ఒక ఇండియా...రెండు కథలు
భారతదేశంలో వంద స్మార్ట్ సిటీలు నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. 98వేల కోట్ల కేటాయింపులు చేసింది. 500 పట్టణాలు, నగరాలను నగర పునర్నిర్మాణ పథకం కింద వచ్చే ఐదేళ్లలో ఆధునీకరించాలని సైతం తలపెట్టింది.. దేశవ్యాప్తంగా 12 వారసత్వ నగరాలను నిర్మించే ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నారు. అంతేకాదు, స్మార్ట్ పోర్టులు, స్మార్ట్ ఆర్మ్ డ్ ఫోర్స్ స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్ సిటీలు, స్మార్ట్ విలేజిలు….వీటన్నింటతో భారతదేశపు రూపురేఖలను మార్చేయాలని, ప్రపంచ పటంలో మనదేశం ఆధునిక, ప్రగతి వెలుగులు విరజిమ్మాలని ప్రభుత్వం సంకల్పించింది. సత్యజిత్‌రే కళాత్మక సినిమాల్లో కనిపించే పేదరికం లుక్ వదిలించుకుని దేశం, […]
భారతదేశంలో వంద స్మార్ట్ సిటీలు నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. 98వేల కోట్ల కేటాయింపులు చేసింది. 500 పట్టణాలు, నగరాలను నగర పునర్నిర్మాణ పథకం కింద వచ్చే ఐదేళ్లలో ఆధునీకరించాలని సైతం తలపెట్టింది.. దేశవ్యాప్తంగా 12 వారసత్వ నగరాలను నిర్మించే ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నారు. అంతేకాదు, స్మార్ట్ పోర్టులు, స్మార్ట్ ఆర్మ్ డ్ ఫోర్స్ స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్ సిటీలు, స్మార్ట్ విలేజిలు….వీటన్నింటతో భారతదేశపు రూపురేఖలను మార్చేయాలని, ప్రపంచ పటంలో మనదేశం ఆధునిక, ప్రగతి వెలుగులు విరజిమ్మాలని ప్రభుత్వం సంకల్పించింది. సత్యజిత్‌రే కళాత్మక సినిమాల్లో కనిపించే పేదరికం లుక్ వదిలించుకుని దేశం, వందకోట్లు వసూలు చేసే బాలివుడ్ కమర్షియల్ సినిమాలా కళకళలాడి పోతుందని ప్రభుత్వం ప్రజల కళ్ల ముందు కలల తెరలు ఆవిష్కరిస్తోంది. ఇది మొదటి కథ…..
ఇక రెండవ కథకొద్దాం…ముంబయిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వృద్ధురాలు పడుకుని ఉంది. ఆమె వయసెంతో చెప్పలేం. ఎనభై ఉండవచ్చు. తొంభై ఉండవచ్చు. పేదరికం, వృద్ధాప్యం రెండూ నేను ముందంటే నేను ముందు అన్నట్టుగా ఆమెలో పోటీ పడుతున్నాయి. రత్నగిరికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో పుట్టిందామె. పెళ్లయిన కొన్నేళ్లకే చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది. ఒక్క కూతురు మాత్రమే ఉంది. అయితే ఆమె కూడా వితంతువే. ఆ ఇద్దరి ఇల్లు ముంబయి స్లమ్ ఏరియాలో 15, 10 అడుగుల పొడవు వెడల్పులున్న ఒక గది. ఆ ఇంటికి నీళ్ల వసతి లేదు. ఎక్కడినుంచైనా తెచ్చుకుని నిల్వ ఉంచుకోవాలి. టాయిలెట్ కూడా లేదు. పావుగంట వేగంగా నడిచి దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్‌కి వెళ్లాలి. వాళ్లిద్దరి జీవితాలూ ఒకరికొకరు అన్నట్టుగా సాగిపోయాయి.
వీరికి ఏ గౌరవం గుర్తింపు లేవు కానీ వాళ్లు బతికింది మాత్రం ఇతరుల కోసమే. ఇళ్లలో పనులు చేస్తూ తమ జీవితాలు పోషించుకుంటున్నారు.. వంటిళ్లలో, ఇళ్లలో ఒక్కరోజు వారు చాకిరి మానేస్తే కొంతమంది జీవితాలు ముందుకే సాగవు. అయినా వారు పొందినది డబ్బు రూపంలో చాలా తక్కువ. అనారోగ్యం మాత్రం ఎక్కవే పొందారు. గంటలకొద్దీ వంటిళ్లలో నిలబడి వండటం, నీళ్ల బక్కెట్లు మోయడం, నేలని తుడవడం ఇలాంటి చాకిరితో ఆ ఇద్దరు మహిళల కీళ్లు పూర్తిగా అరిగిపోయాయి. ఇద్దరూ ఎక్యూట్ ఆర్థరైటిస్‌కి గురయ్యారు. మోకాళ్ల జాయింట్లు వాచిపోయాయి. కదులుతుంటే విపరీతంగా బాధపెడుతున్నాయి. పెద్దావిడ పరిస్థితి మరింత బాధాకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరింది. ఆరు బెడ్‌లు ఉన్న ఉమెన్ వార్డ్ అది. ఆమె నివసించే గది కంటే పెద్దగా ఉంది ఆ గది. ఆమెకు ఆక్సిజన్ ఏర్పాటు ఉంది. మంచి బెడ్, ఆహారం, నర్సుల పర్యవేక్షణ ఉంది నిజానికి ఆమె ఆ మాత్రం మంచి జీవితం అనుభవించి చాలా ఏళ్లయింది. అయితే ఆ సుఖం కూడా ఆమెకు ఎక్కువ రోజులు ఉండదు. అనారోగ్యం గుర్తించి మందులు ఇచ్చాక అక్కడ నుండి వెళ్లిపోవాలి. ఇలాంటి వృద్ధులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. పేదరికం, వృద్ధాప్యం, అనారోగ్యం కలిసి ముప్పేట దాడిగా మారి తే విలవిల్లాడుతున్న వృద్ధులు. మన నగరాల్లో 26శాతం మంది ప్రజలు పేదరికం రేఖకు దిగువన బతుకుతున్నారు. పైన చెప్పుకున్న వృద్ధ మహిళ మనదేశంలో ప్రతి పేద మహిళకు ఒక ప్రతీక. స్మార్ట్, గ్లోబల్ నగరాలతో దేశం ముఖచిత్రాన్ని మారుస్తామంటున్న మేధావులకు చితికిన బతుకు చిత్రాలను మార్చడం ముఖ్యమన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదో.
స్మార్ట్ సిటీల్లో ఒకవైపు పదుల సంఖ్యలో అంతస్తులున్న భవనాలు… మరొకవైపు ఎముకలు అరిగిన పేద వృద్ధ అనాథ మహిళలు…. మరొక భిన్నత్వంలో ఏకత్వం….అంతే!