సలహా (Devotional)
ఒక రాజు తన దగ్గరున్న ఒక జ్ఞానిని పిలిచి “మీరు నాకు ఒక సలహా ఇవ్వాలి. అయితే అది కేవలం ఒక వాక్యంలో ఉండాలి. అది జీవితంలోని అన్ని సందర్భాల్లో ఉపయోగపడాలి. జీవితంలోని అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించగలగాలి. మాస్టర్ కీ అయివుండాలి” అన్నాడు. ఆ మాటల్తో జ్ఞాని ఇబ్బంది పడిపోయాడు. ఒక్క వాక్యం అన్ని సమస్యలకూ ఎలా పరిష్కారం చూపగలుగుతుంది? అదెలా సాధ్యం అనుకున్నాడు. కొంత సమయం అడిగాడు. నెలలు గడిచిపోయాయి. ఒక […]
ఒక రాజు తన దగ్గరున్న ఒక జ్ఞానిని పిలిచి “మీరు నాకు ఒక సలహా ఇవ్వాలి. అయితే అది కేవలం ఒక వాక్యంలో ఉండాలి. అది జీవితంలోని అన్ని సందర్భాల్లో ఉపయోగపడాలి. జీవితంలోని అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించగలగాలి. మాస్టర్ కీ అయివుండాలి” అన్నాడు.
ఆ మాటల్తో జ్ఞాని ఇబ్బంది పడిపోయాడు. ఒక్క వాక్యం అన్ని సమస్యలకూ ఎలా పరిష్కారం చూపగలుగుతుంది? అదెలా సాధ్యం అనుకున్నాడు. కొంత సమయం అడిగాడు.
నెలలు గడిచిపోయాయి. ఒక రోజు రాజు మళ్ళీ జ్ఞానికి “నేను అడిగిన పని ఏం చేశారు?” అన్నాడు. జ్ఞాని “ఈసారి రెండ్రోజులు సమయమివ్వండి” అన్నాడు. జ్ఞానికి ఏమీ తోచలేదు. రాజుకు మాటయిచ్చాడు. ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఆలోచించుకుంటూ దారిలో వెళుతున్నాడు.
అప్పుడు ఒక సూఫీ గురువు ఎదురు పడ్డాడు. జ్ఞాని సూఫీ గురువుకు నమస్కరించి తన సమస్యను వివరించి, దయచేసి మార్గం చూపండి అని వేడాడు.
సూఫీ గురువు ఒక పేపర్‌పై “ఏమీ చెప్పాల్సిన పన్లేదు, ఇదే సలహా అని ఏదో రాసి ఆ పేపరు మడిచి ఒక తాయెత్తులో పెట్టి జ్ఞానికి ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి రాజుకు ఇవ్వు” అన్నాడు. ఇంకా “ఎట్టి పరిస్థితిలోనూ రాజును తాయొత్తులోని పేపర్‌ని తీసి చూడొద్దని చెప్పు, అవసరమయిన పరిస్థితిలో తప్పని సరయినప్పుడు తప్ప చూడవద్దని చెప్పు” అన్నాడు.
“తప్పకుండా అలాగే చెబుతాను” అన్నాడు జ్ఞాని.
సూఫీ గురువు “ఇది అన్ని పరిష్కారాలకూ మూలం. అన్ని సమస్యలకూ పరిష్కారం. అసాధారణ, అత్యవసర సందర్భాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి” అన్నాడు.
జ్ఞాని ఆ తాయెత్తును రాజుకు ఇచ్చాడు. రాజుకు దాని గురించి చెప్పాడు. రాజు ఎంతో సంతోషించాడు. దాన్ని తీసి చూడాల్సిన సందర్భం కోసం ఎదురు చూశాడు. అట్లాంటి అవకాశమే రాలేదు. రాజుకు ఎన్నో సమస్యలు వచ్చాయి. అప్పడు తాయెత్తును తీసి అందులోని పేపర్లో ఉన్న సలహా చదువుదామనుకునేవాడు. కానీ మళ్ళీ ఆలోచనలో పడేవాడు. ఈ సమస్యని నేను పరిష్కరించలేనపుడు దాన్ని చదువుతాను” అనుకునేవాడు. తనకు వచ్చిన సమస్యను తానే పరిష్కరించుకునేవాడు.
