Telugu Global
Family

గంగ (For Children)

గంగను గురించి ఒక్కోపురాణంలో ఒక్కో కథ ఉంది! వామనుడు మూడడుగుల నేల కోరి ఒక అడుగు భూమి మీద, ఒక అడుగు ఆకాశం మీద, మూడో అడుగు బలి శిరస్సు మీద ఉంచాడు కదా… అలా ఆకాశంలో ఉన్న పాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. అలా వామనుడు అంటే విష్ణుమూర్తి పాదాలు కడిగిన నీళ్ళు ప్రవహించాయట. అదే గంగానది అయ్యిందట! మరో కథ కూడా ఉంది. గంగ, లక్ష్మి, సరస్వతి ముగ్గురూ విష్ణుమూర్తి భార్యలని […]

గంగను గురించి ఒక్కోపురాణంలో ఒక్కో కథ ఉంది!

వామనుడు మూడడుగుల నేల కోరి ఒక అడుగు భూమి మీద, ఒక అడుగు ఆకాశం మీద, మూడో అడుగు బలి శిరస్సు మీద ఉంచాడు కదా… అలా ఆకాశంలో ఉన్న పాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. అలా వామనుడు అంటే విష్ణుమూర్తి పాదాలు కడిగిన నీళ్ళు ప్రవహించాయట. అదే గంగానది అయ్యిందట! మరో కథ కూడా ఉంది. గంగ, లక్ష్మి, సరస్వతి ముగ్గురూ విష్ణుమూర్తి భార్యలని – వారి ముగ్గురితో విష్ణుమూర్తివున్నప్పుడు గంగ కంటిరెప్ప ఆర్పకుండా చూసిందని – నవ్వుతూ చూసిన విష్ణుమూర్తి గంగను ముద్దు పెట్టుకున్నాడని – అసూయతో గంగను సరస్వతి దూషించిందని – ఆ వాదులాటలో గంగా సరస్వతులిద్దరూ “నదిగా మారమని” ఒకరినొకరు శపించుకున్నారని – తగువును చూస్తున్న లక్ష్మిని చూసి అయోనిజగా పుట్టమని విష్ణువు శపించాడని కథ.

ఇంకో కథ కూడా ఉంది. గంగ గోలోకంలో జలరూపంలో తిరుగుతూ ఉంటే ఆమెతో ఆడిపాడిన కృష్ణుడు మోహించాడట. రాధకు తెలిసి కృష్ణుని నిందించిందట. దాంతో గంగ భయపడిందట. ఎక్కడ దాక్కోవాలో తెలియక కృష్ణుని పాదాల కింద దాక్కుందట. గంగాజలం లేకపోతే గొంతెండి పోదూ? దాహంతో దప్పికతో లోకం తలక్రిందులయిందట. బ్రహ్మ మహేశ్వరులే దిగి వచ్చారట. గంగకు భయంలేదని అభయం ఇచ్చారట. ఎప్పటిలా అంతటా తిరిగి ప్రవహించమన్నారట. విష్ణుమూర్తి విడిపించి వెళ్ళమన్నాడట. గంగ జలకళతో సాగిందట. బ్రహ్మ తన కమండలంలో నింపుకున్నాడట. శివుడు శిరస్సున ధరించాడట! ఈ కథలన్నీ బ్రహ్మ వైవర్తపురాణంలో ఉన్నాయి.

గంగ తొలి జన్మలో కళ, మారీచులకు పుట్టిన కూతురని – అప్పుడామె పేరు పూర్ణిమని – జన్మాంతరాన హరి పాదాలను కడిగిన గంగగా పుట్టిందని – దేవకుల్య, విరజుడు అనే పిల్లల్ని కన్నదని భాగవత కథ చెప్తోంది.

భారతంలో శంతన మహారాజును పెళ్ళాడిన కథ తెలుసును కదా? ఇంద్రసభలో గాలి వీచి గంగపైట చెదిరినప్పుడు అందరూ తల తిప్పుకున్నా, మహాభిషుడు మాత్రం చూసాడని – సభ్యత మరచి బ్రహ్మశాపానికి లోనయ్యాడని – భూలోకంలో శంతనుడుగా పుట్టాడని వెనకటి కథ. విశిష్ట ముని గోవును భార్యల ఆశ మేరకు దొంగలించిన అష్ట (ఎనిమిది) వసువులు (సన్యాసులు) శాపానికి లోనయ్యారని – ఇంద్రసభ నుండి వస్తున్న గంగకు ఎదురై తమ గోడు చెప్పుకున్నారని – తల్లిగా జన్మనిచ్చి శాపవిమోచన చేస్తానని చెప్పి ప్రతీపుని చేరిందని – అతని కుడితొడ మీద కూర్చుందని – అలా కూర్చునే స్థానం కొడుకుదని – కొడుకు శంతనుని పెళ్ళాడమని కోరాడని – ఆమాటే శంతనునికి చెప్పాడని – శంతనుడు గంగను పెళ్ళాడాడని – ఆమె షరతులకు ఒప్పుకోవడం వల్ల ఏడుగురు బిడ్డల్ని కని గంగలో పడేసిందని – ఎనిమిదో బిడ్డను గంగలో కలపకుండా అడ్డుకున్నాడని – ఎదురు చెప్పినందుకు గంగ బిడ్డతో సహా వెళ్ళి పోయిందని – ఆ బిడ్డనే పెంచి పెద్ద చేసి విద్యాబుద్దులు నేర్పి తిరిగి శంతనునికి అప్పగించిందని – అతడే భీష్ముడని – గంగ పుత్రుడని ఎరిగిందే!

బ్రహ్మాండ పురాణంలో గంగ గురించి భగీరధుడు చేసిన ప్రయత్నాలు తెలుసుకుంటే గంగకు భాగీరథియని పేరెందుకొచ్చిందో అర్థమవుతుంది. భగీరధుడు గంగను ప్రార్థించి వరంగా తనతో భూతలానికి రమ్మని కోరాడు. నా భారాన్ని వహించే వారెవరని గంగ అడిగింది. శివుడు భగీరధుని వల్ల అందుకు అంగీకరించాడు. గంగ ప్రవహించడంతో జిహ్నువుని యాగస్థలం మునిగిపోయింది. దాంతో గంగను జిహ్నువు పీల్చి వేయడంతో భగీరధుడు మళ్ళీ ప్రయత్నించి జిహ్నువును ప్రసన్నం చేసి గంగను తెచ్చాక – ఆ పావన జలం తాకి నగర పుత్రులు అరవైవేల మంది స్వర్గస్తులయ్యారు.

తొలి పద్నాల్గులోకాలు ప్రళయకాలాన పడి అంతమైనా గంగమిగిలింది. గర్వంతో ఉప్పొంగింది. తుంపర కైలాసాన్ని తాకింది. శివునికి కన్నెర్రయ్యింది. భూలోకాన జంగం కులంలో పుట్టమని శపించాక – తాను కూడా పుట్టి పెళ్ళాడతాననడంతో గంగకు ఉపశమన మయ్యింది. అలా వారికి పుట్టిన వాడే కుమారస్వామి అనే కథ ఉంది! గంగ ఎన్ని తావుల పోయిందో అన్ని కథలున్నాయి!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  2 July 2015 6:32 PM IST
Next Story