Telugu Global
Others

దైవసాక్షాత్కారం (Devotional)

ఒక సాధువు ఏకాంతంగా ఒక రావి చెట్టుకింద భగవధ్యానం  చేసుకునేవాడు. ఆ పరిసరాల్ని పరిశుభ్రం చేసి నియమ నిష్ఠలతో భగవంతుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసేవాడు. అతను కేవలం ఆకులలములు తింటూ నిరంతరం భగవన్నామస్మరణలో మునిగి ఉండేవాడు. అట్లా ఎన్నో ఏళ్ళు దైవ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. అందరూ ఆ సాధువు పట్టుదలకు ఆశ్చర్యపోయారు. ఎప్పటికయినా దేవుడు కరుణించి ప్రత్యక్షమవుతాడని పట్టుదలగా ఆయన చేసే తపస్సు అందర్నీ ఆకర్షించింది. ఉదయాన్నే లేవడం, దగ్గర నదిలో స్నానం […]

ఒక సాధువు ఏకాంతంగా ఒక రావి చెట్టుకింద భగవధ్యానం చేసుకునేవాడు. ఆ పరిసరాల్ని పరిశుభ్రం చేసి నియమ నిష్ఠలతో భగవంతుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసేవాడు. అతను కేవలం ఆకులలములు తింటూ నిరంతరం భగవన్నామస్మరణలో మునిగి ఉండేవాడు.

అట్లా ఎన్నో ఏళ్ళు దైవ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. అందరూ ఆ సాధువు పట్టుదలకు ఆశ్చర్యపోయారు. ఎప్పటికయినా దేవుడు కరుణించి ప్రత్యక్షమవుతాడని పట్టుదలగా ఆయన చేసే తపస్సు అందర్నీ ఆకర్షించింది.

ఉదయాన్నే లేవడం, దగ్గర నదిలో స్నానం చేయడం, సమీపంలో ఉన్న పూలతోటనించీ పూలు తెంపుకురావడం, తను ప్రతిష్ఠించుకున్న శ్రీమహావిష్ణువు విగ్రహానికి పూజ చేయడం, తరువాత ధ్యానంలో మునగడం, ఇది ఆయన దిన చర్య. ఇట్లా దాదాపు నలభయ్యేళ్ళు ఆయన దైవసాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు.

నారదుడు నిత్య సంచారి కదా! భూలోకానికి స్వర్గలోకానికి రాకపోకలు జరుపుతూ అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేస్తూ అందర్నీ ఊరిస్తూ, ఉడికిస్తూ, రెచ్చగొడుతూ ఉండే కలహ భోజనుడు కదా! ఒక రోజు నారదుడు తపస్సు చేసుకునే ఆ సాధువు కూచున్న రావి చెట్టు మీదుగా వెళుతూ అక్కడ ఆగాడు. సాధువు నారదుడికి ప్రణామాలు చేసి “స్వామీ! మీరు సకలలోక సంచారులు, నిరంతరం నారాయణ నామ స్మరణలో ఉంటారు. వైకుంఠం వెళ్ళి మహావిష్ణువును దర్శిస్తూ ఉంటారు. దయచేసి ఈసారి వెళ్ళినపుడు దేవదేవుడయిన నారాయణుడు నాకు ఎప్పుడు దర్శనమిస్తాడో తెలుసుకునిరండి” అన్నాడు. నారదుడు సరేనన్నాడు.

నారదుడు ఒక సారి వైకుంఠానికి వెళ్ళినపుడు మహావిష్ణువుతో “స్వామీ! మీరు భూలోకంలో దశాబ్దాలుగా మీ దర్శనంకోసం తపిస్తున్న ఆ సాధువు ముందు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు. యిప్పటికే మీ దర్శనంకోసం తపిస్తున్న ఆసాధువు ముందు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు. ఇప్పటికే మీ దర్శనం కోసం నలభై సంవత్సరాలుగా అతను తపస్సు చేస్తున్నాడు. ఆకులలములు తిని నియమ నిష్ఠలతో ధ్యానిస్తున్నాడు” అన్నాడు.

మహావిష్ణువు “నారదా! నేను అతనికి దర్శన మిస్తాను. అయితే ఇప్పడేకాదు. ఆ రావి చెట్టులో ఎన్ని ఆకులున్నాయో అన్నాళ్ళు అతను తపస్సు చెయ్యాలి. అప్పుడే అతనికి ప్రత్యక్షమవుతాను” అన్నాడు.

మహావిష్ణువు మాటలతో నారదుడు విస్తుపోయాడు. చెట్టులో ఆకులు ఎన్నివుంటే అన్నాళ్ళు ఎదురు చూడాలా? అంతవరకూ అసలు ఆ సాధువు బతికి ఉంటాడా? అనుకుని నిట్టూర్చి దైవలీలలకు అంతుండదు అనుకున్నాడు.

కొన్నాళ్ళకు నారదుడు ఆ సాధువు దగ్గరకు వచ్చాడు. స్వామితో నా విషయం సెలవిచ్చారా? అని సాధువు ఆతృతగా అడిగాడు.

నారదుడు “నీ కోరిక గురించి మహా విష్ణువుకు విన్నవించాను. ఆయన తప్పక దర్శన మిస్తాను. ఐతే రావి చెట్టులోని ఆకులు ఎన్నివున్నాయో అన్నేళ్ళు ఎదురు చూడాలి అని స్వామి అన్నారు” అని చెప్పాడు. ఆ మాటల్తో సాధువు నీరసపడతాడనుకున్నాడు.

వెంటనే ఆ సాధువు మహదానందంతో గంతులు వేస్తూ భగవంతుడు నాకు దర్శనమయితే ఇస్తానన్నాడు కదా! అది చాలు అని పాటలు పాడి పరవశించాడు. అతనిలో నమ్మకం అతనికి బలాన్నిచ్చింది.

వైకుంఠానికి వెళ్ళినపుడు నారదుడు ఆసంగతి చెపితే విష్ణువు “నారదా! భక్తి అంటే అది. విశ్వాసమంటే అది. నమ్మకమంటే అది. అతను నిరాశపడకుండా నేను ప్రత్యక్షమవుతానని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాడు. భక్తుడంటే అతను. ఇప్పుడే వెళ్ళి నా భక్తుడికి ప్రత్యక్షమవుతాను” అన్నాడు.

– సౌభాగ్య

First Published:  26 Jun 2015 6:31 PM IST
Next Story