పరిశీలన-ప్రశాంతత (Devotional)
ఏ విషయాన్నయినా ప్రశాంతంగా పరిశీలించాలి. ప్రతిదీ మనల్ని పరిశీలించమంటుంది. తొందరపడితే మన దర్శనం మసక బారుతుంది. అది మన పరిశీలన నించి చేజారుతుంది. మహాకవి శ్రీశ్రీ అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల ఏదయినా తమని పరిశీలించమంటాయి. తమలోతు కనుక్కోమంటాయి అన్నాడు. మనకు కావలసింది నిర్మలమయిన మనస్థితి. దాన్ని మనం కోల్పోకూడదు. మన కాంక్షలు, మన ఉద్వేగాలు ముందుకు వస్తే లక్ష్యం దెబ్బతింటుంది. పరిశీలనకు సంబంధించి చిన్ని సంఘటన బుద్ధుడు నడిచేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా, నిత్యచైతన్యంతో […]
ఏ విషయాన్నయినా ప్రశాంతంగా పరిశీలించాలి. ప్రతిదీ మనల్ని పరిశీలించమంటుంది. తొందరపడితే మన దర్శనం మసక బారుతుంది. అది మన పరిశీలన నించి చేజారుతుంది. మహాకవి శ్రీశ్రీ అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల ఏదయినా తమని పరిశీలించమంటాయి. తమలోతు కనుక్కోమంటాయి అన్నాడు.
మనకు కావలసింది నిర్మలమయిన మనస్థితి. దాన్ని మనం కోల్పోకూడదు. మన కాంక్షలు, మన ఉద్వేగాలు ముందుకు వస్తే లక్ష్యం దెబ్బతింటుంది.
పరిశీలనకు సంబంధించి చిన్ని సంఘటన
బుద్ధుడు నడిచేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా, నిత్యచైతన్యంతో ఉండేవాడట. అడుగు తీసి అడుగువేసేటప్పుడు కూడా ఆయన ఎప్పుడూ తొందరపడేవాడు కాదు. ఆయన నిత్య జీవితంలో ఎక్కడా ఉద్వేగానికి ఆస్కారముండేది కాదు.
ఎప్పట్లాగే బుద్ధుడు ఉదయాన్నే పరిశుభ్రంగా ప్రశాంత వదనంతో ప్రవచనాలకు సిద్ధపడి శిష్యుల దగ్గరకు వచ్చాడు. శిష్యుడు ఆయనకు అభివాదం చేశారు. వాతావరణం నిశ్శబ్దమయింది. శిష్యులందర్నీ బుద్ధుడు పరిశీలించాడు. అప్పుడు ఒక చేతిరుమాలు తీసి చూపాడు. అది ముడివేసి ఉంది. ఒక శిష్యుణ్ణి పిలిచి ముడి తీయమన్నాడు. ఆ శిష్యుడు తనను మొదట పిలిచిన సంతోషంలో పరవశంగా వచ్చి ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించాడు. తొందరపాటుతో ముడి విప్పడానికి ప్రయత్నించడం బదులు దాన్ని మరింత బిగించాడు. ఇట్లా కొంతమంది ప్రయత్నించి విఫలం చెందారు.
అప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఆ ముడిని మొదట పరిశీలించాడు. అది ఎట్లా వేయబడిందో ఎట్లా విప్పితే విడిపోతుందో పరిశీలించాడు. అప్పుడు సులభంగా దాన్ని విప్పేశాడు. జీవితంలోని మన బాధలన్నీ ముడులే. ఆ ముడుల్ని ప్రశాంతంగా పరిశీలించాలి. విప్పడానికి ప్రయత్నించాలి. లేకుంటే బాధలు మరింతగా బలపడతాయి.
ఇంకో సంఘటన
ఒక యువకుడు ఆత్మరక్షణకు ఉపయోగపడే యుద్ధ కళను నేర్చుకోవాలని ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. చాలా త్వరగా ఆ యుద్ధ కళను అభ్యసించి ప్రావీణ్యం సంపాదించి పేరు ప్రతిష్ఠలు పొందాలని ఉబలాట పడ్డాడు.
“గురువు గారూ! ఈ కళ నేర్చుకోడానికి ఎన్నాళ్ళు పడుతుంది” అని అడిగాడు. గురువు “పది సంవత్సరాలు పడుతుంది” అన్నాడు.
ఆ మాటల్తో శిష్యుడు నీరసించాడు “గురువుగారూ! నేను రాత్రింబవళ్ళు కష్టపడతాను విశ్రాంతి తీసుకోను. ఎంత శ్రమకయినా ఓర్చుకుంటాను. అట్లా అయితే ఎన్నాళ్ళలో నేర్చుకుంటాను” అని అడిగాడు.
గురువు గారు “ఇరవయి సంవత్సరాలు పడుతుంది” అన్నాడు.
దాంతో శిష్యుడు నోరు వెళ్ళబెట్టాడు. “ఆత్రగానికి బుద్ధి మట్టు” అన్న సామెత ఉంది. తొందర పడితే ఏదీ సాధించలేం. ప్రశాంతత ఉండాలి. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి. అప్పుడే మనం చేసే పనిపట్ల మనకు ప్రేమ ఏర్పడుతుంది. ఆవేశపడితే ఏదీ సాధించలేం.
– సౌభాగ్య