గవర్నర్ ను గంగిరెద్దు అంటారా?
ఓటుకు నోటు కేసులో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ మంత్రులు ఎవరినీ లెక్క చేయడం లేదు. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా కనిపించిన అందరినీ మాటలతో చీల్చిచెండాడుతున్నారు. ప్రధాని, రాష్ర్టపతి మినహా దాదాపు అందరి పరువు బజారుకీడుస్తున్నారు. ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాటలు శ్రుతి మించుతున్నాయి. మొన్నటిదాకా హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన బుధవారం గవర్నర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్లుగా తల ఆడిస్తున్నారని […]
ఓటుకు నోటు కేసులో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ మంత్రులు ఎవరినీ లెక్క చేయడం లేదు. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా కనిపించిన అందరినీ మాటలతో చీల్చిచెండాడుతున్నారు. ప్రధాని, రాష్ర్టపతి మినహా దాదాపు అందరి పరువు బజారుకీడుస్తున్నారు. ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాటలు శ్రుతి మించుతున్నాయి. మొన్నటిదాకా హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన బుధవారం గవర్నర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్లుగా తల ఆడిస్తున్నారని ఆయన హోదాను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాజ్యంగ ప్రతినిధి అంటూ కేసీఆర్ చెప్పినట్లు గంగిరెద్దులా తల ఆడిస్తున్నారని పరుషపదజాలంతో ఆయనను తీవ్రంగా అవమానించారు.
రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘిస్తున్నారు?
రాజ్యాంగం ప్రమాదంలో పడిందని నెత్తీ నోరూబాదుకుంటున్న టీడీపీ నేతలు అదే రాజ్యాంగ ప్రతినిధిపై తిట్ల దండకం అందుకోవడం వారి విజ్ఞతకే చెల్లింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగాద్వేషాలకు అతీతంగా పనిచేస్తామన్నమంత్రులు తిరిగి అదే రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేస్తూ, గవర్నర్ ను హేళన చేస్తూ మాట్లాడుతూ దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారు. కేవలం తమ అధినేతను కాపాడుకోవాలన్న తాపత్రయంలో పక్క రాష్ర్టాన్ని, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి, మంత్రులు, గవర్నర్ అధికారాలను, దర్యాప్తు సంస్థలను తూలనాడుతున్నారు. అదే సమయంలో ‘తెలంగాణ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయ’ని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న టీడీపీ నేతలు ‘ఆవిధంగా ఎందుకు ముందుకు వెళ్లడం లేదో ‘ మాత్రం స్పష్టం చేయడం లేదు. టీడీపీ నేతలు సమస్యను దాటి వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఏపీ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన 12 గంటలలోపే హైదరాబాద్‌లో మోహరించిన 400 మంది పోలీసులను ఏపీ డీజీపీ వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం మొండి చేయి చూపడంతో ఏం చేయాలో తెలియని మానసికస్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. వారి మాటలకు జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదని తేటతెల్లమవుతోంది.