Telugu Global
Family

గురువు (Devotional)

ఘజ్ఞా విజేత అయిన రాజు మహమ్మద్‌ కాలంలో హైదరాలీజాన్‌ అన్న యువకుడు ఉండేవాడు. అతని తండ్రి పేరు ఇస్కందర్‌ ఖాన్‌. అతను తన కొడుకు రాజాస్థానంలో తగిన పదవిపొందాలని ఆశించాడు. తన కొడుకుని పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించడానికి పంపాడు. హైదరాలీ మత సంబంధమయిన గ్రంథాలు చదివి ఆచార విషయాల్లో ప్రవీణుడయ్యాడు. ప్రతిభావంతుడయ్యాడు. తండ్రి సంతోషించి అతన్ని రాజాస్థానానికి తీసుకువచ్చి రాజుగారికి ప్రణామం చేసి “రాజా! ఇతడు నా పెద్ద కొడుకు. అన్ని విద్యల్లో […]

ఘజ్ఞా విజేత అయిన రాజు మహమ్మద్‌ కాలంలో హైదరాలీజాన్‌ అన్న యువకుడు ఉండేవాడు. అతని తండ్రి పేరు ఇస్కందర్‌ ఖాన్‌. అతను తన కొడుకు రాజాస్థానంలో తగిన పదవిపొందాలని ఆశించాడు. తన కొడుకుని పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించడానికి పంపాడు.

హైదరాలీ మత సంబంధమయిన గ్రంథాలు చదివి ఆచార విషయాల్లో ప్రవీణుడయ్యాడు. ప్రతిభావంతుడయ్యాడు. తండ్రి సంతోషించి అతన్ని రాజాస్థానానికి తీసుకువచ్చి రాజుగారికి ప్రణామం చేసి “రాజా! ఇతడు నా పెద్ద కొడుకు. అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతన్ని మీ సేవకుడిగా నియమించండి” అని ప్రార్థించాడు.

రాజు హైదరాలీని చూసి అతని తండ్రి వైపు తిరిగి “నీ కొడుకును వచ్చే సంవత్సరం తీసుకురా!” అన్నాడు.

అంతగా నిరాశపడకుండా వచ్చే సంవత్సరం తీసుకురమ్మనాడు కదా అని తండ్రి హైదరాలీని వెంటబట్టుకుని ఇంటికి వెళ్ళాడు.

ఆ సంవత్సరం ఇతర విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కళల్లో ఆరితేరాడు. సంవత్సరం గడిచాక ఇస్కందర్‌ఖాన్‌ కొడుకును తీసుకుని రాజుముందు నిలబడ్డాడు. రాజు హైదరాలీని పరిశీలించి తండ్రివేపు తిరిగి “ఇతన్ని ఇంకో సంవత్సరం గడిచాక తీసుకురా!” అన్నాడు.

తండ్రికి కొంత నిరాశ కలిగింది. అయినా నమ్మకంతో తిరిగి వెళ్ళి వివిధ దేశాలు పర్యటించి జ్ఞాన సముపార్జన చెయ్యమని కొడుకును పంపాడు.

హైదరాలీ వివిధ దేశాలు, వింత వింత పరిసరాలు, రకరకాల మనుషుల మనస్తత్వాలు గ్రహించి తిరిగి వచ్చాడు.

ఈసారి తప్పక రాజుగారు తనకొలువులో కొడుకును చేర్చుకుంటారని తండ్రి ఆశించాడు.

ఎప్పట్లా రాజు వచ్చే సంవత్సరం రమ్మని పంపాడు. పూర్తి నిరుత్సాహం కమ్మినా తండ్రి పట్టుదలతో కొడుకుని మక్కా యాత్రకు పంపాడు. ఇండియా, సమర్కాండ్‌ ఇతర దేశాలు తిరిగి తన అధ్యయనానికి హైదరాలీ పదును పెట్టాడు.

కానీ రాజు దగ్గరికి వెళ్ళాలంటే తండ్రికి భయం వేసింది. మళ్ళీ వచ్చే సంవత్సరం రమ్మంటే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే తన సంపదనంతా వెచ్చించి కొడుకును ప్రతిభావంతుణ్ణి చేసినా ఫలితం లేకపోయింది. తండ్రి సంవత్సరం గడిచినా పరిస్థితి ఎలా ఉంటుందో అని దిగులు పడ్డాడు. చివరిసారి కొడుకును తీసుకుని రాజు సముఖంలో నిలబడదామని నిశ్చయించుకున్నాడు. సభకు తండ్రీ కొడుకులు వచ్చారు.

రాజు హైదరాలీని చూసి “ఒక గురువును ఎన్నుకో, అతను నిన్ను శిష్యుడిగా స్వీకరించిన పక్షంలో వచ్చే సంవత్సరం రా” అన్నాడు.

తండ్రి పూర్తిగా నిరాశ పడి తన ప్రయత్నమంతా వృధా అయిందని ఇక జీవితంలో రాజు దగ్గరకు రాకూడదని తీర్మానించుకున్నాడు. కానీ హైదరాలీ ఒక గురువు దగ్గర శిష్యుడుగా చేరాడు. అతను సుప్రసిద్ధ సూఫీ గురువు. అతని దగ్గర జ్ఞాన సముపార్జన చేశాడు. సంవత్సరం గడిచినా హైదరాలీ రాజును సందర్శించలేదు. అతనికి వెళ్ళాలనికూడా అనిపించలేదు. గురువు అతణ్ణి పదవికి మించిన పరిపూర్ణుణ్ణి చేశాడు. అతనికి హైదరాలీ కథ తెలుసు.

రాజు హైదరాలీ తిరిగి రాకపోయే సరికి మంత్రులతో సూఫీ గురువు ఆశ్రమానికి వచ్చాడు. బయట పాదరక్షల్ని వదిలి ఆశ్రమంలో అడుగు పెట్టాడు.

సూఫీ గురువు “రాజా! ఈ హైదరాలీ మీ ఆస్థానంలో అడుగుపెట్టినపుడు అనామకుడు. ఇప్పుడు ఇతన్ని రాజులు కూడా దర్శించదగినంత ఎత్తు ఎదిగాడు. ఇతన్ని మీ సూఫీ గురువుగా స్వీకరించండి” అన్నాడు.

రాజు తలవంచి గురుశిష్యులిద్దరికీ నమస్కరించాడు.

– సౌభాగ్య

First Published:  13 July 2015 6:31 PM IST
Next Story