వేదవతి (For Children)
దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు కుశధ్వజుడు. కుశధ్వజుని కుమార్తె వేదవతి. వేదాలను పఠిస్తూ పుట్టింది కాబట్టి “వేదవతి” అని పేరు పెట్టారు. వేదవతి యవ్వనవతిగా సౌందర్యవతిగా దేవతల మునికుమారుల యక్ష కిన్నెరకింపురుష గంధర్వాదుల దృష్టిని ఆకర్షించింది. పెళ్ళాడవచ్చి వేదవతిని తమకివ్వమని తండ్రైన కుశధ్వజుడ్ని కోరారు. ఆ శ్రీమన్నారాయణుడినే పెళ్ళాడాలన్న తన కోరికను చెప్పింది వేదవతి. అది అసామాన్యమైన కోరికని చెప్పాడు కుశధ్వజుడు. తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించాలనీ అన్నాడు. అంతకన్నా నీకిష్టమైన వాణ్ని పెళ్ళాడి సుఖంగా […]
దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు కుశధ్వజుడు. కుశధ్వజుని కుమార్తె వేదవతి. వేదాలను పఠిస్తూ పుట్టింది కాబట్టి “వేదవతి” అని పేరు పెట్టారు. వేదవతి యవ్వనవతిగా సౌందర్యవతిగా దేవతల మునికుమారుల యక్ష కిన్నెరకింపురుష గంధర్వాదుల దృష్టిని ఆకర్షించింది. పెళ్ళాడవచ్చి వేదవతిని తమకివ్వమని తండ్రైన కుశధ్వజుడ్ని కోరారు. ఆ శ్రీమన్నారాయణుడినే పెళ్ళాడాలన్న తన కోరికను చెప్పింది వేదవతి. అది అసామాన్యమైన కోరికని చెప్పాడు కుశధ్వజుడు. తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించాలనీ అన్నాడు. అంతకన్నా నీకిష్టమైన వాణ్ని పెళ్ళాడి సుఖంగా ఉండమని తండ్రి చెప్పబోతే వేదవతి వినలేదు. కూతురు కోరికను మన్నించాడు కుశధ్వజుడు. గౌరవించి అర్ధంచేసుకున్నాడు. అందుకనే దనుజుడు ఒకడు వచ్చి వేదవతిని కోరితే కాదన్నాడు. కడకు అతని చేతిలోనే మరణించాడు తండ్రి కుశ ధ్వజుడు. భర్త మరణాన్ని భరించలేని తల్లి మాలావతి దుఃఖం పట్టలేక తనూ మరణించింది. తలిదండ్రులు పోయాక తనకు మిగిలింది ఇక ఆశ్రీమన్నారాయణుడే అని నమ్మి హిమగిరికి చేరి తపస్సు చేయడానికి పూనుకుంది వేదవతి.
వన విహారానికి వచ్చిన రావణుడు హిమాలయాల్లో తిరుగుతూ ఆశ్రమాన్ని చూసాడు. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వేదవతినీ చూసాడు. అందాలు అతివకు తపస్సు చేయాల్సిన అగత్యం ఏమొచ్చిందా అని అదేమాటను వేదవతి తపస్సును భంగం చేసి మరీ అడిగాడు. నారాయణుడి కన్నా తనే గొప్పన్నాడు. అయినా నారాయణుణ్నే పెళ్ళాడతానంది వేదవతి. తిరస్కారాన్ని భరించలేని రావణుడు ఆమె జుట్టుపట్టుకొని ఈడ్చుకు వెళ్ళబోయాడు. ఒడుపుగా విడిపించుకున్న వేదవతి తన శరీరం అవిత్రమైనట్టు భావించింది. “నువ్వు ఇక మీదట ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే తలపగిలి చస్తావు” అని శపించింది. ఇక ఈ దేహంతో ఉండనంది. “అయోనిజగా పుట్టి నిన్నూ నీలంకనూ సర్వనాశనం చేస్తాను” అని శపథం చేసింది. యోగాగ్నిని సృష్టించుకొని దగ్ధమైపోయింది.
అదిగో అలా వేదవతి పెట్టిన శాపం వల్ల తదనంతర కాలంలో సీతను ఎత్తుకుపోయాడేగాని బలత్కారం చేయ సాహసించలేదు. అలాచేస్తే తలపగిలి చస్తానని రావణునికి ఎరుకవుంది. అందుకనే ఎన్నో ప్రయత్నాలు చేసిన రాక్షసరాజు తన స్వభావ సిద్ధంగా కాక విరుద్ధంగా సీతతో మెలిగాడు.
మరి వేదవతి లంకా నాశన శపథం ఎలా నెరవేరిందో తెలుసా?
రావణుడు రోజూ శతకోటి లింగార్జన చేసేవాడు. పాలతో శివుణ్ని అభిషేకించేవాడు. అలా పారిన పాలు కొలను గట్టాయి. అందులో తామరపూసింది. ఆపువ్వులో నవ్వుతూ వేదవతి పసిపాపగా పుట్టింది. పూలుకోస్తున్న రావణుడు పసిపాప నవ్వు విన్నాడు. “నన్ను ముట్టబోకు గోవింద రామా! నాశనమవుతావు గోవింద రామ!” అని జానపదులు వేదవతి మనసును మాటల్లోపట్టి పాట కట్టడమూ ఉంది. వద్దన్నా ఆ పువ్వును కోసిన రావణుడు తన ఇరవై చేతులతోగాని ఎత్త లేకపోయాడట. తీసుకెళ్ళి మండోదరికి ఇచ్చాడట. పువ్వురేకుల మధ్య పవళించి ఉన్న బంగారం రంగు పసిదాన్ని మండోదరి చూసిందట. దైవజ్ఞుల్ని పిలిచిందట. ఆ పిల్ల లంకా నాశనానికే పుట్టిందని తెలుసుకొని రావణుని వేడుకొని బంగారం పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలిందట. సముద్రుడు కొన్నాళ్ళు ఆ బిడ్డను పెంచి తనింక పెంచలేనని భూదేవికి ఇచ్చాడట. అలా భూదేవి తనలో దాచుకున్న బిడ్డను పూజలు చేసి నోములు నోచిన జనక మహారాజు తన మిథిలనగర భూముల్ని దున్నుతుంటే నాగలికి అందించిందట. నాగేటి చాల్లలో పుట్టింది కాబట్టి “సీత” అని పేరు పెట్టారు. సీత కథ మీకు తెలిసిందే. సీత కారణంగా రావణ సంహారమూ మీరెరిగిందే!
వేదవతి సీతగా పుట్టి విష్ణు అంశయైన రాముణ్ని పెళ్ళాడి రావణున్ని అంతంచేసింది!.
– బమ్మిడి జగదీశ్వరరావు