పుష్కరాలకు ఐదు నిమిషాలకో బస్సు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఐదు నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. జూలై 14 నుంచి ప్రారంభమై పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల కోసం గోదావరి తీరంలోని ప్రధాన క్షేత్రాలకు 2,600 బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్టీసీ జేఎండీ రమణరావు మూడు రోజుల పాటు కరీంనగర్‌లో అధికారులతో సమీక్షలు నిర్వహించి ముందస్తు ప్రణాళికను ఖరారు […]
BY sarvi21 Jun 2015 6:39 PM IST
sarvi Updated On: 22 Jun 2015 11:15 AM IST
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఐదు నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. జూలై 14 నుంచి ప్రారంభమై పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల కోసం గోదావరి తీరంలోని ప్రధాన క్షేత్రాలకు 2,600 బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్టీసీ జేఎండీ రమణరావు మూడు రోజుల పాటు కరీంనగర్‌లో అధికారులతో సమీక్షలు నిర్వహించి ముందస్తు ప్రణాళికను ఖరారు చేశారు. తెలంగాణలోని పది జిల్లాలకు గాను ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో పుష్కరాలు జరగని జిల్లాల నుంచి అదనపు బస్సుల తెప్పించి ఆ ఐదు జిల్లాలకు నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్
పుష్కరాల సమయంలో ఇతర ప్రాంతాలకు నడుస్తున్న ఇంద్ర, ఏసీ బస్సులను పుష్కారాలకు మళ్లించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులకు ఆన్‌లైన్ లో సీట్లు రిజర్వ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. దీంతో పాటు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ప్రాంతాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్నందున ఈ నాలుగు క్షేత్రాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది.
50 శాతం అదనపు చార్జీ
జాతరలు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో టికెట్ ధరలను పెంచే ఆర్టీసీ పుష్కరాలకూ ఇదే పద్ధతిని అనుసరించనుంది. సాధారణ టికెట్ ధర కంటే 50 శాతం చార్జీని అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. వెళ్లేటప్పడు రద్దీగా ఉండే బస్సులు వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉండనున్నందున టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును వినియోగించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.
Next Story