ప్రజాగ్రహారానికి గురి కావద్దు: టీఆర్ఎస్‌కు రేవంత్ హెచ్చరిక
రాజకీయ, స్వప్రయోజనాల కోసం ప్రజలతో చెలగాటమాడడం మానుకోవాలని, లేకపోతే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టి బంద్‌ల వంటి ఉద్యమాలు చేస్తే నిజాలు తెలిసిన తర్వాత తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ఇష్టం లేకుండా ప్రభుత్వమే బంద్‌లు […]
BY sarvi10 July 2015 11:32 AM IST
X
sarvi Updated On: 10 July 2015 11:32 AM IST
రాజకీయ, స్వప్రయోజనాల కోసం ప్రజలతో చెలగాటమాడడం మానుకోవాలని, లేకపోతే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టి బంద్‌ల వంటి ఉద్యమాలు చేస్తే నిజాలు తెలిసిన తర్వాత తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ఇష్టం లేకుండా ప్రభుత్వమే బంద్‌లు నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఈ ప్రాజెక్టుల వల్ల నాలుగు జిల్లాలకు లబ్ది చేకూరుతుందని, అలాంటప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలోనే బంద్‌కు పిలుపు ఇవ్వడంలో అంతర్యం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అక్కర్లేదా అని అన్నారు.
దీన్ని బట్టే ప్రజలంటే ప్రభుత్వానికి ఎంత గౌరవ భావం ఉందో అర్ధమవుతుందని ఆయన అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరని రేవంత్ అన్నారు. బాబు కేంద్రానికి రాసిన లేఖలో సవివర ప్రాజెక్టు నివేదిక (డిపీఆర్) ఇవ్వాలని కోరినట్టు మాత్రమే ఉందని, కాని దీనిపై టీఆర్ఎస్ నాయకులు నెగిటివ్ ప్రచారం సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టును నిలిపి వేయాలని చంద్రబాబు కోరలేదని రేవంత్ అన్నారు. సాగునీరు, తాగునీరు విషయంలో చంద్రబాబు ఏనాడూ మహబూబ్‌నగర్ ప్రజలను ఇబ్బంది పెట్టలేదని, ప్రజల దృష్టిని మరల్చి రాజకీయ ప్రయోజనం పొందాలని మామాఅల్లుళ్ళు చూస్తున్నారని, దీన్ని జనం గమనిస్తున్నారని రేవంత్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ బంద్ ప్రజా వ్యతిరేకం: టీ-కాంగ్రెస్
కాగా అధికారంలో ఉండి బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గు చేటని టీ కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పలువురు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా ప్రభుత్వం బంద్‌కు పిలుపు ఇవ్వడం ద్వారా అరాచకవాదాన్ని సమర్ధించినట్టయ్యిందని వారన్నారు. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకమైతే తాము కూడా సహించబోమని, అయితే ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి చర్యలను వ్యతిరేకించాల్సింది పోయి బంద్‌లు నిర్వహించడం సరికాదని, ప్రజలను ఇబ్బందులు పెట్టే చర్యలను తాము సమర్ధించబోమని ఆయన అన్నారు.
భీమా ప్రాజెక్టు ఖర్చులపై జూపల్లి సవాల్
పాలమూరు ఎత్తిపోతల పథకానికి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అనుకూలమని లేఖ ఇస్తారా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు చేశారు. దిండి, పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి రావుల చంద్రశేఖరరెడ్డి రాసిన లేఖ చూస్తుంటే చంద్రబాబు ఓ హరిశ్చంద్రుడిలా, రావుల ఓ హరిశ్చంధ్రుడి తమ్ముడిలా కనిపిస్తున్నారని ఆయన విమర్శించారు. 1985లో భీమా ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లభించాయని జూపల్లి చెప్పారు. చంద్రబాబు భీమా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, దానికి నిధులు కేటాయించి ఖర్చు చేశారని నిరూపించగలరా అని జూపల్లి నిలదీశారు. తాను రేపు ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వస్తానని, భీమా పథకానికి నిధులు ఖర్చు చేసిన లెక్కలు కాపీ ఇవ్వగలరా అని సవాలు విసిరారు.
Next Story