దొంగతనం చేస్తుండగా పట్టుకోవడం తప్పా: కేసీఆర్
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ నేత ధర్మపురి శ్రీనివాస్‌ను ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్న తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ… ఇక దొంగతనం చేస్తుండగా పట్టుకుంటే చంద్రబాబు లొల్లి చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో మనం ఏం చేయలే.. దొంగతనం చేస్తే పట్టుకున్నాం. మొగుణ్ణి […]
BY sarvi8 July 2015 4:21 AM GMT
X
sarvi Updated On: 8 July 2015 5:44 AM GMT
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ నేత ధర్మపురి శ్రీనివాస్‌ను ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్న తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ… ఇక దొంగతనం చేస్తుండగా పట్టుకుంటే చంద్రబాబు లొల్లి చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో మనం ఏం చేయలే.. దొంగతనం చేస్తే పట్టుకున్నాం. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది చంద్రబాబు తీరు అని సీఎం ధ్వజమెత్తారు. సాగిచ్చుకున్నన్ని రోజులు సాగిచ్చుకున్నరు.. మా బతుకు మమ్మల్ని బతుకనివ్వండి అని సీఎం ఘాటుగా స్పందించారు. ఇక ప్రతి పనికి అడ్డుపడటం సరికాదన్నారు. సీమాంధ్రను వదలి తెలంగాణపై పడటం మంచిది కాదన్నారు. సీమాంధ్రలో 13 జిల్లాలున్నాయి.. వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు కదా అని సూచించారు. పొద్దున లేచినప్పటి నుంచీ ఎదుటివారిని తిట్టడమే పనిగా పెట్టుకున్న వారికి ఏం చెబుతామని ఆయన అన్నారు. తెలంగాణ యేడాది బిడ్డని కేసీఆర్ అన్నారు. ఈ బిడ్డను ఆరోగ్యంగా పెంచి పోషించడం తమ మీద ఉన్న బాధ్యతని, ఈ నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. ఉన్న నాలుగు రోజులు ఎంత బాగా పని చేశామన్నదే ముఖ్యమని కేసీఆర్ అన్నారు.
నిజాం గొప్పోడని మహాత్మాగాంధీ కూడా అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. అలాంటి నిజాంను మనం పొగిడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. హిందు-ముస్లింల అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని, తెలంగాణ మేధావులంతా ఒక్క తాటిపైకి వచ్చి అభివృద్ధికి సహకరించాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ పోరాటంలో అంతిమంగా ప్రజలే విజయం సాధించారని సీఎం అన్నారు. టీఆర్ఎస్ బలోపేతం కావడం అంటే తెలంగాణ బలోపేతం కావడమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు భావించి అధికారం ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే డీఎస్ వంటి వ్యక్తుల సహకారం అవసరం అవుతుందని అన్నారు. డీఎస్ లాంటి వ్యక్తికి పదవి లెక్క కాదని, పార్టీ మీద అభిమానంతోనే, తెలంగాణను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారని కేసీఆర్ అన్నారు. డీఎస్‌తో తనకు మూడున్నర దశాబ్దాల స్నేహం ఉందని, పార్టీకి ఆయన సేవలు ఎంతో ఉపయోగపడతాయని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భంగా మాట్లాడిన డిఎస్ బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌కు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ దీక్ష చేశారని, ఉద్యమంలో తెలంగాణ వాదులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతూ దీన్ని తెచ్చిన ఘనత మాత్రం కేసీఆర్‌కే దక్కుతుందని డి.శ్రీనివాస్ అన్నారు. డీఎస్‌తోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా ఆయనతోపాటు టీఆర్ఎస్‌లో చేరారు.
Next Story