ఎక్కువ కాదని మనిర్మిని పేర్కొంది. తన కుటుంబ మూలాలు ఉన్న స్వస్థలం ఎప్పటికీ నెల్లిమండే అవుతుందని, హైదరాబాద్ ప్రొఫెసర్ పుంగనూరు కరువు గురించి రాసిన వ్యాసం చదవకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదంటూ మనిర్మిని ఆయనకు సైతం కృతజ్ఞతలు తెలిపింది.