మగవాళ్లకంటే ఆడవాళ్ల జీవితకాలం ఎందుకు ఎక్కువ?
శారీరక బలంలో మగవారే ఎక్కువైనా, మానసిక శక్తి విషయంలో ఆడవారిదే పైచేయి అని ఇప్పుడు చాలామంది ఒప్పుకుంటున్నారు. అది రుజువైన, అవుతున్న సందర్భాలూ ఎక్కువే. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం తమ భాషలో చెబుతున్నారు. ఆడవారిలో ఇన్నర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని, పైగా అది చాలాకాలంపాటు శక్తివంతంగా ఉంటుందని వారు అంటున్నారు. అంతేకాదు, ఆడవారిలో రోగనిరోధకశక్తి ఎక్కువ ఉంటుంది కనుకనే మగవారికంటే ఎక్కువకాలం జీవిస్తారని కూడా చెబుతున్నారు. ఆడవారికంటే మగవారిజీవితంలో రిస్క్ లు, ప్రమాదాలు, వ్యసనాలు, అనారోగ్యాలు […]
శారీరక బలంలో మగవారే ఎక్కువైనా, మానసిక శక్తి విషయంలో ఆడవారిదే పైచేయి అని ఇప్పుడు చాలామంది ఒప్పుకుంటున్నారు. అది రుజువైన, అవుతున్న సందర్భాలూ ఎక్కువే. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం తమ భాషలో చెబుతున్నారు. ఆడవారిలో ఇన్నర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని, పైగా అది చాలాకాలంపాటు శక్తివంతంగా ఉంటుందని వారు అంటున్నారు. అంతేకాదు, ఆడవారిలో రోగనిరోధకశక్తి ఎక్కువ ఉంటుంది కనుకనే మగవారికంటే ఎక్కువకాలం జీవిస్తారని కూడా చెబుతున్నారు. ఆడవారికంటే మగవారిజీవితంలో రిస్క్ లు, ప్రమాదాలు, వ్యసనాలు, అనారోగ్యాలు వంటివి సైతం ఎక్కువే కనుక వారి జీవితకాలం తక్కువ ఉంటుందనే అభిప్రాయం సైతం ఒకటుంది. కానీ ఇవన్నీ ఉన్నా సహజంగానే ప్రకృతి రీత్యానే ఆడవారిలో ఎక్కువకాలం జీవించే లక్షణాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెబుతున్నారు. ఈ రోజున పుట్టిన ఆడపిల్ల జీవితకాలం 79.8 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. ఇది మగవారి అంచనా జీవితకాలాని కంటే ఐదేళ్లు ఎక్కువ. ఈ గ్యాప్ ఇటీవల కాలంలో తగ్గుతున్నా, ఇప్పుడు మగవారు జీవించేకాలం 30 సంవత్సరాల క్రితం ఆడవారి జీవితకాలంతో సమానంగా ఉంది. స్త్రీలకు సుదీర్ఘజీవిత కాలం ఉండడంపై చేసిన పరిశోధనల్లో తేలిన నిజాలు ఇలా ఉన్నాయి……
- స్త్రీల శరీరంలో ఉండే హార్మోన్లు వారి ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
- లండన్‌లోని ఇంపీరియల్ కాలేజి స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఆడవాళ్లు పుట్టుకతోనే బలమైన రోగనిరోధక వ్యవస్థతో జన్మిస్తారు. అదే వారిని వృద్ధాప్యంలో రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.
- సమాన వయసున్న మగవారిలో కంటే ఆడవారిలో రోగాలపై పోరాడే తెల్ల రక్తకణాలు ఎక్కువగా ఉంటాయి.
- 20నుండి 62 సంవత్సరాల మధ్య వయసున్న 46మంది ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషుల్లో ఈ తెల్ల రక్తకణాలను పరిశోధించి చూడగా, వయసు పెరుగుతున్న కొద్దీ మగవారిలో ఈ కణాల ఉత్పత్తి తగ్గుముఖం పట్టగా ఆడవారిలో మాత్రం వీటి ఉత్పత్తి స్థాయి ఎక్కువగానే ఉన్నట్టుగా గమనించారు.
- టి కణాలుగా పిలువబడే ఈ తెల్లరక్త కణాలను థైమస్ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. మగవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథి పనితీరు తగ్గుతుండగా, ఆడవారిలో మాత్రం చురుగ్గానే కొత్త కణాలను ఉత్పత్తి చేస్తున్నట్టుగా చూశారు.
- మగవారికి తమ పనులు, జీవన శైలి కారణంగా వ్యాధులు, ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళల్లో థైమస్ గ్లాండ్ చురుగ్గా పనిచేయడం కాదనలేని నిజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- కొంతమంది నిపుణులు ఈ విషయంలో ప్రకృతినే బాధ్యురాలిని చేస్తున్నారు. ఆడవాళ్లు భవిష్యత్ తరాలను పెంచుతారు కనుకనే వారికి సుదీర్ఘ జీవితకాలం సహజంగానే అందిందని వారి ఊహ. దీనికి మరికాస్త తాత్విక చింతనని జోడించి, పిల్లల పుట్టుకలో ఆడా, మగా ఇద్దరి ప్రాధానత్య ఉన్నా కానీ, ఆడవారి భౌతిక శరీరం నుండి మరో ప్రాణి ఊపిరి పోసుకుంటుంది కనుక…..వారి శరీరానికి మరింత ఎక్కువగా ఇక్కడ జీవించే పట్టు దొరుకుతుందని వారు భావిస్తున్నారు. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అవినాభావ అనుబంధాన్ని అనుసంధానం చేస్తూ, ఆడవారిలో పునరుత్పత్తి చేసే కాలం తక్కువగా ఉండి, జీవితకాలం ఎక్కువగా ఉండటంలో ఉన్న అర్థం ఇదేనని ఒక శాస్త్రవేత్త అభిప్రాయపడుతున్నారు.
- నిత్యజీవితంలో మగవారు చేసే పనులు కష్టతరంగా, ప్రమాద భరితంగా ఉండటం కూడా ఒక కారణమని, అంతేకాక మగవారిలో టెస్టొస్టెరాన్ హోర్మోన్ స్థాయి ఎక్కువగా ఉండడం వలన వారు యవ్వనంలో రిస్క్ చేసే స్వభావాన్ని కలిగి ఉంటారని, ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారని, వయసు పెరిగాక ఆ ఫలితాన్ని అనారోగ్యాలుగా అనుభవిస్తారని మరొక శాస్త్రవేత్త అంటున్నారు.