రాజ్యాంగం మీద ప్రమాణం చేసి.. దాన్నే అపహాస్యం చేస్తారా?
‘రాగద్వేషాలకు అతీతంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా, ఎలాంటి బంధుప్రీతి, ప్రలోభాలకు లొంగకుండా.. నిస్పక్షపాతంగా, దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడతాను’ అని ఏపీ మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజల దురదృష్టమో, అధికారం చేజిక్కిందన్న మిడిసిపాటో గానీ ఏపీ మంత్రులు తాము చేసిన ప్రమాణాన్ని మరచిపోయారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించాల్సింది పోయి గవర్నర్‌పై దూషణలకు దిగుతున్నారు. హద్దులు మీరుతున్నారు. అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజకీయాలంటేనే విరక్తి […]
BY Pragnadhar Reddy19 Jun 2015 4:37 AM IST
Pragnadhar Reddy Updated On: 20 Jun 2015 7:40 AM IST
‘రాగద్వేషాలకు అతీతంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా, ఎలాంటి బంధుప్రీతి, ప్రలోభాలకు లొంగకుండా.. నిస్పక్షపాతంగా, దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడతాను’ అని ఏపీ మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజల దురదృష్టమో, అధికారం చేజిక్కిందన్న మిడిసిపాటో గానీ ఏపీ మంత్రులు తాము చేసిన ప్రమాణాన్ని మరచిపోయారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించాల్సింది పోయి గవర్నర్‌పై దూషణలకు దిగుతున్నారు. హద్దులు మీరుతున్నారు. అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నారు.
రాగద్వేషాలకు అనుకూలంగా..!
తమ నాయకుడు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. ఆయనేమో రెండు రాష్ర్టాల మధ్య చిచ్చు పెడదామని అగ్గి రాజేస్తున్నారు. రాగద్వేషాలకు అతీతంగా నడుచుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. కానీ, ఆయన తన పదవిని కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే నీచమైన పనిని భుజాలనెత్తుకున్నారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా తమ అధినేతను స్ఫూర్తిగా తీసుకున్నారో.. లేక తమకు తాము తీసుకున్న నిర్ణయమోగానీ ఏపీ మంత్రులు గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. ‘గంగిరెద్దు, పక్షపాతి, ధృతరాష్ట్రుడు’ అంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇది రాజ్యాంగ ప్రతినిధిని అవమానించడం కాదా? ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల మధ్య లేని విద్వేషాలు రగిలించే ప్రయత్నం కాదా?
కానరాని నిస్పక్షపాతం!
ఏపీ మంత్రులకు తమ పార్టీ నేతలపై విచారణ జరగడం ఇష్టం లేదు. అందుకే దర్యాప్తు సంస్థలను, తెలంగాణ సీఎం, గవర్నర్… ఇలా స్థాయి, భేదం మరిచి ఇష్టానుసారంగా తూలనాడుతున్నారు. ఎలాంటి తప్పుచేయనపుడు దర్యాప్తు సంస్థలకు సహకరించవచ్చు కదా? ‘ మాకూ పోలీసులు ఉన్నారు. మాకు దర్యాప్తు సంస్థలున్నాయని’ బహింరంగంగా, నిస్సిగ్గుగా కేసులు పెడతామంటూ తమ అధికార దర్పాన్ని చాటుకుంటున్నారు. కేసులు పెట్టి అన్నంత పనీ చేశారు.
ప్రలోభాలు చేయడం లేదా?
ఎలాంటి ప్రలోభాలకు లొంగనని, ఎవరినీ అధికారంతో ప్రలోభ పెట్టనని ప్రమాణ స్వీకారం చేశారు. పక్క రాష్ర్టంలో పోలీసులు గాలిస్తున్న నిందితుడికి ఏపీ పోలీసులు బాసటగా నిలిచారు. ఈ విషయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నది వాస్తవం. వారిపై అలా ఒత్తిడి తెచ్చింది ఏపీ సర్కారు కాదా? పనికిరాని కేసులపై సిట్ వేయడం అధికారులను ప్రలోభపెట్టడం కాదా? చట్ట, న్యాయవ్యవస్థలను తమ సొంతానికి వాడుకోవడానికి చేస్తోన్న ప్రయత్నం కాదా?
మీకెక్కడివి రాజ్యాంగ విలువలు..?
రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ను తూలనాడుతున్నమీరు రాజ్యాంగ విలువలను కాపాడాతున్నారని అనుకోవాలా? చట్టం, న్యాయాలను మీకోసం ఇష్టానుసారంగా వాడుకుని దొంగ కేసులు బనాయిస్తున్న మీకు రాజ్యాంగంపై గౌరవం ఉందనుకోవాలా? రాజ్యాంగం అమలుకావడం లేదంటూ నెత్తీనోరు బాదుకుంటూనే.. అదే రాజ్యాంగ ప్రతినిధిపై దూషణలకు తెగబడతారా? ఇదెక్కడి దుష్ట సంప్రదాయం?.
మీడియా గొంతు నొక్కుతారా?
మీపై వాస్తవాలు ప్రసారం చేస్తున్న మీడియా గొంతు నొక్కుతారా? ప‌్రస్తుతం ఏపీలో ఎన్-టీవీ ప్రసారాలు రావడం లేదు. కేవలం వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తుందన్న అక్కసుతో ప్రసారాలు రాకుండా చేశారు. గతంలో ‘ఆంధ్రజ్యోతి’ని తెలంగాణలో నిషేధిస్తే.. పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా? అని పార్లమెంటులో ఏడుపులు పెడబొబ్బలు పెట్టిన తెలుగుదేశం ఎంపీలు ఇప్పుడు ఈ పరిణామానికి ఏమని సమాధానం చెప్తారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీరిని చూసి రేపటి తరం ఏమనుకోవాలి. ఇలాంటి చెడు పోకడలను.. నేటి యువనాయకత్వం ఆకళింపు చేసుకుంటే..దేశ భవితవ్యం ఏం కావాలి?
-అర్జున్
Next Story