మళ్లీ రాజుకుంటున్న లోకల్ " నాన్ లోకల్ వివాదం
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య మరో వివాదం మళ్లీ రాజుకుంటున్నది. లోకల్ – నాన్ లోకల్ స్పష్టమైన నిర్వచనం ఉండాలని తెలంగాణలోని ఉద్యోగార్థులు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం త్వరలో చాలా నోటిఫికేషన్లను విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదముంది. ఎంతో సున్నితమైన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం శోచనీయమని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికైనా దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని, తెలంగాణ […]
BY Pragnadhar Reddy29 Jun 2015 5:07 AM IST
X
Pragnadhar Reddy Updated On: 29 Jun 2015 5:43 AM IST
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య మరో వివాదం మళ్లీ రాజుకుంటున్నది. లోకల్ – నాన్ లోకల్ స్పష్టమైన నిర్వచనం ఉండాలని తెలంగాణలోని ఉద్యోగార్థులు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం త్వరలో చాలా నోటిఫికేషన్లను విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదముంది. ఎంతో సున్నితమైన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం శోచనీయమని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికైనా దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ)కి మార్గదర్శకాలను అందించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో 85 శాతం స్థానికులకు, 15 శాతం స్థానికేతరులకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే స్థానికతపైనా స్పష్టమైన విధానం ఉండాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లోకల్ – నాన్ లోకల్ విషయమై ఒక స్పష్టమైన జీవో విడుదల చేస్తే మంచిదని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు కూడా భావిస్తున్నారు. దాంతోపాటు వయోపరిమితి సడలింపు, సిలబస్, పరీక్షల విధానంపైన కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఉంటేనే మేలని అధికారులు అంటున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాటై ఏడాది గడుస్తోంది. అయితే ఇప్పటివరకు ఒక్క రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. అయితే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను జులైలో ప్రారంభిస్తామని, ఏడాది చివరికల్లా 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. అవేకాదు రానున్న కాలంలో తెలంగాణలో దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ అర్హతకు సంబంధించి స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 1956కు పూర్వం నుంచి ఇక్కడ ఉంటున్నవారే స్థానికులని, వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని ప్రకటించి విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఉద్యోగాల విషయంలో మాత్రం ఇంత వరకు స్థానికతకు సంబంధించిన నిర్వచనం ఇవ్వలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే దానికోసం టీఎస్‌పీఎస్‌సీ మాత్రమే కాదు… హైదరాబాద్‌లో ఉన్న అనేక రాష్ర్టాల ఉద్యోగార్థులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్‌పై ప్రభావం చూపించే ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Next Story