సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించింది పీవీనే
భారత్‌ను ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి గట్టెక్కించి ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశంలో సంస్కరణలకు ఆయనే ఆద్యుడని డిగ్గీరాజా కొనియాడారు. గాంధీభవన్ లో ఆదివారం నిర్వహించిన పీవీ 94వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీలో ఏ తీర్మానమైనా, సవరణ చేయాల్సి వచ్చినా అది పీవీ కలం […]
భారత్‌ను ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి గట్టెక్కించి ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశంలో సంస్కరణలకు ఆయనే ఆద్యుడని డిగ్గీరాజా కొనియాడారు. గాంధీభవన్ లో ఆదివారం నిర్వహించిన పీవీ 94వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీలో ఏ తీర్మానమైనా, సవరణ చేయాల్సి వచ్చినా అది పీవీ కలం నుంచే వచ్చేవని ఆయన అన్నారు. విదేశీ మారకం కోసం, చమురు కొనుగోలు కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన సంక్షోభ సమయంలో, పీవీ నర్సింహారావు మైనార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడంతో పాటు ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టారని దిగ్విజయ్ కొనియాడారు. అవే దేశాన్ని ఈనాడు మేటిగా నిలబెట్టాయని ఆయన కీర్తించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 94వ జయంతిని ఆదివారం అధికారికంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్‌లోని ఆయన సమాధి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్, జానారెడ్డి, భట్టి, పొన్నాల, రఘువీరారెడ్డి తదితరులు నివాళులర్పించారు. పీవీ కుమార్తె సురభి వాణీదేవీ వేసిన పెయింటింగ్స్‌తో కూడిన కళాసుధ పుస్తకాన్ని ఆవిష్కరించారు.