కల (Devotional)
హసన్ సూఫీ మార్మికుడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఇరవయ్యేళ్ళవాడు. అందరికీ ఆ కుర్రవాడంటే ఎంతో ఇష్టం. అతను అందగాడు. ఆహ్లాదంగా చిరునవ్వు నవ్వేవాడు. అతన్తో మాట్లాడడమన్నా అందరికీ ఇష్టం. అతని ఆకర్షణీయమైన రూపం ముచ్చటగొలిపేది. అతని సమవయస్కులతో ఆటలతో పాటలతో ఆనందంగా గడిపేవాడు. అతను తిరిగే వీధులు, అతని కుటుంబం అతని ఉనికితో ఉల్లాసంగా ఉండేవి. హసన్‌కు అతని కొడుకంటే ఎంతో ఇష్టం. అతని దర్శనంతోనే తండ్రి పులకించేవాడు. అట్లాంటి కొడుకు, ఇరవయ్యేళ్ళవాడు హఠాత్తుగా ఒకరోజు […]
హసన్ సూఫీ మార్మికుడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఇరవయ్యేళ్ళవాడు. అందరికీ ఆ కుర్రవాడంటే ఎంతో ఇష్టం. అతను అందగాడు. ఆహ్లాదంగా చిరునవ్వు నవ్వేవాడు. అతన్తో మాట్లాడడమన్నా అందరికీ ఇష్టం. అతని ఆకర్షణీయమైన రూపం ముచ్చటగొలిపేది. అతని సమవయస్కులతో ఆటలతో పాటలతో ఆనందంగా గడిపేవాడు. అతను తిరిగే వీధులు, అతని కుటుంబం అతని ఉనికితో ఉల్లాసంగా ఉండేవి.
హసన్‌కు అతని కొడుకంటే ఎంతో ఇష్టం. అతని దర్శనంతోనే తండ్రి పులకించేవాడు.
అట్లాంటి కొడుకు, ఇరవయ్యేళ్ళవాడు హఠాత్తుగా ఒకరోజు చనిపోయాడు. ఊరంతా కన్నీరు మున్నీరయింది. కుటుంబం దుఃఖం కట్టలు తెంచుకుంది. శవాన్ని తీసుకుపోవడానికి సిద్ధం చేశారు. అందరూ రోదిస్తున్నారు. కానీ హసన్ ఒక్కడే నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కంట్లో ఒక కన్నీటి బొట్టు కూడా కదలడం లేదు.
అంతలో హసన్ హఠాత్తుగా నవ్వడం మొదలు పెట్టాడు. జనాలు నమ్మలేకపోయారు. పైగా కొడుకుపోవడంతో పిచ్చెక్కిందనుకున్నారు.
“హసన్! ఏమైంది? పిచ్చెక్కిందా? ఈ సంఘటనతో షాక్ తిన్నావా! ఎందుకలా నవ్వుతున్నావు?” అని అడిగారు.
హసన్ “నేను షాక్ తినలేదు, నాకు పిచ్చెక్కలేదు. ఈ సంఘటన జరిగిన క్షణం తలకిందులయ్యాను. దుఃఖం కట్టలు తెంచుకుంది. కానీ వెంటనే ఆలోచనలో పడ్డాను. ఒకప్పుడు నేను సంతోషంగా ఉండేవాణ్ణి. నేను ఒక్కణ్ణే ఉన్నపుడు సమస్యే లేదు. నా కొడుకు పుట్టనప్పుడు అతను ఎప్పుడూ నాతోనే, నాలోనే ఉండేవాడు. అతన్తో ఎడబాటు ఉండేది కాదు. అతను పుట్టాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను ఎప్పట్లా యధాస్థితికి చేరాను. కల ముగిసింది. ఎవరయితే నాకు కొడుకును ఇచ్చాడో అతను తిరిగి తీసుకున్నాడు. ఇదంతా మంచిదికాదని చెప్పడానికి నేనెవర్ని?” అన్నాడు.
ఆ మార్మికుని ఆధ్యాత్మిక దృష్టికి అందరూ ఆశ్చర్యపోయారు.
– సౌభాగ్య