Telugu Global
Family

స్వర్గం (Devotional)

ఒక ఆశ్రమంలో వివేకవంతుడయిన గురువు ఉండేవాడు. ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఎందరో శిష్యులు ఉండేవాళ్ళు. గురువు వాళ్ళలో ఆధ్యాత్మిక ఆలోచనల్ని రేకెత్తించేవాడు. ఒక శిష్యుడికి స్వర్గం ఎక్కడ ఉంటుంది? అన్న సందేహం కలిగింది. మాటిమాటికీ గురువును “గురుదేవా? స్వర్గం ఎక్కడ ఉంది?” అని అడిగేవాడు. గురువు ఒక రోజు ధ్యానంలోకి వెళ్ళిపోయేముందు ఎప్పటిలాగా శిష్యుడు “స్వర్గం ఎక్కడ ఉంది?” అని అడిగాడు.             గురువు “నా ప్రియ శిష్యుడు హేమచంద్ర స్వర్గంలో ఉన్నాడు” అని వివరాలు […]

ఒక ఆశ్రమంలో వివేకవంతుడయిన గురువు ఉండేవాడు. ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఎందరో శిష్యులు ఉండేవాళ్ళు. గురువు వాళ్ళలో ఆధ్యాత్మిక ఆలోచనల్ని రేకెత్తించేవాడు. ఒక శిష్యుడికి స్వర్గం ఎక్కడ ఉంటుంది? అన్న సందేహం కలిగింది. మాటిమాటికీ గురువును “గురుదేవా? స్వర్గం ఎక్కడ ఉంది?” అని అడిగేవాడు. గురువు ఒక రోజు ధ్యానంలోకి వెళ్ళిపోయేముందు ఎప్పటిలాగా శిష్యుడు “స్వర్గం ఎక్కడ ఉంది?” అని అడిగాడు.

గురువు “నా ప్రియ శిష్యుడు హేమచంద్ర స్వర్గంలో ఉన్నాడు” అని వివరాలు చెప్పకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. గురువు గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక బయటికి వచ్చాడు. తనతో ఉన్న ఇతర శిష్యుల్ని హేమచంద్ర వృత్తాంతం అడిగాడు. వాళ్ళెవరూ తమకు తెలియదన్నారు. ఆశ్రమంలోనే ఉన్న ఒక సన్యాసి హేమచంద్రుని గురించి నాకు తెలుసు అన్నాడు. శిష్యుడు “దయచేసి అతని గురించి చెప్పండి. అతను స్వర్గంలో ఉన్నాడని మా గురువు గారు అన్నాడు.”

ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి “హేమ చంద్రుడు ఉన్నచోటు నాకు తెలుసు. అది మనోహరమయిన లోయ. పూలతోటలు, జలపాతాలు, పచ్చిక బయళ్ళు, పక్షుల కలకలా రావాలతో అది ఎంతో మనోహరంగా ఉంటుందని విన్నాను. అంతే కానీ ఎప్పుడూ అక్కడికి వెళ్ళ లేదు. పైగా అది వంద మైళ్ళ దూరంలో పర్వతాల వెనక ఉంది” అన్నాడు.

“అక్కడికి వెళ్ళే మార్గమేది” అని అడిగాడు శిష్యుడు. వెళ్ళే మార్గం చెబుతాను అన్నాడు సన్యాసి. శిష్యుడు జాగ్రత్తగా ఆ వివరాలన్నీవిన్నాడు.

శిష్యుడిలో ఉత్సాహం ఉరకలెత్తింది. తను స్వర్గాన్ని చూడబోతున్నానన్న ఆనందం కలిగింది. ఇక గురువు గారి దగ్గర అనుమతి తీసుకోవడమే మిగిలింది అనుకున్నాడు.

మరుసటి రోజు ఉదయాన్నే గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు పూజకు పూలు, ఇతర సరంజామా సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. శిష్యుడు “గురువుగారూ! నేను హేమచంద్రుని దగ్గరకు వెళుతున్నాను. అంటే స్వర్గానికి వెళుతున్నాను” అన్నాడు. గురువు “మంచిది వెళ్ళిరా!” అన్నాడు.

శిష్యుడు కొన్ని ఎండురొట్టెలు సిద్ధం చేసుకుని ప్రయాణం ఆరంభించాడు. బీడుభూములు, పొలాలు, అడవులు దాటి మధ్యమధ్యలో కొన్ని గ్రామాల్లో విశ్రాంతి తీసుకుంటూ చివరికి కొన్ని రోజుల ప్రయాణానంతరం ఒక పర్వతం ఎక్కి అటు వేపున ఉన్న లోయలోకి దిగాడు. పచ్చగా, ప్రశాంతంగా ఉంది ఆ లోయ. పూలు, పిట్టలు వున్నాయి. కానీ శిష్యుడు ‘ఇంతకన్నా బాగున్న ఎన్నో లోయల్ని చూశాను. కానీ గురువుగారు దీన్ని స్వర్గమని ఎందుకన్నారో అర్ధం కావడంలేద’ని అనుకున్నాడు.

శిష్యుడికి స్వర్గం గురించి వేరే ఊహలున్నాయి. పురాణాల్లో దేవదూతలు, కల్పవృక్షం, కామధేనువు వంటివి చదివి వున్నాడు. కానీ అవేవీ లేవు.

లోయలోని ఒక సరోవరం ఒడ్డున కుటీరం ఉంది. అక్కడికి వెళ్ళి హేమచంద్రుణ్ణి కలిసి గురువుగారి గురించి చెప్పాడు. హేమచంద్రుడు ఎంతో సంతోషించి శిష్యుణ్ణి ఆదరించి ఆతిధ్యమిచ్చాడు. గురువు క్షేమసమాచారాలడిగాడు.

రెండు రోజుల అనంతరం శిష్యుడు హేమచంద్రుని దగ్గర వీడ్కోలు తీసుకుని తిరుగు ప్రయాణమై తమ ఆశ్రమానికి వచ్చి గురువు గారూ! నేను హేమచంద్రుడున్న ప్రదేశానికి వెళ్ళాను. మీరు దాన్ని స్వర్గమన్నారు. అది మామూలుగా ఉన్న ప్రదేశం. నాకు ప్రత్యేకత కనిపించలేదన్నాడు. గురువు “మరచిపోయాను, నువ్వు ఏ ఉద్దేశంతో స్వర్గం గురించి అడిగావో నాకు చెప్పలేదు. హేమచంద్ర స్వర్గంలో లేడు. స్వర్గమే హేమచంద్రలో ఉంది” అన్నాడు.

– సౌభాగ్య

First Published:  16 Jun 2015 6:31 PM IST
Next Story