సంబంధం (Devotional)
సంబంధమన్నది రక్తంతో సంబంధం లేనిది. కానీ నిజమైన సంబంధం రక్తబంధమని చాలామంది అనుకుంటారు. రక్త సంబంధం కావచ్చు, స్నేహసంబంధం కావచ్చు. ఏదయినా ప్రయోజనాల్తో ముడిపడిన సంబంధం నిజమైన సంబంధం కాదు. అక్కడ ప్రేమ ఉన్నపుడు, అనురాగం ఉన్నపుడు అది నిజమైన సంబంధమవుతుంది, అనురాగ బంధమవుతుంది. మనుషులు ఆ విషయమై ప్రయోగం చేయలి. కనీసం ఒక గంట సేపు ఎట్లాంటి ప్రయోజనం ఆశించకుండా ఇతరులకోసం ఏమయినా చేసినపుడు స్వచ్ఛమయిన అనుబంధం ఏమిటో తెలుస్తుంది. అది ఏ పనయినా […]
సంబంధమన్నది రక్తంతో సంబంధం లేనిది. కానీ నిజమైన సంబంధం రక్తబంధమని చాలామంది అనుకుంటారు. రక్త సంబంధం కావచ్చు, స్నేహసంబంధం కావచ్చు. ఏదయినా ప్రయోజనాల్తో ముడిపడిన సంబంధం నిజమైన సంబంధం కాదు. అక్కడ ప్రేమ ఉన్నపుడు, అనురాగం ఉన్నపుడు అది నిజమైన సంబంధమవుతుంది, అనురాగ బంధమవుతుంది.
మనుషులు ఆ విషయమై ప్రయోగం చేయలి. కనీసం ఒక గంట సేపు ఎట్లాంటి ప్రయోజనం ఆశించకుండా ఇతరులకోసం ఏమయినా చేసినపుడు స్వచ్ఛమయిన అనుబంధం ఏమిటో తెలుస్తుంది. అది ఏ పనయినా కావచ్చు, ఇతరుల్ని రోడ్డు దాటించడం కావచ్చు, వీధిని పరిశుభ్రం చేయడం కావచ్చు. మొదట్లో అది ఇబ్బందిగా అనిపించవచ్చు. కాలం గడిచే కొద్దీ ఆ మాధుర్యం అర్థమవుతుంది.
ఒక స్త్రీకి కళ్ళు కనిపించవు. మనిషికి ఉన్న గొప్ప శాపం చూపులేకపోవడం. అంతా అంధకారం. అందమయిన ప్రపంచాన్ని చూడ లేకపోవడమన్నది అన్ని దురదృష్టాలలో కెల్లా పెద్దది. ప్రపంచంలో కోట్లమంది కళ్ళు లేని వాళ్ళున్నారు. వాళ్ళను తలచుకుంటే మనకు కళ్ళలో నీళ్ళు కదుల్తాయి. సృష్టిలో ఇట్లాంటివి ఎందుకు ఉంటాయో అనిపిస్తుంది.
ఆ స్త్రీకి తనంటే అహస్యం. తాను గుడ్డిదాన్నని, తన జీవితం అర్థం లేనిదని, వ్యర్థమని ఆమె అనుకునేది. తనపట్ల మాత్రమే కాదు, ఆమె ప్రపంచాన్ని కూడా ద్వేషించేది. ఆమెకు అన్ని విషయాల్లో ఆమె స్నేహితుడు సహాయ పడేవాడు. ఆమెను ఎక్కడికన్నా తీసుకుపోవాలన్నా, ఆమెకు అన్నీ సమకూర్చి పెట్టాలన్నా అతనొకడే చేసేవాడు. అందర్నీ ద్వేషించే ఆమెకు అతనంటే ఇష్టం. కారణం అన్ని విషయాల్లో అతనామెకు తోడు.
అతనికి ఆమె అంటే ప్రేమ. కానీ తన ప్రేమను ఎప్పుడూ అతను వ్యక్తపరచలేదు. కానీ ఆమె మాత్రం అతని పట్ల తన ప్రేమను బహిరంగంగా వ్యక్త పరిచేది. అతని పేరు చంద్రుడు. “చంద్రా! ఒకవేళ నాకు కళ్ళుకనిపిస్తే, నేను చూడగలిగితే తప్పక నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనేది. అతను నవ్వి ఊరుకునేవాడు.
ఆమెను ఎందరో డాక్టర్లకు చూపించాడు. లాభం లేకపోయింది. ఎవరయినా నేత్రదానం చేస్తే తప్ప ఆమెకు చూపు రావడం అసంభవం అన్నాడొక డాక్టర్. అదయినా కచ్చితంగా చెప్పలేమని, ఒక వేళ చూపువస్తే రావచ్చు, రాకపోవచ్చు అన్నాడు.
కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజు డాక్టర్‌నించీ పిలుపు వచ్చింది. చంద్రుడు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. డాక్టర్ ఎవరో నేత్రదానం చేశారని, ఒప్పుకుంటే ఆమెకు ఆపరేషన్ చేసి ఆ కళ్ళు అమరుస్తానని చెప్పాడు. ఆమె ఒప్పుకుంది. ఆపరేషన్ జరిగింది.
ఆమె తనకు చూపువచ్చిన మరుక్షణం చంద్రుడు తన ముందు ఉండాలని, మొదట అతన్నే చూస్తానని చెప్పింది. ఆమెకు కట్లు విప్పేరోజు ఎదురుగా చంద్రుడు నిల్చున్నాడు. మొదట కళ్ళు తెరిచి మెల్లగా తన ముందున్న వ్యక్తిని ఆమె చూసింది. ఎదురుగా చంద్రుడు. చంద్రుడు “కనిపిస్తున్నానా?” అన్నాడు. కనిపిస్తున్నావంది. చంద్రుడు “నేను చూడగలిగితే తప్పక నిన్ను పెళ్ళి చేసుకుంటానని అన్నావు కదా! నన్ను పెళ్ళాడుతావా?” అన్నాడు.
ఆమె “చంద్రా! సారీ! నీకు కళ్ళుంటే పెళ్ళాడేదాన్ని. కానీ నువ్వు గుడ్డివాడివి” అంది.
చంద్రుడు ఆ మాటలకు కాసేపు మౌనంగా ఉండి తలుపు దాకా తడుముకుంటూ వెళ్ళి “ఫరవాలేదు. కానీ నా కళ్ళు జాగ్రత్త!” అని వెళ్ళిపోయాడు.
– సౌభాగ్య