జీవన క్రమం (Devotional)
నిజానికి మనిషి నిశ్చింతగా ఉండాలి. కారణం మనిషి ప్రకృతిలో భాగం. సృష్టి ప్రకృతి ధర్మాన్ని బట్టి సాగుతుంది. మనం ఆందోళన పడుతున్నామంటే విశ్వనియమాలకి విభిన్నంగా ప్రవర్తిస్తున్నా మన్నమాట. మనం ఆనందంగా ఉన్నామంటే విశ్వచలనంలో భాగంగా ఉన్నామన్నమాట. ఇట్లాంటి మాటలు చెప్పడం సులభం. జీవితం వీటికి లొంగనిది, ఎంతో సంక్లిష్టమయింది, సంక్షోభాలతో కూడుకున్నది అనవచ్చు. మనం ప్రకృతిలో ఎట్లా భాగాలమో పశుపక్ష్యాదులు కూడా ప్రకృతిలో భాగాలే కదా! అవికూడా జీవిస్తున్నాయి. మనలాగా ఎప్పుడూ అవి బాధపడవు. జీవిస్తాయి. సంతానోత్పత్తి […]
నిజానికి మనిషి నిశ్చింతగా ఉండాలి. కారణం మనిషి ప్రకృతిలో భాగం. సృష్టి ప్రకృతి ధర్మాన్ని బట్టి సాగుతుంది. మనం ఆందోళన పడుతున్నామంటే విశ్వనియమాలకి విభిన్నంగా ప్రవర్తిస్తున్నా మన్నమాట. మనం ఆనందంగా ఉన్నామంటే విశ్వచలనంలో భాగంగా ఉన్నామన్నమాట.
ఇట్లాంటి మాటలు చెప్పడం సులభం. జీవితం వీటికి లొంగనిది, ఎంతో సంక్లిష్టమయింది, సంక్షోభాలతో కూడుకున్నది అనవచ్చు. మనం ప్రకృతిలో ఎట్లా భాగాలమో పశుపక్ష్యాదులు కూడా ప్రకృతిలో భాగాలే కదా! అవికూడా జీవిస్తున్నాయి. మనలాగా ఎప్పుడూ అవి బాధపడవు. జీవిస్తాయి. సంతానోత్పత్తి చేస్తాయి. మరణిస్తాయి. ఎక్కడా వాటిల్లో ఆవేదన, మానసిక సంక్షోభం కనిపించదు.
కానీ వాటికి లేని తెలివి తేటలు, మాటలు మనకు ఉన్నాయి కదా! అనవచ్చు. నిజమే ఇవి మనకు అదనంగా ఉన్నాయి. కానీ ఇవి అదనంగా ఉండడమన్నది మనం బాధపడడానికా? వాటితో మనం మరింత ఆనందంగా జీవించవచ్చు కదా!
సమాజం మనం ఏర్పరచుకున్నది, కుటుంబం మనం సృష్టించుకున్నది, అనుబంధాలు మనం ఏర్పరచుకున్నవి. ఈ వాస్తవాన్ని విస్మరిస్తే మనకు బాధలు తప్పవు.
ఒక సంపన్నుడు ఒక బౌద్ధ ఆశ్రమానికి వెళ్ళాడు. తరతరాలుగా ఆశ్రమంలోని గురువుల్ని సందర్శించి వారి ఆశీర్వాదాల్ని అందుకోవడం ఆ సంపన్న కుటుంబానికి ఆనవాయితీ. ఆ గురువు గొప్ప జ్ఞాన సంపన్నుడు. ఆయన ఎందరో శిష్యులకు మంచి బోధనలు చేస్తూ ఆప్రాంతంలో పేరు పొందాడు.
సంపన్నుడు గురువుగారిని సందర్శించి అభివాదం చేశాడు. గురువు అతన్ని ఆహ్వానించి క్షేమసమాచారాలు విచారించి కూర్చోమన్నాడు. వచ్చిన పని అడిగాడు. సంపన్నుడు “గురువు గారూ! తరతరాలుగా ఈ ఆశ్రమ గురువుల ఆశీర్వాదాలు అందుకుంటూ మాకుటుంబం ఈ స్థాయికి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసు. మీరు కూడా మా వంశం వర్ధిల్లడానికి ఏవయినా కొన్ని మంచి మాటలు చెప్పండి. మీ దీవెనలు నాకు శిరోధార్యం” అన్నాడు.
గురువు సంపన్నుడు చెప్పిన మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ఒక కలం, కాగితం తీసుకుని ఏదో రాశాడు. సంపన్నుడు ఆశ్చర్యంగా చూశాడు. గురువుగారు అందులో ఏమి రాస్తున్నాడా? అని ఉబలాట పడ్డాడు.
గురువు ఆ కాగితంలో రాయడం ముగించి ఆ కాగితాన్ని సంపన్నుడికి ఇచ్చాడు. ఆ కాగితాన్ని అందుకుని సంపన్నుడు ఆబగా చదివాడు. అతని ముఖంలో రంగులు మారాయి. కళాకాంతులుపోయి ముఖం వెలవెల బోయింది.
ఆ కాగితంలో “తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మనవడు చనిపోతాడు” అని రాసి ఉంది. సంపన్నుడు ఆందోళనగా “గురువుగారూ! ఆశీర్వాదం ఇవ్వమంటే అశుభం కలిగే మాటల్ని ఎందుకు రాశారు?” అన్నాడు.
గురువు నిశ్చలంగా “ఇందులో అశుభం ఏముంది? నువ్వు చనిపోతావు, నీ కొడుకు చనిపోతాడు. తరువాత నీ మనవడు చనిపోతాడు. ఇది సృష్టి క్రమం, జీవనధర్మం. అట్లాకాకుండా నీ కళ్ళముందు నీ కొడుకు చనిపోతే, నీ కొడుకు కన్నా ముందు నీ మనవడు చనిపోతే అప్పుడు దుఃఖం ఉంటుంది. అట్లాకాకుండా నీ తరువాత నీ కొడుకు, నీ కొడుకు తరువాత నీ మనవడు చనిపోతే అది సహజక్రియ. అక్కడ పరిణామం ఉంది. అభివృద్ధి ఉంది. నేను నీ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాను” అన్నాడు.
సంపన్నుడు గురువుకు సాష్టాంగ పడ్డాడు.
– సౌభాగ్య