భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేకి నిరసనల దెబ్బ
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి స్ఠానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదురవుతున్నది. ఈ విమానాశ్రయం కోసం ఐదువేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే భోగాపురం మండలంలోని గ్రామాలలో సర్వే చేయడం కోసం రెవెన్యూ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలెదురవుతున్నాయి. భోగాపురం మండలం కొయ్యపేట గ్రామంలో సర్వే చేయడానికి వెళ్లిన సిబ్బందిని గ్రామస్తులు దూరంగా తరిమికొట్టారు. ”ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సర్వేలను ఆపకపోతే ప్రాణాలైనా ఇస్తాం… అవసరమైతే ప్రాణాలైనా తీస్తాం.” అని గ్రామస్తులు […]
BY Pragnadhar Reddy4 July 2015 1:05 AM IST
X
Pragnadhar Reddy Updated On: 4 July 2015 4:20 AM IST
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి స్ఠానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదురవుతున్నది. ఈ విమానాశ్రయం కోసం ఐదువేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే భోగాపురం మండలంలోని గ్రామాలలో సర్వే చేయడం కోసం రెవెన్యూ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలెదురవుతున్నాయి. భోగాపురం మండలం కొయ్యపేట గ్రామంలో సర్వే చేయడానికి వెళ్లిన సిబ్బందిని గ్రామస్తులు దూరంగా తరిమికొట్టారు. ”ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సర్వేలను ఆపకపోతే ప్రాణాలైనా ఇస్తాం… అవసరమైతే ప్రాణాలైనా తీస్తాం.” అని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామంలో సర్వే కోసం వెళ్లిన సర్వేయర్లను, విఆర్‌ఒలను అడ్డుకున్నారు. సర్వేను ఆపకపోతే తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ కొందరు గ్రామస్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకొన్నారు. సర్వేకు వచ్చిన సిబ్బందిని చీపుర్లు, చేటలు, కర్రలతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెంటబడి తరిమారు. ఇకపై తమ భూముల్లో సర్వే చేయడాని కొచ్చే వారు ప్రాణాలతో బయటకు వెళ్లలేరని, అవసరమైతే తమ ప్రాణాలైనా ఇస్తామని, లేదంటే సర్వేకు వచ్చిన వారి ప్రాణాలైనా తీస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి గ్రామస్తులంతా ర్యాలీగా చేరుకున్నారు. ఎయిర్ పోర్టుకు భూసమీకరణను ఆపకపోతే ఆత్యహత్య చేసుకుంటామంటూ తమ వెంట తెచ్చిన పురుగు మందుల డబ్బాలతో తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. విమానాశ్రయానికి భూములను ఇచ్చేది లేదని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. “ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు ఎన్ని రోజులు తినడానికి సరిపోతాయి? ఆ తరువాత మా బతుకులు ఏమిటి?” అని అధికారులను నిలదీశారు. విమానాశ్రయం కట్టాలనుకుంటే తమ సమాధుల పై కట్టాలి తప్ప సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. దాదాపు అన్ని గ్రామాలలోనూ ఇదే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే కోసం వెళితే తరిమేస్తున్నారని, ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం తప్ప తాము చేయగలిగిందేమీ లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
Next Story