Telugu Global
Family

అధిగమించడం (Devotional)

ప్రపంచవ్యాప్తంగా పరుగుపందెంనడుస్తోంది. అందరికన్నా మందుండాలి. వ్యాపారంలో మనదే పై చేయి కావాలి. బంధువులందరికన్నా మనమే గొప్పవాళ్ళం కావాలి. కాలేజీలో మనవాడికే ఫస్ట్‌ర్యాంక్‌ రావాలి. అక్కడ విచక్షణ ఉండదు. జీవితానికి అర్ధం ఉండదు. అన్ని రంగాల్లో వేగం, పోటీ అంతరంగాన్ని వెనక్కి తోశాయి. ప్రశాంత జీవితాన్ని పాతాళానికి నెట్టాయి.             పిల్లల్ని మంచివాళ్ళుగా కాక చురుకయిన వాళ్ళుగా తయారు చేస్తున్నాం. డబ్బు సంపాదించే యంత్రాలుగా మలుస్తున్నాం. నీతులు కట్టి పెట్టి నాలుగు డబ్బులు సంపాదించు అని అంటారు ప్రతి […]

ప్రపంచవ్యాప్తంగా పరుగుపందెంనడుస్తోంది. అందరికన్నా మందుండాలి. వ్యాపారంలో మనదే పై చేయి కావాలి. బంధువులందరికన్నా మనమే గొప్పవాళ్ళం కావాలి. కాలేజీలో మనవాడికే ఫస్ట్‌ర్యాంక్‌ రావాలి. అక్కడ విచక్షణ ఉండదు. జీవితానికి అర్ధం ఉండదు. అన్ని రంగాల్లో వేగం, పోటీ అంతరంగాన్ని వెనక్కి తోశాయి. ప్రశాంత జీవితాన్ని పాతాళానికి నెట్టాయి.

పిల్లల్ని మంచివాళ్ళుగా కాక చురుకయిన వాళ్ళుగా తయారు చేస్తున్నాం. డబ్బు సంపాదించే యంత్రాలుగా మలుస్తున్నాం. నీతులు కట్టి పెట్టి నాలుగు డబ్బులు సంపాదించు అని అంటారు ప్రతి ఒక్కరూ. ఆనందానికి, సుఖానికి తేడా తెలీకుండా మనుషులు జీవిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ మనిషికి నిజానికి మరింత వెసులుబాటు ఉండాలి. దానికి భిన్నంగా రోజుకు పన్నెండు గంటలు, పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు.

దేశాలు అభివృద్ధి రేటును ప్రతిఏటా ప్రకటిస్తూఉంటాయి. కాలేజీలు ప్రతి సంవత్సరం ర్యాంకుల పంటలు పండిస్తూ టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి.

రాజేష్‌ను అందరు తల్లిదండ్రుల్లాగే వాళ్ళుకూడా తెలివైన కుర్రాడుగా పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటపాటలు కట్టిపెట్టి క్లాసులో ఫస్టు రావాలని చిన్నప్పటి నించీ నూరిపోశారు.

రాజేష్‌ తల్లిదండ్రుల మాట జవదాటకుండా రాత్రింబవళ్ళు చదివి ఫస్టుమార్కుల్తో నెగ్గాడు. కాలేజీలో చేరాడు. అదే శ్రమని కొనసాగించాడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయ్యాడు. మరింతగా శ్రమపడి టీమ్‌ లీడర్‌ అయ్యాడు. పైకి ఎదగడానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. వాటి వెంటబడ్డాడు. ఇంకా ఇంకా సంపాదించే పనిలో పడ్డాడు. ఇంటికి ఎప్పుడు వస్తాడో అతనికే తెలీదు. అతనికి ఉన్న లక్ష్యమొకటే. అందరికన్నా తనది పై చేయి ఉండాలి. అన్నిట్లో తనే మొదటివాడుగా ఉండాలి.

ఒకరోజు ఉన్నట్లుండి అశాంతిగా ఫీలయి ఇంట్లో కూడా చెప్పకుండా హిమాలయా పర్వతాలకు వెళ్ళిపోయాడు. ప్రశాంతమయిన వాతావరణంలో ఒక గురువుకు శిష్యుడుగా చేరాడు. గురువు బోధనలు శ్రద్ధగా విన్నాడు. మనసంతా ప్రశాంతత అలముకుంది.

“నేను క్షేమంగా ఉన్నాను. నేను పరుగుపందెంలో అలసిపోయాను. ఇక్కడ ఆనంద ఆశ్రమంలో కైవల్య ఋషి దగ్గర శిష్యుడుగా చేరాను. ఆయన బోధనల్ని వంట పట్టించుకున్నాను. ఆయన ఇచ్చిన గ్రంథాలన్నిట్నీ అధ్యయనం చేస్తున్నాను. అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నా గురించి దిగులు పడకండి. ఆఫీసులో సెలవు అప్లై చేసేవచ్చాను. ఇక్కడ కనీసం ఆరునెలలు ఉండ దలచుకున్నాను” అని తల్లి దండ్రులకు ఉత్తరం రాశాడు.

కొడుకు ఉత్తరం చదివి తల్లిదండ్రులు ఆనందించారు. మళ్ళీ నెల తరువాత ఇంకో ఉత్తరం వచ్చింది.

“మీరు నన్ను పెంచిన క్రమశిక్షణ నాకు ఎంతగానో ఇక్కడ కూడా ఉపయోగపడింది. గురుదేవుల పట్ల నా భక్తి విశ్వాసాలకు ఆయన ఎంతగానో సంతోషించాడు”. ఆశ్రమ విధులన్నీ ఆయనే నాకు అప్పగించాడు. దాదాపు నా అనుమతి లేనిదే ఆశ్రమంలో ఎవరూ అడుగు పెట్టలేరు. ఆశ్రమంలో గురువు తరువాత నాదే అధికారం. గురువు అనంతరం ఆశ్రమానికి అధికారిని నేను అవుతాను అని రాశాడు.

అది సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఐనా, ఆశ్రమమయినా అధిగమించాలన్న దృష్టి అతని నించీ పోలేదు.

– సౌభాగ్య

First Published:  14 Jun 2015 6:31 PM IST
Next Story