చూపు (Devotional)
కళ్ళున్న వాళ్ళు చూస్తారు. కళ్ళు లేనివాళ్ళు చూడరు. ఇది సాధారణంగా అందరూ అనుకునే విషయం. కానీ అందరూ అన్నీ చూస్తారనడానికి లేదు. మన నమ్మకాలు మనవి. దేన్ని చూడాలో దేన్ని పరిహరించాలో చూపుతాయి. ఆ విషయం మనల్ని మనం పరిశీలించుకుంటే కానీ తెలీదు. ఇతరులు ఆ విషయం ఎత్తి చూపినపుడు మనం ఆశ్చర్యపోతాం. లక్ష్యశుద్ధి వేరు. భారతంలో తన శిష్యులందరికి విలు విద్య నేర్పుతూ ద్రోణాచార్యుడు వాళ్ళ లక్ష్య శుద్ధిని పరీక్షించడానికి కౌరవ పాండవుల్ని ఒక […]
కళ్ళున్న వాళ్ళు చూస్తారు. కళ్ళు లేనివాళ్ళు చూడరు. ఇది సాధారణంగా అందరూ అనుకునే విషయం. కానీ అందరూ అన్నీ చూస్తారనడానికి లేదు. మన నమ్మకాలు మనవి. దేన్ని చూడాలో దేన్ని పరిహరించాలో చూపుతాయి. ఆ విషయం మనల్ని మనం పరిశీలించుకుంటే కానీ తెలీదు. ఇతరులు ఆ విషయం ఎత్తి చూపినపుడు మనం ఆశ్చర్యపోతాం.
లక్ష్యశుద్ధి వేరు. భారతంలో తన శిష్యులందరికి విలు విద్య నేర్పుతూ ద్రోణాచార్యుడు వాళ్ళ లక్ష్య శుద్ధిని పరీక్షించడానికి కౌరవ పాండవుల్ని ఒక వృక్షం దగ్గరకు తీసుకెళ్ళాడు. ఒక్కో శిష్యుణ్ణి విల్లు ఎక్కుపెట్టమని చెప్పి పైకి చూసి అక్కడ ఏం కనిపిస్తుందో చెప్పమని అడిగాడు. ఒకరు ఆకాశం కనిపిస్తోందన్నారు. ఒకరు చెట్టు కనిపిస్తోందన్నారు. ఇంకొకరు కొమ్మలు కనిపిస్తున్నాయన్నారు. ఇట్లా ఒక్కొకరు ఒక్కో సమాధానం చెప్పారు. అర్జునుడు ఇవేమీ కనిపించడం లేదన్నాడు. కొమ్మపైన ఉన్న పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందన్నాడు.
ఇది లక్ష్య దృష్టి. దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి.
మనం చెప్పుకుంటున్నది లక్ష్యదృష్టి గురించి కాదు. విశ్వాసానికి సంబంధించిన దృష్టిని. అందరూ విశ్వాసం గొప్పదంటారు. విశ్వాసంలో విచక్షణ ఉండదు. విచక్షణ లేని దృష్టి వికటిస్తుంది.
ఒక వ్యక్తి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్‌ని ఫలానా వీధికి వెళ్ళమన్నాడు. ఆ వీధిలో ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఆ వీధిలో ఉన్న మసీదు పక్క సందులోకన్నాడు. ఆటో డ్రైవర్ అక్కడ గుడివుంది మసీదు లేదన్నాడు. లేదయ్యా అక్కడ మసీదు ఉంది. ఆ మసీదు పక్కనే సన్న సందువుంది” అన్నాడు.
ఆటో డ్రైవర్ అక్కడ మసీదులాంటిదేమీలేదు, గుడి మాత్రమే ఉంది అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ వ్యక్తి “సరే మొదట ఆ వీధిలోకి పద చూద్దామన్నాడు. ఆ వీధి చివరికి ఆటోవచ్చింది. అక్కడ గుడి ఉంది, మసీదు కూడా ఉంది, పక్కన సన్న సందు ఉంది. ఆ వ్యక్తి మసీదును ఆటోడ్రైవర్‌కు చూపించాడు. పక్కన ఉన్న గుడికన్నా ఐదింతలు మసీదు ఉంది. గుడిచాలా చిన్నది. ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోయాడు.
అతని ఉద్దేశంలో తను గుర్తించుకోవాల్సింది గుడి మాత్రమే. మసీదు కాదు. అందు వల్ల అతను మసీదు ఉనికిని విస్మరించాడు. గుడిని మాత్రమే గుర్తుంచుకున్నాడు. అది అతని విశ్వాసం ఏర్పరిచిన దృష్టి. మనకు నచ్చింది గుర్తుంచుకోవడం, తక్కింది మరచిపోవడం, నిర్లక్ష్యం చెయ్యడమన్నది నిజమైన విశ్వాసం కాదు. అది మనకు నచ్చిన వాటి పట్ల ఇష్టం, నచ్చని వాటిపట్ల ద్వేషం కలిగిస్తుంది.
నిజానికి రెండూ ఉనికిలో ఉన్నాయి. మన ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గుర్తించని కారణంగానే మనుషుల్లో ద్వేషాలు, ప్రతీకారాలు ఘర్షణలు తలెత్తుతాయి. ఆమోదించక పోవడమనేది ఎప్పుడూ అగ్నికి ఆజ్యం పోస్తుంది.
– సౌభాగ్య