Telugu Global
Family

ద్రౌపది (For Children)

పాంచాల రాజు కూతురు కాబట్టి ఆమె “పాంచాలి”. పంచ పాండవుల్ని భర్తగా పొందింది కాబట్టి “పంచ భర్తృక”. విరాట్‌రాజు కొలువులో అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు “సైరంధ్రి”. ఎవరేమని పిలిచినా ఆమె ద్రౌపది!             ద్రౌపది తండ్రి ద్రుపదుడు. యజ్ఞం చేసాడు. యజ్ఞ గుండంలోంచి ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ పుట్టారు. మగబిడ్డ దృష్టద్యుమ్నుడు కాగా ఆ ఆడబిడ్డే ద్రౌపది. అల్లారుముద్దుగా పెరిగింది. అర్జునునికి ఇవ్వాలని ఆశ ఆ తండ్రికి. పాండవులు చనిపోయారన్నవార్త. ద్రౌపది స్వయం వరం నిర్ణయించి […]

పాంచాల రాజు కూతురు కాబట్టి ఆమె “పాంచాలి”. పంచ పాండవుల్ని భర్తగా పొందింది కాబట్టి “పంచ భర్తృక”. విరాట్‌రాజు కొలువులో అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు “సైరంధ్రి”. ఎవరేమని పిలిచినా ఆమె ద్రౌపది!

ద్రౌపది తండ్రి ద్రుపదుడు. యజ్ఞం చేసాడు. యజ్ఞ గుండంలోంచి ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ పుట్టారు. మగబిడ్డ దృష్టద్యుమ్నుడు కాగా ఆ ఆడబిడ్డే ద్రౌపది. అల్లారుముద్దుగా పెరిగింది. అర్జునునికి ఇవ్వాలని ఆశ ఆ తండ్రికి. పాండవులు చనిపోయారన్నవార్త. ద్రౌపది స్వయం వరం నిర్ణయించి మత్స్యయంత్రాన్ని నిర్మించి పెట్టారు. నీడని చూసి మత్స్యాన్ని కొట్టిన వాడు బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడే. అలా ద్రౌపదిని గెలిచి ఇంటికి తీసుకువచ్చి ఏం తెచ్చారో చూడమన్నారు. కుంతి భిక్ష అనుకుంది. ఐదుగురూ సమానంగా పంచుకోమంది. తల్లిమాట తప్పవకుండా అయిదుగురు అన్నదమ్ములూ ద్రౌపదిని పెళ్ళాడారు. నారదుని సూచనమేరకు ఒక్కొక్కరికి ఒక్కో ఏడు భార్యగా మసిలేలా నియమాన్ని పాటించింది.

ఇంద్ర ప్రస్థానికి వచ్చిన దుర్యోధనుడు నిజమేదో భ్రమయేదో తెలియక నీటిలో పడ్డాడు. అది చూసి ద్రౌపది నవ్వింది. దుర్యోధనుడు అవమానంగా భావించాడు. అవకాశంకోసం చూసాడు. శకుని సాయంతో పాండవులను మాయాజూదంలో ఓడించాడు. ప్రాతికామి వచ్చి ధర్మరాజు ద్రౌపదిని జూదంలో ఓడిన విషయం ద్రౌపదికి చెప్పాడు. తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా అని అడిగింది. ఆపైన దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకు నిండుకొలువులోకి ఈడ్చుకువచ్చాడు. పంచ పాండవులే కాదు, పెద్దలైన భీష్మ, ద్రోణ, కృపాచార్య విదురులు మౌనంతో ఉండిపోయారు తప్పితే తప్పని అనలేదు. అడ్డుకోలేదు. వివస్త్రని చేస్తే ఆప్రయత్నం నెరవేరకుండా చేసాడు కృష్ణుడు. తలచిన నిలిచాడు. ఆ సమయంలోనూ తొడమీద కూర్చోమన్న దుర్యోధనుని తొడ విరిగి చస్తావని శపించింది. నీ రక్తంతోనే వీడిన జుట్టు ముడి వేస్తానని దుశ్శాసనునిపై శపధం చేసింది.

ఆ తర్వాత పన్నెండేళ్ళ అరణ్య వాసాన్ని భరించింది. ఆకాలంలోనే సైంధవుడు పరాభవించే ప్రయత్నం చేసాడు. అజ్ఞాతవాసం అప్పుడు మత్స్య దేశంలో విరాట్‌ రాజు కొలువులో సైరంద్రిగా ఉంది. కీచకుడు చెర పట్టబోతే భీముని సాయంతో ఎదుర్కొంది. కీచకుడు హతమైనా ఉపకీచకులు ఒప్పలేదు. కీచకుని చితిలో ద్రౌపదిని తోయాలని చూస్తే అడ్డుకున్న భీముడు వారి అంతం చూసాడు.

గోగ్రహణ యుద్ధంలో ఉత్తర కుమారునికన్నా సారధిగా ఉన్న బృహన్నల సాహసాన్ని పొగిడాడు ధర్మరాజు. దాంతో విరాటరాజు ధర్మరాజు తలమీద కొట్టడంతో రక్తం కారింది. చుక్క కిందపడకుండా చెంగు చింపి ద్రౌపది కట్టుకట్టింది. బొట్టుకింద పడితే అనావృష్టి కలుగుతుందని సాహసియై సాధువర్తినియై చెప్పింది.

కౌరవులతో సహదేవుడు తప్ప అందరూ సంధికి ప్రయత్నిస్తూవుంటే ద్రౌపది ఊరుకోలేదు. కౌరవులు చేసిన దానికి శిక్షించాల్సిందేనని కోరింది. దుష్టులకు తప్పక శిక్ష పడుతుందని కృష్ణుడు ద్రౌపదిని ఓదార్చాడు.

యుద్ధంలో పాండవుల్ని విజయం వరించినా – శపధం నెరవేర్చుకున్నా- ద్రౌపది అన్న దుష్టద్యుమ్నుడూ కొడుకులు అయిదుగురూ అసువులు బాసి బాధనే మిగిల్చారు. కొంతకాలం రాజ్యాన్ని ఏలినా పిల్లలు గతించి దుఃఖాన్నీ మిగిల్చారు.

ఆఖరికి మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు. తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది.

కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  29 Jun 2015 6:32 PM IST
Next Story