Telugu Global
Family

ఎవడు వీరుడు? (Devotional)

ఒక మారుమూల ప్రాంతంలో ఒక జ్ఞానోదయంపొందిన సన్యాసి నగ్నంగా కూచుని ధ్యానంలో మునిగి ఉండేవాడు. ఆయన్ని దర్శించడానికి జనం వచ్చేవాళ్ళు. ఆయన సన్నిధానంలో అందరికీ మహా ప్రశాంతం దొరికేది. అందరూ ఎంతో ఆనందంతో, భారం దించుకున్నట్లు ఉల్లాసంగా తిరిగి వెళ్ళే వాళ్ళు. ఆయన సన్నిధానమే స్వర్గతుల్యంగా ఉండేది. ఆయన ఎవరితోనూ ఏమీ మాట్లాడేవాడుకాడు, బోధనలు చేసేవాడు కాడు.             ఒక భావుకుడయిన కవి ఆయన దర్శనానికి వచ్చి ఆయన్ని కీర్తిస్తూ పరవశంగా వెయ్యి పద్యాలు రాశాడు. ఆ […]

ఒక మారుమూల ప్రాంతంలో ఒక జ్ఞానోదయంపొందిన సన్యాసి నగ్నంగా కూచుని ధ్యానంలో మునిగి ఉండేవాడు. ఆయన్ని దర్శించడానికి జనం వచ్చేవాళ్ళు. ఆయన సన్నిధానంలో అందరికీ మహా ప్రశాంతం దొరికేది. అందరూ ఎంతో ఆనందంతో, భారం దించుకున్నట్లు ఉల్లాసంగా తిరిగి వెళ్ళే వాళ్ళు. ఆయన సన్నిధానమే స్వర్గతుల్యంగా ఉండేది. ఆయన ఎవరితోనూ ఏమీ మాట్లాడేవాడుకాడు, బోధనలు చేసేవాడు కాడు.

ఒక భావుకుడయిన కవి ఆయన దర్శనానికి వచ్చి ఆయన్ని కీర్తిస్తూ పరవశంగా వెయ్యి పద్యాలు రాశాడు. ఆ సన్యాసిని వీరుడు అని కీర్తించాడు. వెనకటిరోజుల్లో వెయ్యి ఏనుగుల్ని చంపిన వాణ్ణి వీరుడు అనేవాళ్ళు. చీమకు కూడా అపకారం చెయ్యని ఆ సన్యాసిని ఆ కవి వీరుడు అని కీర్తించడం అందరికీ చిత్రమనిపించింది.

ఆ విషయం ఆనోటా ఆనోటా సాగి ఆదేశాన్ని పాలించే రాజు చెవిన పడింది. రాజుకు ఆగ్రహం కలిగింది. ఎందుకంటే ఆ రాజు వెయ్యి ఏనుగుల్ని చంపిన వీరుడు అన్న బిరుదు పొందినవాడు. అయాచితంగా ఆ సన్యాసిని కవి వీరుడని కీర్తించడం కోపాన్ని తెప్పించింది. వెంటనే భటుల్ని పంపి ఆ కవిని బంధించి తీసుకు రమ్మన్నాడు. సైనికులు ఆ కవిని తీసుకొచ్చి రాజుముందు నిలిపారు.

రాజు తీక్షణమయిన దృష్టితో కవిని చూసి “వెయ్యి ఏనుగుల్ని చంపినవాణ్ణి వీరుడంటారు. నువ్వు కవివి. ఆ విషయం నీకు తెలుసు. అలాంటప్పుడు నిష్కారణంగా ఒక సన్యాసిని పట్టుకుని “వీరుడని” కీర్తిస్తూ వెయ్యి పద్యాలు ఎందుకు రాశావు. దీనికి నువ్వు సమాధానమివ్వకుంటే నీకు శిక్ష తప్పదు” అన్నాడు.

కవి “రాజా! మీరు నాకు ఎటువంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. ఆ స్వామి సన్నిధానం నన్ను నేను మరచిపోయేలా చేసింది. కావాలంటే మీరొకసారి ఆయన్ని దర్శించి చూడండి” అన్నాడు. రాజుకు అహంకారం అడ్డమొచ్చినా ఇంతగా కవి చెబుతున్నాడంటే వెళ్ళి అతని సంగతి తెలుసుకుందామనుకున్నాడు.

రాజు అంటే ఆడంబరం కదా! మంత్రి, సైనాధ్యక్షుల్తో, పరివారంతో ఆడంబరంగా ఆ సన్యాసి ఉన్న దగ్గరకు వెళ్ళాడు. అంత హడావుడి ఉన్నా సన్యాసి ధ్యానంలో మునిగే ఉన్నాడు. రాజు గుర్రం దిగి సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. రాజు సన్నిహితంగా వచ్చినపుడు సన్యాసి కళ్ళు తెరిచి రాజు కళ్ళలోకి సూటిగా చూశాడు. కూచోమన్నాడు. సన్యాసి చూపులు రాజు గుండెల్లోకి దూసుకెళ్ళాయి. నిశ్చేతనంగా రాజు సన్యాసి ముందు కూచున్నాడు. అతని అహంకారం కరిగిపోయింది. సైన్యమంతా కూచుంది.

ఒక రోజు, రెండు రోజులు మంత్రించినట్లు అందరూ అలాగే ఉండిపోయారు. మూడవరోజు సన్యాసి “ఇక మీరు వెళ్ళవచ్చు” అన్నాడు.

రాజు సన్యాసికి సాష్ఠాంగ ప్రమాణం చేసి నిష్ర్కమించాడు.

రాజు కవితో “ఆ మహాపురుషుడి ముందు మంత్రముగ్ధుడయిపోయాను. ఆయన్ని నువ్వు వీరుడని కీర్తించడం సబబే” అన్నాడు.

కవి “రాజా! నిజం. మీరు వెయ్యి ఏనుగుల్ని చంపడం గొప్పకాదు. అవన్నీ బయట కనిపించేవి. ఆయుధాల్తో వాటిని నిర్జీవంగా చెయ్యవచ్చు. మనిషిలో కనిపించని మనసు ఉంటుంది. అది అహంకారం నింపుకున్న మనసు. దాన్ని చంపినవాడే నిజమైన వీరుడు” అన్నాడు.

రాజు కవికి నమస్కరించి “మీరు నిజం చెప్పారు” అన్నాడు.

– సౌభాగ్య

First Published:  21 Jun 2015 6:31 PM IST
Next Story