కాలనేమి (For Children)
కాలనేమి – పేరు భలే విచిత్రంగా ఉంది కదూ? ఎవరీ కాలనేమి? కాలనేమి మారీచుని కుమారుడు. సముద్రుడికి స్నేహితుడు. ఇతనికో కూమార్తె కూడా ఉంది. పేరు బృంద. అలాగే సముద్రుడికో కొడుకు ఉన్నాడు. అతని పేరు జలంధరుడు. బృందను జలంధరుడికిచ్చి పెళ్ళికూడా చేసాడు కాలనేమి. రావణుడు కూడా కాలనేమికి మిత్రుడే? ఒక మిత్రునితో బంధుత్వం కలుపు కున్నవాడు.. ఒక మిత్రుడు యుద్ధ సమయంలో ఉంటే సహకరించి సహాయపడకుండా ఉంటాడా? రామ రావణ […]
కాలనేమి – పేరు భలే విచిత్రంగా ఉంది కదూ?
ఎవరీ కాలనేమి?
కాలనేమి మారీచుని కుమారుడు. సముద్రుడికి స్నేహితుడు. ఇతనికో కూమార్తె కూడా ఉంది. పేరు బృంద. అలాగే సముద్రుడికో కొడుకు ఉన్నాడు. అతని పేరు జలంధరుడు. బృందను జలంధరుడికిచ్చి పెళ్ళికూడా చేసాడు కాలనేమి. రావణుడు కూడా కాలనేమికి మిత్రుడే?
ఒక మిత్రునితో బంధుత్వం కలుపు కున్నవాడు.. ఒక మిత్రుడు యుద్ధ సమయంలో ఉంటే సహకరించి సహాయపడకుండా ఉంటాడా?
రామ రావణ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సంజీవనిని తెమ్మని హనుమంతుని పంపించాడు రాముడు. రావణునికి ఈ విషయం తెలిసింది. అప్పుడు రావణుడు కాలనేమి దగ్గరకు వచ్చాడు. వచ్చి “హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి వస్తున్నాడు. వాడు తిరిగి రాకూడదు!” అని చెప్పాడు. ఆంజనేయుణ్ని చంపమని కోరాడు. సరేననిమాట ఇచ్చాడు కాలనేమి.
ఆంజనేయుడు వెళ్ళే మార్గం మధ్యలో కాలనేమి మారు వేషంలో కూర్చున్నాడు. హనుమంతుని చూసి మాట కలిపాడు. మర్మం ఎరుగని హనుమంతుడు అసలు విషయం చెప్పాడు. “సంజీవనీ పర్వతం సిద్ధించాలంటే… ఈ పుణ్య కోనేట్లో స్నానం చేయ్యి… శుభం కలుగుతుంది…” అని చెప్పాడు. హనుమంతుడు చూస్తూవుంటే దిగమన్నట్టు చూసాడు. శుభం కలుగుతుందని చెప్పాడు.
కాలనేమి మాటలు నమ్మి కొనేట్లోకి దిగాడు హనుమంతుడు. అంతే… నిశ్చలంగా ఉన్న నీళ్ళలోంచి మొసళ్ళు ఒక్కసారిగా ఆంజనేయుని మీద పడ్డాడు. తినబోయాయి. ఆంజనేయుడు వాటికా అవకాశం ఇవ్వలేదు. పిడిగుద్దులతో మొసళ్ళను తుత్తినియలు చేసి చంపి ఆపద నుండి బయటపడి సంజీవనికోసం వెళ్ళాడు ఆంజనేయుడు.
సంజీవని పర్వతాన్ని ఎత్తుకొస్తున్న ఆంజనేయుడికి మళ్ళీ ఎదురు పడ్డాడు కాలనేమి. దగ్గరగా వచ్చిన కాలనేమిని ఒక్క తన్ను తన్నాడు ఆంజనేయుడు. ఎక్కడో ఎగిరిపడ్డ కాలనేమి మళ్ళీ వచ్చాడు. వచ్చి అడ్డం పడ్డాడు. అప్పుడు ఆంజనేయుడు కాలనేమికి మధ్య యుద్ధం జరిగింది.
ఆంజనేయుని చేతిలో కాలనేమి హతమయ్యాడు!
అలా హతమయిన కాలనేమి మళ్ళీ కంసుడిగా పుట్టాడని పెద్దలు చెపుతారు!.
– బమ్మిడి జగదీశ్వరరావు