మేడ్ ఫర్ ఈచ్ అదరే....అయినా ప్రేమెందుకు ఉండదు?
ఒకరికొకరు అనిపించేలా చాలా అందంగా ఉన్నారు….అనే కితాబు పొందిన జంటలను మేడ్‌ఫర్ ఈచ్ అదర్ అంటాం. చూడగానే మనిషిలో ముందు కనిపించేది అందమే కాబట్టి అందం విషయంలో సరితూగడమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు మొదటి అర్థంగా మారిపోయింది. అయితే ఇలాంటి జంటలు సైతం విభేదాలతో విడిపోవడం లేదా తూర్పు పడమరలుగా కాపురాలు చేయడం చూస్తున్నాం. ఇద్దరు మనుషులు సుదీర్ఘకాలం పాటు కలిసి ఉండాలంటే అలవాట్లు, అభిరుచులు కలవడం కాదు…. వారి మానసిక స్థాయి దగ్గరగా ఉండాలి. అంటే ఒక విషయం ఇద్దరికీ ఒకేలా […]
ఒకరికొకరు అనిపించేలా చాలా అందంగా ఉన్నారు….అనే కితాబు పొందిన జంటలను మేడ్‌ఫర్ ఈచ్ అదర్ అంటాం. చూడగానే మనిషిలో ముందు కనిపించేది అందమే కాబట్టి అందం విషయంలో సరితూగడమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు మొదటి అర్థంగా మారిపోయింది. అయితే ఇలాంటి జంటలు సైతం విభేదాలతో విడిపోవడం లేదా తూర్పు పడమరలుగా కాపురాలు చేయడం చూస్తున్నాం. ఇద్దరు మనుషులు సుదీర్ఘకాలం పాటు కలిసి ఉండాలంటే అలవాట్లు, అభిరుచులు కలవడం కాదు…. వారి మానసిక స్థాయి దగ్గరగా ఉండాలి. అంటే ఒక విషయం ఇద్దరికీ ఒకేలా అర్థం కావాలి. కనీసం ఆ విషయం పట్ల విభేదాలు తక్కువ ఉండాలి. దీన్ని వేవ్‌లెంగ్త్ అంటున్నాం. ఇది లేనపుడు స్నేహమైనా, కాపురమైనా నిలబడదు. సరే…వేవ్ లెంగ్త్ తో సంబంధం లేకుండా కూడా చిరకాలం సాగే పెళ్లిళ్లు కొన్ని ఉంటాయి. వీటిని నిలిపి ఉంచేది అంతస్సూత్రంగా ఇద్దరి మధ్య ఉండే ప్రేమ కావచ్చు. లేదా ప్రేమ లాంటి అవసరం కావచ్చు. కుటుంబ బాధ్యతలు, పరువు, పిల్లలు, మరో కొత్త వ్యక్తితో అనుబంధం సాగించగల తీరిక, కోరిక, చాకచక్యం లేకపోవడం వల్ల కూడా కొన్ని కాపురాలు సజావుగా సాగుతున్నట్టుగా కనబడుతుంటాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఆడామగా మధ్య హెచ్చుతగ్గులు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, ఆధునిక మనిషి ముందున్న జీవన లక్ష్యాలు మారిపోవడం….. ఇప్పుడు వివాహబంధాలు విచ్ఛిన్నమవడానికి మూలం గా ఉంటున్నాయి. పెళ్లి బంధం పదికాలాలు నిలబడటం లేదా కాపురం కూలిపోవడం….ఈ రెండు విషయాలు అందరికీ ఒకేలా వర్తించవు. వేలిముద్ర ల్లో ఎంత తేడా ఉంటుందో వైవాహిక బంధాలు అన్ని రకాలుగా ఉంటాయి. కలిసున్నారా, విడిపోయారా అనేదే ప్రపంచం చూస్తుంది కానీ, కలిసి ఉన్నవారి మధ్య ఉన్న అగాథాలను సమాజం పెద్దగా పట్టించుకోదు. అందుకే మనదేశంలో వివాహ వ్యవస్థ విజయవంతమైంది అని చెప్పుకుంటున్నాం.
ఇవన్నీ పక్కన పెడితే వివాహం ఒక నిరంతర ప్రయోగశాలే. మనుషుల మధ్య కెమిస్ట్రీ అనేది అర్థవంతమైన పోలికే. వివాహం మీద ఇప్పటికీ అధ్యయనాలు, పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక అధ్యయనం ఏం చెబుతున్నదంటే పెళ్లికి ముందు ఎక్కువకాలం స్నేహితులుగా ఉన్నవారు దీర్ఘకాలం రొమాంటిక్ వివాహ బంధంలో ఉంటున్నారట. ఇందులో ఉన్న మరొక ఆసక్తికరమైన అంశమేమిటంటే ఇలా స్నేహితులు వివాహబంధంలోకి మారినపుడు అందానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. విషయం ఏమిటంటే పరిచయం అయ్యాక కొంతకాలానికే ప్రేమలో పడి పెళ్లి చేసుకునే జంటలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని, అదే పరిచయం తరువాత చాలా కాలం పాటు స్నేహితులుగా ఉండి, తరువాత వివాహం చేసుకున్నవారు శారీరక అందాన్ని పట్టించుకోవడం లేదని ఈ అధ్యయనంలో తేలింది.
అందుకే పరిచయం అయిన వెంటనే ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకునే జంటల్లో చాలావరకు ఇద్దరూ అందంగా ఉంటున్నారని, అలాకాకుండా చాలాకాలంపాటు ఒకరికొకరు తెలిసి ఉండి తరువాత పెళ్లి చేసుకున్నవారిలో ఒకరు ఆకర్షణీయంగా మరొకరు సాధారణంగా ఉండడం గమనించామని ఆ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు. ఓ సైకలాజికల్ సైన్స్ పత్రికలో ఈ వివరాలు ప్రచురించారు. 167 జంటల మీద ఈ అధ్యయనాన్ని నిర్వహించి చూశారు. ఇందులో మూడు నెలల నుండి యాభైమూడేళ్లుగా కలిసి ఉంటున్న జంటలు ఉన్నాయి. రొమాంటిక్ జంటలుగా చాలాకాలంగా వివాహబంధంలో కొనసాగుతున్నవారు ప్రేమకు ముందు చాలాకాలంపాటు స్నేహితులుగా ఉన్నవారేనని ఈ అధ్యయనం తేల్చింది. వీరు శారీరక అందం, రూపం విషయంలో ఒకరికొకరు సరితూగేలా లేకపోవడమూ గమనించారు. అదే పరిచయం తరువాత వెంటనే ప్రేమలో పడిపోయినవారు ఇద్దరూ అందంగా ఉన్నా వారి మధ్య సహవాస బంధం తక్కువగా ఉండటం చూశారు. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్లు ఈ అధ్యయనం నిర్వహించారు.
-వి. దుర్గాంబ