Telugu Global
POLITICAL ROUNDUP

ఆ కలం కదలదు

సీనియర్ పత్రికా రచయిత ప్రఫుల్ బిద్వాయ్ మృతితో సవ్యంగా ఆలోచించే ఓ గొంతు మూగబోయినట్టయింది. దాదాపు నలభై ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన బిద్వాయ్ రచనలు ఇక మీదట కనిపించవు. బిద్వాయ్ వామపక్ష భావాలున్న పత్రికా రచయిత. రాజకీయ విశ్లేషణలు మాత్రమే కాకుండా మానవాళిని కలవర పెడుతున్న పర్యావరణం, అణ్వస్త్రాల వ్యాప్తి, మానవ హక్కులు, రాజకీయ ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అంశాలు మొదలైన అనేకానేక అంశాల మీద నాలుగు దశాబ్దాలుగా నిరంతరం […]

ఆ కలం కదలదు
X
సీనియర్ పత్రికా రచయిత ప్రఫుల్ బిద్వాయ్ మృతితో సవ్యంగా ఆలోచించే ఓ గొంతు మూగబోయినట్టయింది. దాదాపు నలభై ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన బిద్వాయ్ రచనలు ఇక మీదట కనిపించవు. బిద్వాయ్ వామపక్ష భావాలున్న పత్రికా రచయిత. రాజకీయ విశ్లేషణలు మాత్రమే కాకుండా మానవాళిని కలవర పెడుతున్న పర్యావరణం, అణ్వస్త్రాల వ్యాప్తి, మానవ హక్కులు, రాజకీయ ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అంశాలు మొదలైన అనేకానేక అంశాల మీద నాలుగు దశాబ్దాలుగా నిరంతరం తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన కేవలం మాటల మనిషి కాదు. క్రియాశీలమైన సామాజిక కార్యకర్త. నిరంతరం శాంతి కోసం పరితపించే నిఖార్సైన యుద్ధ వ్యతిరేకి.
1972లో “ఎకానామిక్ అండ్ పొలిటిక‌ల్ వీక్లీ” లో ఆయన వ్యాసాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సుధీర్ఘ కాలం పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేశారు. బిజినెస్ ఇండియా, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో కూడా పని చేశారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం మానేసి పత్రికలకు వ్యాసాలు రాయడమే వ్యాపకంగా పెట్టుకున్నారు. హిందుస్తాన్ టైమ్స్, ఫ్రంట్ లైన్, రిడిఫ్ డాట్ కాం వంటి చోట్ల ఆయన వ్యాసాలు విరివిగా ప్రచురితమయ్యేవి. పత్రికా రచయితగా ఆయనకు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు ఉంది. లండన్ నుంచి వెలువడే గార్డియన్, న్యూ యార్క్ నుంచి వెలువడే ది నేషన్, పారిస్ నుంచి ప్రచురితమయ్యే లే మాండ్ డిప్లొమాటిక్, రోం నుంచి వెలువడే ఇల్ మానిఫెస్టోలో ఆయన రచనలు ప్రచురితమయ్యేవి.
శాంతి కోసం ఆయన నిరంతరం తపించే వారు. సామ్రాజ్య వాద పోకడలను తూర్పారబ‌ట్టే వారు. మన దేశంలో అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1998లో అణ్వస్త్ర పరిక్ష జరిగిన తర్వాత అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో బిద్వాయ్ ప్రముఖ పాత్ర వహించారు. అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో కూడిన సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే వారు. చాలా కాలం నుంచి ఆయన నెదర్లాండ్స్ రాజధాని అమ్స్టర్ డామ్ లోని ట్రాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లో సభ్యుడిగా ఉన్నారు. ఆ సంస్థ కార్యక్రమంలో పాల్గొనడానికి అమ్స్టర్ డామ్ వెళ్లిన బిద్వాయ్ మాంగళవారం సాయంత్రం భోజనం చేస్తుండగా గొంతులో ఆహారం ఇరుక్కుని ఊపిరాడక మరణించారు. ఆయన అవివాహితుడు.
మన దేశంలోని వామ పక్ష పార్టీల పోకడలను ఆయన నిశితంగా పరిశీలించే వారు. వామపక్ష ఐక్యత కోసం పరితపించే వారు. వామపక్ష భావజాలానికి చెందిన వాడే అయినా వామపక్ష పార్టీల పెడ ధోరణులను నిర్మొహమాటంగా ఎండగట్టేవారు. మన సమాజానికి వామపక్ష ఉద్యమ అవసరం ఎంత ఉందో నొక్కి చెప్పడంతో ఊరుకోకుండా వామపక్షం లేక పోతే దాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందనే వారు. భారత వామపక్షాల మీద ఆయన తాజా గ్రంథం త్వరలో విడుదల కావాల్సి ఉండగా బిద్వాయ్ అర్థాంతరంగా నిష్క్రమిచారు.
నేను పని చేసిన రెండు పత్రికలలో ఆయనతో వారం వారం వ్యాసాలు రాయించే వాడిని. ఎంత నిష్ఠగా రాసే వారంటే ఎప్పుడైనా పర్యటనలో ఉన్నప్పుడు రాయలేక పోతే గుర్తు పెట్టుకుని ఆ మాట చెప్పే వారు. ఆయన రచనలకు అడిగినంత పారితోషకం ఇప్పించడం కుదరలేదు. అందులో నాలుగో వంతుకే నా మీద ఉన్న అభిమానంతో రాసే వారు. మీ వ్యాసాలు తెలుగులో రావడం మంచిదే కదా అంటే అదీ నిజమే గదా అనే వారు నవ్వుతూ.
బిద్వాయ్ అనేక గ్రంథాలు కూడా రాశారు. అచిన్ వనాయక్ తో కలిసి బిద్వాయ్ రాసిన “న్యూ న్యూక్స్: ఇండియా, పాకిస్తాన్ అండ్ గ్లోబల్ న్యూక్లియర్ డిసార్మమెంట్” అన్న గ్రంథం విశేష ఆదరణ పొందింది.
బిద్వాయ్ బొంబాయి ఐ ఐ టీ పట్టభద్రుడు.
బిద్వాయ్ పత్రికా రచన నిఖిల్ చక్రవర్తి, ఎడతాత నారాయణ్ వంటి వారు లేని లోటు పూడ్చింది.
– ఆర్వీ రామారావ్
First Published:  24 Jun 2015 1:54 PM GMT
Next Story