తెరాస గూటికి మోత్కుపల్లి ?
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాస గూటికి చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఈ వార్తను నమ్మటంలేదు. కానీ ప్రచారం మాత్రం ఊపందుకొంది. ఇదే నిజమైతే.. ఓటుకునోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీకి ఇది పెద్దదెబ్బే అవనుంది. వరంగల్ పార్లమెంటు స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. 2009లో నల్లొండ […]
BY sarvi24 Jun 2015 5:20 AM IST
X
sarvi Updated On: 25 Jun 2015 2:47 AM IST
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాస గూటికి చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఈ వార్తను నమ్మటంలేదు. కానీ ప్రచారం మాత్రం ఊపందుకొంది. ఇదే నిజమైతే.. ఓటుకునోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీకి ఇది పెద్దదెబ్బే అవనుంది. వరంగల్ పార్లమెంటు స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. 2009లో నల్లొండ జిల్లా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మోత్కుపల్లి తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర తెచ్చుకున్నారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతజిల్లా నల్గొండలో పోటీకి వెనకంజ వేశారు. ఖమ్మం జిల్లా మధిర (ఎస్సీ రిజర్వుడు స్థానం) నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కేసీఆర్ పేరు వింటేనే ఒంటికాలుపై లేచి తీవ్ర విమర్శలు చేస్తారు. మొత్తం టీడీపీలోనే కేసీఆర్‌ను మోత్కుపల్లి విమర్శించినంతగా ఇంకెవరూ విమర్శించలేదంటే అతిశయోక్తి కాదు.!
గవర్నర్ గిరీపై ఆశలు వదులుకున్నారా?
తెలంగాణలో రేవంత్ రెడ్డి కన్నా దూకుడుగా వ్యవహరించే నేతగా టీడీపీ బాస్ చంద్రబాబు వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు మోత్కుపల్లి. అందుకే ఆయనకు చంద్రబాబు గవర్నర్ పదవి ఇప్పిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబే ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండంతో ఆయనను కేంద్రం కూడా లైట్ తీసుకుంటోంది. దీంతో తనకు ఇక గవర్నర్ పదవి రాదని, టీడీపీలోఉంటే భవిష్యత్తు లేదని మోత్కుపల్లి ఈ నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే, టీఆర్ ఎస్ నేతలు మోత్కుపల్లిని పార్టీలోకి రానిచ్చేందుకు ఒప్పకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ అధినేతను నోటికి వచ్చినట్లు విమర్శించి ఇప్పుడు పార్టీలోకి వస్తే అంగీకరిస్తారా? అంటే అందుకు అంగీకరించరనే చెప్పాలి. కేసీఆర్‌ను నిత్యం విమర్శించే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనా కడియం సహా పలువురు నేతలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అలాంటిది, ఏ పదవీ లేని మోత్కుపల్లిని వ్యతిరేకిస్తారనడంలో సందేహం లేదు. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు టీఆర్ ఎస్ నేతలను పక్కనబెట్టి మోత్కుపల్లికి టికెట్ ఇచ్చినా పార్టీ శ్రేణులు ఎంతమేరకు పనిచేస్తాయన్నది అనుమానమే!
Next Story