క్రమంగా రాజుకు పేపర్లో ఉన్న సలహాపట్ల ఉత్సుకత పెరిగింది. అందులో ఏముంటుందా? అన్న ఆసక్తి ఎక్కువైంది. కానీ రాజు తనకు పరిష్కరించలేని సమస్య ఎదురయినపుడే, తలకు మించిన ప్రాణాపాయ పరిస్థితిలో మాత్రమే దాన్ని చూస్తాను అని జ్ఞానికి ప్రమాణం కూడా చేశాడు.
అట్లాంటి సమయం వచ్చింది.
పొరుగు రాజు దండెత్తాడు. ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ రాజు పారిపోయి అడవిలోకి వెళ్ళాడు. కొండలలో కోనలలో తిరిగాడు. శత్రువు వెంబడించాడు. శత్రుసైన్యం గుర్రపు డెక్కల శబ్దం రాజు చెవిలో పడింది. శబ్దం దగ్గరగా వస్తున్నట్లు అనిపించింది. చుట్టూ శత్రుసైన్యం చుట్టుముట్టినట్లనిపించింది. తప్పించుకునే మార్గమే లేదు. కొన్ని సెకండ్లలో శత్రువులు ఎదురుపడవచ్చనిపించింది. కొండమీద ఉన్నాడు. కొండ కొమ్మనించీ దూకితే చనిపోతాడు. దిక్కుతోచలేదు. అప్పుడు తాయెత్తు గుర్తొచ్చింది.
రాజు ఆతృతగా తాయెత్తు లోంచీ పేపర్ తీసి చదివాడు. అందులో ఒకే వాక్యం ఉంది. “ఇది కూడా వెళ్ళిపోతుంది!”.
అది చదివి రాజు చిరాకు పడ్డాడు. “ఈ జ్ఞాని నన్ను ఎంత తెలివి తక్కువవాణ్ణి చేశాడు. ఇది రహస్యమా! “ఇది కూడా వెళ్ళిపోతుంది అన్న వాక్యంలో ఏముంది?” అని అనుకుంటూ ఉంటే అంతలో దగ్గరగా వస్తున్న గుర్రాల చప్పుడు క్రమంగా దూరమయిపోయింది. శత్రుసైనికులు రాజును చూడకుండా ఇంకోదిక్కుకు అందరూ కదిలిపోయారు.
రాజు ఆ పేపర్ మడిచి మళ్ళీ తాయెత్తులో పెట్టాడు. రెండురోజుల అనంతరం చెల్లా చెదురయిన తన స్నేహితులు, సైనికులు రాజును చేరారు. అందరూ వ్యూహం పన్ని తిరిగి రాజ్యం కైవసం చేసుకున్నారు.
రాజు సింహాసనం అధిరోహించాడు. విందులు వినోదాలు జరుగుతున్నాయి. రాజుకు ఎందుకో తను ప్రమాదంలో ఉన్నట్లనిపించింది. మళ్ళీ తాయెత్తులోని పేపర్ తీసి చదివాడు “ఇది కూడా వెళ్ళిపోతుంది”.
రాజు వెంటనే జ్ఞానిని పిలిపించి తాయెత్తు గురించి అడిగాడు. తను చదివిన వాక్యం వివరించాడు. జ్ఞాని అదిరాసింది తను కాదు, సూఫీ గురువు అని చెప్పాడు. రాజు తన రాజ్యాన్ని వదిలి సూఫీ గురువును వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.
– సౌభాగ్య