హరిత హారం అట్టర్‌ఫ్లాప్ కానున్నదా?
తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా, మరెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన హరితహారం కార్యక్రమం పూర్తిగా వృథాగా మారబోతున్నది. ఈ సీజన్‌లో 40 కోట్ల మొక్కలను నాటాలని, తెలంగాణ మెడలో పచ్చని తోరణం హారంగా వేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపోస్తున్నారు. జిల్లాల్లో అనేక చోట్ల హరితహారం కార్యక్రమాలలో ఆయన స్వయంగా పాల్గొంటూ కార్యకర్తలను, ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఇదంతా నిష్ఫలమేనట. ఈ మాటలంటున్నది ఎవరో కాదు…. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన నిపుణులు, వ్యవసాయ […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా, మరెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన హరితహారం కార్యక్రమం పూర్తిగా వృథాగా మారబోతున్నది. ఈ సీజన్‌లో 40 కోట్ల మొక్కలను నాటాలని, తెలంగాణ మెడలో పచ్చని తోరణం హారంగా వేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపోస్తున్నారు. జిల్లాల్లో అనేక చోట్ల హరితహారం కార్యక్రమాలలో ఆయన స్వయంగా పాల్గొంటూ కార్యకర్తలను, ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఇదంతా నిష్ఫలమేనట. ఈ మాటలంటున్నది ఎవరో కాదు…. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు… హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న కోట్లాది మొక్కలు కొద్ది రోజుల్లోనే చచ్చిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బతికి ఎదగడానికి అవసరమైన వయసు ఆ మొక్కలకు లేదట. రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాట కార్యక్రమం కోసం హడావిడిగా మొక్కలు తెచ్చి ఊరూరా పంచుతున్నారు తప్ప బతకడానికి సరిపడా వయసు వాటికి లేదన్న విషయాన్ని గుర్తించడం లేదంటున్నారు. తెలంగాణలో వేడి తీవ్రత ఎక్కువ. వర్షపాతం తక్కువ. ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితిని తట్టుకోవాలంటే కనీసం 9 నెలలన్నా ఆ మొక్కకు వయసుండాలి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మార్చి నెలలో విత్తనాలు వేస్తే వచ్చిన మొక్కలను తెచ్చి ఊరూరా పంచుతున్నారని, అవి బతికే అవకాశాలు తక్కువని వారంటున్నారు. నల్గొండనే తీసుకుంటే అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఆ జిల్లాలో 5 కోట్ల టేకు మొక్కలను నాటుతున్నారు. తగినంత వయసు లేని ఆ టేకు మొక్కలు బతికే అవకాశమే లేదు. ఈ ఏడాది వర్షపాతం కూడా తక్కువే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఆ కారణం కూడా హరితహారం కార్యక్రమానికి విఘాతంగా మారబోతున్నది.