Telugu Global
Family

ఎందుకూ పనికి రానిది (Devotional)

ఒక సన్యాసి ఒక పర్వతం మొదట్లో ఉన్న చిన్ని గుహను నివాసంగా చేసుకుని ఆత్మజ్ఞానంకోసం అహర్నిశలు తపస్సు చేశాడు. అడవిలోని కందమూలాలు తింటూ సమీపంలోని సెలయేటి నీళ్ళు తాగుతూ నిరాడంబర జీవనం సాగించేవాడు.             నిరంతర ధ్యానం వల్ల ఆయనకు జ్ఞానోదయమయింది. సందేహాలు పటాపంచలయ్యాయి. అయినా ఆయన తన నిరాడంబర జీవితాన్ని నిర్మలంగా కొనసాగించాడు. ఆయన దర్శనానికి జిజ్ఞాసువులయిన కొందరు వస్తూఉండేవాడు. ఆయన గురించి ఆ దేశాన్ని పాలించే రాజుకు తెలిసింది.             ఆరాజు సత్యంపట్ల ఆసక్తి […]

ఒక సన్యాసి ఒక పర్వతం మొదట్లో ఉన్న చిన్ని గుహను నివాసంగా చేసుకుని ఆత్మజ్ఞానంకోసం అహర్నిశలు తపస్సు చేశాడు. అడవిలోని కందమూలాలు తింటూ సమీపంలోని సెలయేటి నీళ్ళు తాగుతూ నిరాడంబర జీవనం సాగించేవాడు.

నిరంతర ధ్యానం వల్ల ఆయనకు జ్ఞానోదయమయింది. సందేహాలు పటాపంచలయ్యాయి. అయినా ఆయన తన నిరాడంబర జీవితాన్ని నిర్మలంగా కొనసాగించాడు. ఆయన దర్శనానికి జిజ్ఞాసువులయిన కొందరు వస్తూఉండేవాడు. ఆయన గురించి ఆ దేశాన్ని పాలించే రాజుకు తెలిసింది.

ఆరాజు సత్యంపట్ల ఆసక్తి ఉన్నవాడు. సాధువుల్ని, సజ్జనుల్ని కలిసి సందేహనివృత్తి చేసుకునేవాడు. ఆ సన్యాసి గొప్ప జ్ఞాని అని విని ఆయన సందర్శనానికి వచ్చాడు. సన్యాసి రాజును ఆహ్వానించాడు.

రాజు సన్యాసితో “స్వామీ! నాకు రాజ్యముంది. సకల సంపదలు ఉన్నాయి. కానీ ప్రశాంతత ఒక్కటే కొరవడింది. నిరంతర అశాంతితో నేను అల్లాడుతున్నాను. రాగద్వేషాలలో పడి నలిగిపోతున్నాను. నాకు విముక్తి మార్గాన్ని ప్రసాదించండి” అన్నాడు.

సన్యాసి “రాజా! నువ్వు జ్ఞాన సంపన్నుడివి. వివేకవంతుడివి. నువ్వు సత్యాన్వేషణలో ఉన్నావు. నీకు తప్పక మార్గం దొరకుతుంది. దానికి ముందు నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి ఒక పనికి మాలిన వస్తువు గురించి తెలుసుకునిరా. అది ఎవరికీ ఎందుకూ ఉపయోగపడనిదయి ఉండాలి” అన్నాడు. రాజు సరేనని వెళ్ళాడు.

నెలరోజుల పాటు రాజు అన్ని ప్రాంతాలలో పర్యటించాడు. జంతువుల్ని, పక్షుల్ని, రాళ్ళని, రప్పల్ని, చెట్లని పుట్టల్నీ పరిశీలించాడు. ప్రతిదానికీ ఒక ప్రయోజనం కనిపించింది. ఉపయోగానికి పనికి రాని వస్తువు సృష్టిలో ఒక్కటి కూడా కనిపించలేదు. చివరికి నిరాశతో ఆ విషయం సన్యాసితో చెబుదామని బయల్దేరాడు.

మర్గమధ్యంలో ఎవరో మనిషి మల విసర్జన చేసి వెళ్ళాడు. రాజు అది చూసి ప్రపంచంలో ఇంతకంటే నిరుపయోగమయిన వస్తువు ఇంకొకటి లేదు కదా! అనుకుని సన్యాసి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పాడు.

సన్యాసి “రాజా! నువ్వు సత్యాన్ని సమీపిస్తున్నావు. లోకంలో పిండిమరలున్నాయి. గోధుమలు వేస్తే గోధుమ పిండి వస్తుంది. బియ్యం వేస్తే బియ్యంపిండి వస్తుంది. కానీ మనిషి రుచికరమైన పంచ భక్ష్య పరమాన్నాలు తింటాడు. సగంధ భరితమయిన వంటకాలు భుజిస్తాడు. కానీ దుర్గంధ భూయిష్టమయిన పదార్ధాలుగా వాటిని విసర్జిస్తాడు. సృష్టిలో చిత్రమదే. సృష్టిలో పనికి మాలిందని నువ్వా పదార్ధాన్ని అన్నావు. కానీ దానికి కారణమయిన శరీరాన్ని చూడు .అది అంతకంటే నిరుపయోగమైంది. అంతే కాదు, అటువంటి శరీరాన్ని “నేను” అనుకునే మనసు గురించి ఆలోచించు. ఆ మనసెంత పనికి మాలిందో. అన్ని దుఃఖాలకు, అశాంతులకు మనసే కారణం. మనసుని నిర్ఝించడమే మానవుడు చేయాల్సిన మొదటిపని. మనసు మాయమయితే సృష్టి స్వర్గధామం. మనసు రూపంలేనిది. కానీ అన్ని వికారాలకూ అదే కారణం. కాబట్టి మనసు మాయం కావడానికి నిరంతర ధ్యానం చేయి. నీ అశాంతి అదృశ్యమవుతుంది” అన్నాడు.

తన అశాంతిని, అంధకారాన్ని పటాపంచలు చేసిన సన్యాసికి అభివాదం చేసి రాజు ఆనందంగా వెనుదిరిగాడు.

– సౌభాగ్య

First Published:  29 Jun 2015 6:31 PM IST
Next Story