సుభద్ర (For Children)
అర్జునుని భార్య సుభద్ర. అంతకన్నా ముందు రోహిణీ వసుదేవుల తనయ. శ్రీ కృష్ణునికి చెల్లి. ఆ తర్వాత అభిమన్యునికి తల్లి. సుభద్రకు వయసొచ్చింది. అర్జునుని మీద వలపొచ్చింది. అర్జునుని యోప్పుడూ చూడలేదు. అతని అందం గురించి విన్నది. అంతకు మించి విలు విద్యా పరాక్రమాల గురించి విన్నది. నా మనసు తనదేనన్నది. ఆశపడ్డది. అయితే పెద్దన్నయ్య బలరామునికి పాండవులంటే ఇష్టం లేదు. బంధుత్వం కలుపుకొని నిలుపుకోవాలన్న ఆశా లేదు. పైగా పాండవులు అడవుల్లో ఉంటున్నారన్న అభిప్రాయమూ […]
అర్జునుని భార్య సుభద్ర. అంతకన్నా ముందు రోహిణీ వసుదేవుల తనయ. శ్రీ కృష్ణునికి చెల్లి. ఆ తర్వాత అభిమన్యునికి తల్లి.
సుభద్రకు వయసొచ్చింది. అర్జునుని మీద వలపొచ్చింది. అర్జునుని యోప్పుడూ చూడలేదు. అతని అందం గురించి విన్నది. అంతకు మించి విలు విద్యా పరాక్రమాల గురించి విన్నది. నా మనసు తనదేనన్నది. ఆశపడ్డది. అయితే పెద్దన్నయ్య బలరామునికి పాండవులంటే ఇష్టం లేదు. బంధుత్వం కలుపుకొని నిలుపుకోవాలన్న ఆశా లేదు. పైగా పాండవులు అడవుల్లో ఉంటున్నారన్న అభిప్రాయమూ ఉంది. అందుకనే దుర్యోధనునికి తన చెల్లిని ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. కాని చిన్నన్నయ్య కృష్ణుడికి చెల్లెలు సుభద్ర మనసు తెలుసు. అభీష్టం తెలుసు. మనో అభీష్టం నెరవేర్చాలనుకున్నాడు. పైగా పాండవ పక్షపాతి. అందుకే సుభద్ర అర్జునుని మెచ్చడం నచ్చింది. ప్రభాస తీర్థం వచ్చిన అర్జునుడు కృష్ణుని చూడవస్తే యతి (సన్యాసి)లాగ ఉండమన్నాడు. పథకం ఫలించింది. యతిని బలరాముడు భక్తితో ఆహ్వానించి ఉద్యాన వనంలో ఆశ్రయమిచ్చాడు. అతిధి మర్యాదలకు సేవలకు సుభద్రని పంపాడు. తెలియని సుభద్ర మీ తీర్థయాత్రల్లో మా చిన బావ కనిపించినాడా? అని అర్జునుని గురించి అర్జునునే అడిగింది. నవ్వుకున్నాడు. దొంగ మీసాలూ గడ్డాలు తీసి, తానే అర్జునుడినని చెప్పాడు. సిగ్గుపడింది. అర్జునుడు మనం గాంధర్వ వివాహం చేసుకుందామన్నాడు. మా అన్న శ్రీకృష్ణుడే అన్నీ చూస్తాడంది. సుభద్ర నమ్మకాన్ని నిలబెట్టాడు కృష్ణుడున్నూ. ఉత్సవాలు చేద్దామన్నాడు. ఉత్సవ పండుగలో ఊరు ఊరంతా ఉండగా – బలరాముడూ అక్కడే ఉండగా – సుభ్రదా అర్జునుల పెళ్ళి జరిపించేసి ఇంద్రప్రస్థానికి పంపాడు కృష్ణుడు. అయితే ఈ విషయం తెలిసి పాలకులు, రక్షకులు అడ్డుకున్నారు. అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే సుభద్రే రథం నడిపింది. వీరునికి తగిన ఇల్లాలుగా వీర వనిత అనిపించుకుంది.
సుభద్రతో అర్జునుడు ఇంద్ర ప్రస్థం చేరాడు. చేరాడేగాని ద్రౌపది ఏమంటుందోనని భయపడ్డాడు. ఇంట్లోకి అడుగుపెడుతూ ద్రౌపది పాదాలకు నమస్కరించమన్నాడు. భర్త మాట ప్రకారమే సుభద్ర ద్రౌపది పాదాలకు నమస్కరించింది. తదనంతరమూ ఆ భక్తినీ గౌరవాభిమానాల్ని సుభద్ర కొనసాగించింది.
శ్రీకృష్ణుడు అన్న బలరాముని నిందలకు అర్హమైన వాడే కాబట్టి ఇదంతా నీపనే అన్నా – అన్నా సుభద్ర అర్జునుని కోరుకుంది. చెల్లెలు కోరిక తీర్చడం అన్నలుగా మన ధర్మం. యుద్ధం కాదు చేయవలసింది. ఇవ్వవలసింది కట్న కానుకలు – అన్నాడు. అంతా సుభద్రను చూడ వచ్చారు – సమస్య తీరింది.
సుభద్రకు కొడుకు పుట్టాడు. అతనే అభిమన్యుడు. అర్జునుడు అరణ్యవాసానికి వెళ్ళగా – కొడుకుని తీసుకొని సుభద్ర పుట్టినిళ్ళు ద్వారక చేరింది. అభిమన్యున్ని అమ్మానాన్నా అన్నీ తానే అయి పెంచింది. పెద్ద చేసింది. అరణ్యవాసం ముగిసే సమయానికి విరాట నగరం చేరింది. భర్తను కలిసింది. కొడుకుని అర్జునుని ఎదుట నిలబెట్టింది. తన బాధ్యతను నిలబెట్టుకుంది!.
– బమ్మిడి జగదీశ్వరరావు