మెరికలాంటి పోలీస్ అధికారిణి మెరిన్!
ఈ ప్రపంచంలో స్ఫూర్తి నింపే వారి అవసరం ఎప్పుడూ ఉంటుంది. వారిని ముందు నిలుపుకుని అడుగులు వేయడానికి ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. మెరిన్ జోసెఫ్ ఇప్పుడు అదే స్థాయిలో ఉన్నారు. పాతికేళ్ల ఈ ఐపిఎస్ అధికారిణి ఫొటో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. పైగా ఇంత అందమైన అధికారిణి చేతిలో అరెస్టు కావడానికి మేము సిద్ధం అంటూ చాలామంది కుర్రకారు పోస్టులు చేసి ఆమెని మరింత పాపులర్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మెరిన్ జనంలో పనిచేసే మాకు […]
ఈ ప్రపంచంలో స్ఫూర్తి నింపే వారి అవసరం ఎప్పుడూ ఉంటుంది. వారిని ముందు నిలుపుకుని అడుగులు వేయడానికి ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. మెరిన్ జోసెఫ్ ఇప్పుడు అదే స్థాయిలో ఉన్నారు. పాతికేళ్ల ఈ ఐపిఎస్ అధికారిణి ఫొటో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. పైగా ఇంత అందమైన అధికారిణి చేతిలో అరెస్టు కావడానికి మేము సిద్ధం అంటూ చాలామంది కుర్రకారు పోస్టులు చేసి ఆమెని మరింత పాపులర్ చేశారు.
ఈ విషయంపై స్పందించిన మెరిన్ జనంలో పనిచేసే మాకు పబ్లిసిటీ ఉండడం మామూలు విషయమే అయితే ప్రచారం జరుగుతున్నట్టుగా నేను కొచ్చి ఎసిపిని కాను, ఎర్నాకులం జిల్లా పరిధిలో ఉన్న చెంగమ్మానద్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా, ఐపిఎస్ ట్రైనింగ్ లో ఉన్నాను అంటున్నారామె. మెరిన్ సెప్టెంబరుతో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తరువాత ఇండిపెండెంట్ సబ్ డివిజనల్ అధికారిగా ఛార్జ్ తీసుకుంటారు. తన జాబ్ గురించి ఫేస్‌బుక్ లో వస్తున్నతప్పుడు సమాచారం పట్ల ఆమె కాస్త ఇబ్బందిగానే ఫీలవుతున్నా, తాను జనంలోకి వెళ్లినపుడు తన మాటలు వినేందుకు చాలామంది కుతూహలం చూపుతున్నారని మెరిన్ అంటున్నారు. యంగ్ ఉమెన్ పోలీస్ అధికారిణిగా వచ్చిన ఈ గుర్తింపుతో తాను మంచి విషయాలను తేలిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లగలనని మెరిన్ చెబుతున్నారు. కొచ్చిలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో భర్త డాక్టర్ క్రిస్ అబ్రహాంతో పాటు దిగిన ఆమెను చూసినవారికి ఒక టఫ్ పోలీస్ అధికారిణిగా కనిపించడం లేదు. అంత సుకుమారంగా ఉన్నారు. ఆంగ్ల పుస్తకాలు చదవడం తన ఇష్టమైన హాబీ అంటున్న మెరిన్ దగ్గర అప్పుడే కొన్నపుస్తకాలు బ్యాగునిండా ఉన్నాయి.
చిన్నప్పటినుండీ తనకు ఛాలెంజింగ్‌గా ఉండే ఉద్యోగమంటే ఇష్టముండేదని ఐఏఎస్ కి మొదటి ప్రాధాన్యత, ఐపిఎస్‌కి తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెబుతున్న మెరిన్ 2012లో మొదటిసారి సివిల్స్ రాసినపుడే ఎంపికయ్యారు. మెరిన్ ఢిల్లీలోని సెంట్ స్టీఫెన్స్ కాలేజి నుండి హిస్టరీతో బిఎ, ఎమ్ఎ చేశారు. ఐపిఎస్ ట్రైనింగ్ మనలోని దృఢత్వాన్ని బయటకు తెస్తుందని ఆమె చెబతున్నారు.ఉదయం పావు తక్కువ అయిదు గంటలకు నాలుగు, అయిదు కిలోమీటర్ల రన్నింగ్ తో ఆమె దినచర్య మొదలవుతుంది. తరువాత హార్స్ రైడింగ్, వెపన్స్ ట్రైనింగ్, స్విమ్మింగ్ 40 కిలోమీటర్ల రూట్ మార్చ్ లు, అడవుల్లో కనీస వసతులతో ఉండటం ఇవన్నీ శరీరం దైనినైనా తట్టుకునేలా చేస్తాయని మెరిన్ చెబుతున్నారు. ఎప్పుడూ 99శాతం మంది మగవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మహిళగా తాను మరింత దృఢంగా ఉండాలని మెరిన్ అంటున్నారు. ఇంటర్‌నెట్ యుగంలో, టెక్ శావీలుగా పెరిగిన తాము మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమని, మరింతమంది యువతరం ఈ రంగంలో ముందుకు రావాలని మెరిన్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఎక్కువ సంఖ్యలో ఇందులోకి రావాలని, ఇక్కడ శారీరక దృడత్వం అవసరమే అయినా మహిళలకు అది సాధ్యమే అంటున్నారామె.