Telugu Global
Others

దూకుడు మీదున్న తెలంగాణ ఏసీబీ

ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ త‌న ద‌ర్యాప్తును వేగ‌త‌రం చేసింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్ త‌ర్వాత ఆయ‌నను జ్యుడీషియ‌ల్ రిమాండు నుంచి త‌న రిమాండులోకి తీసుకుని నాలుగు రోజులపాటు విచారించింది. అనంత‌ర ప‌రిణామాల చ‌ద‌రంగంలో ఒక్కోక్క పావు క‌దుపుతూ మ‌రిన్ని అరెస్ట్‌ల‌కు రంగం సిద్ధం చేసింది. గ‌త 48 గంట‌ల్లో ఏసీబీ వ్య‌వ‌హార‌శైలిని ప‌రిశీలిస్తే ఇక‌ముందు ఇంకా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ దూకుడుకు తోడు ఇపుడు ఎన్నిక‌ల సంఘం నుంచి కూడా […]

దూకుడు మీదున్న తెలంగాణ ఏసీబీ
X
ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ త‌న ద‌ర్యాప్తును వేగ‌త‌రం చేసింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్ త‌ర్వాత ఆయ‌నను జ్యుడీషియ‌ల్ రిమాండు నుంచి త‌న రిమాండులోకి తీసుకుని నాలుగు రోజులపాటు విచారించింది. అనంత‌ర ప‌రిణామాల చ‌ద‌రంగంలో ఒక్కోక్క పావు క‌దుపుతూ మ‌రిన్ని అరెస్ట్‌ల‌కు రంగం సిద్ధం చేసింది. గ‌త 48 గంట‌ల్లో ఏసీబీ వ్య‌వ‌హార‌శైలిని ప‌రిశీలిస్తే ఇక‌ముందు ఇంకా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ దూకుడుకు తోడు ఇపుడు ఎన్నిక‌ల సంఘం నుంచి కూడా టీ-ఎసీబీకి ఓటుకు నోటు కేసు ద‌ర్యాప్తును ముమ్మ‌రంగా కొన‌సాగించ‌మంటూ లేఖ వ‌చ్చింది . దీన్ని తెలంగాణ ఏసీబీ కూడా ధ్రువీక‌రించింది. ఈ లేఖ‌తో మ‌రింత వేగంగా ఏసీబీ పావులు క‌ద‌ప‌డానికి అవ‌కాశం ఉంది. నిన్న‌, మొన్నా కూడా ఏసీబీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎ.కె.ఖాన్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌తో స‌మావేశ‌మై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న శాఖ ప‌రిణామాలు తెలుపుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మంగ‌ళ‌వార‌మంతా ఏపీ ముఖ్య‌మంత్రితోపాటు మ‌రికొంత‌మందికి నోటీసులు జారీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అది కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే కాద‌ని రాత్రికి నిరూపిత‌మైంది. చంద్ర‌బాబుకు కాక‌పోయినా ఇద్ద‌రికి నోటీసులు జారీ చేసింది. అందులో ఒక‌రు స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య కాగా మ‌రొక‌రు తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలంగాణ తెలుగుదేశం త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన వేం న‌రేంద్ర‌రెడ్డి.
నిజానికి మంగ‌ళ‌వారం రాత్రే వేం న‌రేంద్రరెడ్డిని త‌మ కార్యాల‌యానికి ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అది ఫ‌లించ‌లేదు. ఉద‌యమే తాను వ‌స్తాన‌ని చెప్పి ఏసీబీ అధికారుల‌ను ఆయ‌న పంపి వేశారు. అన్న‌ట్టుగానే ఉద‌యం ఆయ‌న ఏసీబీ కార్యాల‌యానికి వెళ్ళ‌డం, అక్క‌డ నాలుగు గంట‌ల‌పాటు సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిపారు. ఇపుడు సండ్ర వెంక‌ట వీర‌య్య వంతు వ‌చ్చింది. ఆయ‌న‌కు నోటీసులు వ్య‌క్తిగ‌తంగా అంద‌జేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఇంటి వ‌ద్ద గోడ‌కు అతికించి వ‌చ్చేశారు. గురువారం సాయంత్రం ఐదు గంట‌ల‌లోపు ఏసీబీ కార్యాల‌యానికి రావాల్సిందిగా అందులో ఆదేశించారు. బ‌హుశా ఆయ‌న కూడా రాక త‌ప్ప‌క‌పోవ‌చ్చు.
బుధ‌వారం నాంప‌ల్లి కోర్టులో ఈ కేసులో కీల‌క సూత్ర‌ధారి అయిన స్టీఫెన్‌స‌న్ వాంగ్మూలాన్ని న‌మోదు చేశారు. ఆయ‌న చెప్పిన విష‌యాల ఆధారంగా మ‌రింత మందికి నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంది. స్టీఫెన్‌స‌న్‌తోపాటు ఆయ‌న ఇంటి య‌జ‌మానిని, కుమార్తె జ‌స్పీకాను కూడా విచారించి వారి వాంగ్మూలాన్ని కూడా న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం విచార‌ణ పూర్తి చేసిన త‌ర్వాత ఏసీబీ ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డానికి ఉప‌క్ర‌మించే అవ‌కాశం ఉంది. రేవంత్‌రెడ్డి ఎలాగూ 29 వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ రిమాండులో ఉంటారు. ఒక‌వేళ ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కు వెళ్ళాల‌న్నా 25 వ‌ర‌కు అవ‌కాశం లేదు. ఆయ‌న బెయిల్ పిటిషన్‌పై విచార‌ణ‌ను 25 కు వాయిదా వేయ‌డంతో అప్ప‌టివ‌ర‌కు మిగిలిన నిందితుల వివ‌రాల‌ను తెలుసుకునే అవ‌కాశం ఉంది. ఈ కేసులో తెలంగాణ టీడీపీ నాయ‌కుడు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావుతో స‌హా మొత్తం ఇర‌వై మంది దాకా నిందితులున్న‌ట్టు ఏసీబీ అధికారులు అన‌ధికారికంగా చెబుతున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన ముద్దాయిగా రేవంత్‌రెడ్డి క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ అస‌లు సూత్ర‌ధారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడ‌న్న విష‌యం అంద‌రికీ అర్ధ‌మ‌వుతున్న‌దే. ఆయ‌న‌కు నోటీసులు జారీ చేస్తారా అన్న అంశంపైనే మొత్తం కేసు ప్రాధాన్య‌త సంత‌రించుకుంటుంది. ఈ కేసులో ఎవ‌రెవరికి ప్ర‌మేయం ఉందో వారంద‌రినీ విచారించేందుకు ఇంత‌కుముందే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలొచ్చిన‌ట్టు చెబుతున్నారు. ఈ ఉత్త‌ర్వులు నిజ‌మ‌యితే చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేయ‌డం, అరెస్ట్ చేయ‌డం పెద్ద ప‌ని కాదు. అయితే ముందుగా ఈ కేసులో చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయాన్ని చాటి చెప్పే టేపుల్లో నిజం భ‌యం ప‌డాలి. ఇందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదిక ఒక్క‌టే ప్ర‌ధానాధారం. దీని కోసం ఇపుడు ఏసీబీ ఎదురు చూస్తోంది. ఈ నివేదికలో నిజాలు బ‌య‌ట ప‌డితే ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఎం పేరు క‌నిపించ‌డం ఖాయం. అదే జ‌రిగితే త‌దుప‌రి చంద్ర‌బాబు అరెస్టే.!
First Published:  17 Jun 2015 12:15 PM IST
Next Story