రాజీ కుదిరిపోయిందా..?
ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుపక్షాలకూ రాజీ కుదిరిపోయిందా? గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ సూచనల మేరకు రెండు పక్షాలూ వెనక్కి తగ్గుతున్నాయా..? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నోటీసు ఇవ్వకుండా గవర్నర్ అడ్డుపడ్డారని, లేదంటే ఆయనకు బుధవారమే నోటీసు అంది ఉండేదని ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలసి తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్న సమయంలో […]
BY Pragnadhar Reddy20 Jun 2015 6:55 AM IST
X
Pragnadhar Reddy Updated On: 20 Jun 2015 7:04 AM IST
ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుపక్షాలకూ రాజీ కుదిరిపోయిందా? గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ సూచనల మేరకు రెండు పక్షాలూ వెనక్కి తగ్గుతున్నాయా..? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నోటీసు ఇవ్వకుండా గవర్నర్ అడ్డుపడ్డారని, లేదంటే ఆయనకు బుధవారమే నోటీసు అంది ఉండేదని ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలసి తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్న సమయంలో గవర్నర్ తొందరపడవద్దని వారించారని వినిపిస్తోంది. అందువల్లే నోటీసులు ఇచ్చే ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టారని సమాచారం. గవర్నర్‌ను నానా దుర్భాషలాడిన ఆంధ్రప్రదేశ్ మంత్రులను చంద్రబాబు వారించడం, వారు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం అందుకేనని అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ వ్యవహారాన్ని అంత తేలికగా వదలకూడదని అనుకుంటున్నారని టీఆర్ ఎస్ వర్గాలంటున్నాయి. గవర్నర్ ఇలా అడ్డుపడినందునే కేసీఆర్ కేంద్రానికి తాజాగా లేఖలు రాశారని కూడా వినిపిస్తోంది. కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే దానిపై ఇపుడు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే విషయం ఆధారపడి ఉంటుందని అనుకోవాలి. కేంద్రంలోనూ తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి సుజనాచౌదరి తరచూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని సాయాన్ని అర్థిస్తున్నారు. అదే సమయంలో తామూ కేసులకు వెనకాడబోమని తెలియజెప్పేందుకు గాను విశాఖ పోలీసుల చేత టీన్యూస్ చానెల్‌కు నోటీసు ఇప్పించారు. ఇలా చంద్రబాబు అన్నివైపులా ఒత్తిడి చేస్తూ బయటపడే మార్గాలన్వేషిస్తున్నారు. కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Next Story