సొంతం చేసుకోవడం (Devotional)
మనం వ్యక్తుల్ని, వస్తువుల్ని వేరువేరుగా చూస్తున్నామనుకుంటాం. కానీ వస్తువుల్నెట్లా సొంతం చేసుకోవాలనుకుంటున్నామో, అట్లాగే మనుషుల్ని కూడా సొంతం చేసుకోవాలనుకుంటాం. ఆ సంగతి గుర్తించం. ప్రేమ అన్నది ఒక వస్తువు పట్లో, ఒక వ్యక్తి పట్లో కేంద్రీకృతమయితే అది ప్రేమ అనిపించుకోదు. ప్రేమ విశాలమయింది. సరిహద్దులు లేనిది. అణువు నించీ అనంత విశ్వందాకా వ్యాపించింది ఏదయితే ఉందో అదే ప్రేమ. అన్నిట్లో తానుండి, అన్నీ తనలో ఉన్నదేదయితే ఉందో అదే ప్రేమ. ప్రేమ ఎవరికీ సొంతం కాదు, […]
మనం వ్యక్తుల్ని, వస్తువుల్ని వేరువేరుగా చూస్తున్నామనుకుంటాం. కానీ వస్తువుల్నెట్లా సొంతం చేసుకోవాలనుకుంటున్నామో, అట్లాగే మనుషుల్ని కూడా సొంతం చేసుకోవాలనుకుంటాం. ఆ సంగతి గుర్తించం. ప్రేమ అన్నది ఒక వస్తువు పట్లో, ఒక వ్యక్తి పట్లో కేంద్రీకృతమయితే అది ప్రేమ అనిపించుకోదు.
ప్రేమ విశాలమయింది. సరిహద్దులు లేనిది. అణువు నించీ అనంత విశ్వందాకా వ్యాపించింది ఏదయితే ఉందో అదే ప్రేమ. అన్నిట్లో తానుండి, అన్నీ తనలో ఉన్నదేదయితే ఉందో అదే ప్రేమ. ప్రేమ ఎవరికీ సొంతం కాదు, సొంతం చేసుకుంటే అది ప్రేమ కిందకు రాదు.
ఒక వ్యక్తికి పురాతన వస్తువుల్ని సేకరించడం హాబీ. చారిత్రకంగా విలువైన కళా ఖండాల్ని అతను సేకరిస్తూ ఉంటాడు. వాటికోసం అతను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎన్నో షాపులు తిరుగుతాడు. ఎన్నో వీధుల్లో అన్వేషిస్తూ ఉంటాడు.
ఆ క్రమంలో అతను ఒక వీధిలో వెళుతూ ఉంటే ఒక పిల్లుల్ని అమ్మే షాపు కనిపించింది. అక్కడ ఒక పిల్లి సాసర్‌లో పాలు తాగుతూ కనిపించింది. ఒక్క క్షణం అక్కడ నిలబడి పిల్లి పాలు తాగుతున్న సాసర్‌ని గమనించాడు. ఆ సాసర్ చాలా పురాతనమైంది. దాంట్లో అందమయిన పూలు, తీగలు, అల్లికలు చిత్రించారు. అది కనీసం కొన్ని వందల సంవత్సరాల పురాతనమయింది. బహుశా యూరోపు పునరుజ్జీవన కాలానికి సంబంధించి ఉంటుంది. దాని విలువ షాపు యజమానికి తెలీక పిల్లులకు పాలు పట్టడానికి దాన్ని ఉపయోగిస్తున్నాడనుకున్నాడతను. ఎట్లాగయినా ఆ సాసర్‌ని సొంతం చేసుకోవాలనిపించింది.
షాపులోకి వచ్చాడు. పాలు తాగుతున్న పిల్లిని చూశాడు, సాసర్‌ని చూశాడు. తరువాత షాపు యజమానిని చూశాడు. ఇదంతా షాపు ఓనరు గమనిస్తున్నాడు.
షాపు యజమాని “ఏం కావాలండీ!” అన్నాడు.
అతను “నాకో పిల్లి కావాలండి” అన్నాడు. “ఏది కావాలో మీరే ఎంపిక చేయండి” అన్నాడు షాపతను.
కళాభిమాని “ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉంది. అందుకని మంచి చురుకయిన పిల్లి కావాలి” అన్నాడు. షాపతను “ఆ నల్లపిల్లిని తీసుకోండి” అన్నాడు.
కళాభిమాని “అది వద్దు. అక్కడ సాసర్‌లో పాలు తాగుతున్న పిల్లికావాలి” అన్నాడు.
షాపతను “మీ ఇష్టం” అన్నాడు. కళాభిమాని “ఆ పిల్లిని తీసుకుంటాను. ఐదు డాలర్లకు ” అన్నాడు. అంత తక్కువ వీలుపడదు, పదిడాలర్లకయితే అమ్ముతానన్నాడు.
కళాభిమాని పదిడాలర్లు ఇచ్చి పిల్లిని తీసుకున్నాడు. సాసర్‌పేవు చూశాడు.
“నాకు సాసర్‌కూడా కావాలి. కొత్త సాసర్ అంటే పిల్లి అలవాటుపడాలి కదా! అందుకనీ ఈ పాత సాసర్‌నే అమ్మితే తీసుకుంటాను” అన్నాడు.
షాపతను “సార్ సారీ! ఆ సాసర్‌ని అమ్మను” అన్నాడు.
కళాభిమాని ఆశ్చర్యంగా “ఎందుకని?” అన్నాడు.
షాపతను “ఎందుకంటే ఆ సాసర్ నా అదృష్టం. దాని మూలంగా నెలకు కనీసం అరవై పిల్లుల్ని అమ్ముతున్నాను” అన్నాడు.
కళాభిమాని ముఖం వెలవెలబోయింది.
మనకు మాత్రమే కొన్నిటి విలువ తెలుసుననుకుని మనం భ్రమపడుతూ ఉంటాం.
నిజానికి కళాభిమాని కొనాలనుకున్నది సాసర్‌ని. కానీ అతనికి పిల్లి దొరికింది.
వ్యామోహమన్నది పిల్లి పట్లయినా, సాసర్ పట్లయినా అది వ్యామోహమే!
– సౌభాగ్య