తెలుగు రాష్ట్రాల రగడలో గవర్నర్ పాత్ర ఎంత?
ఓటుకు నోటుకు వ్యవహారంలో గవర్నర్ పాత్ర ఎంత? ఈ విషయం ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లుల్లా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్నా… బహిరంగంగానే తాము గెలిచిన పార్టీపై విమర్శలకు దిగుతున్నా… రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ నరసింహన్ మౌనముద్ర దాల్చడం, ప్రేక్షకపాత్ర పోషించడాన్ని అన్ని రాజకీయ పార్టీలూ జీర్ణించుకోలేక పోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి పాత్ర పోషిస్తున్న గవర్నర్ నరసింహన్ కఠినంగా తన వైఖరి బయటికి వెల్లడించే తత్వం ఉంటే ప్రస్తుతం […]
BY sarvi11 Jun 2015 9:09 AM IST
X
sarvi Updated On: 11 Jun 2015 9:27 AM IST
ఓటుకు నోటుకు వ్యవహారంలో గవర్నర్ పాత్ర ఎంత? ఈ విషయం ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లుల్లా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్నా… బహిరంగంగానే తాము గెలిచిన పార్టీపై విమర్శలకు దిగుతున్నా… రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ నరసింహన్ మౌనముద్ర దాల్చడం, ప్రేక్షకపాత్ర పోషించడాన్ని అన్ని రాజకీయ పార్టీలూ జీర్ణించుకోలేక పోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి పాత్ర పోషిస్తున్న గవర్నర్ నరసింహన్ కఠినంగా తన వైఖరి బయటికి వెల్లడించే తత్వం ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఆస్కారముండేది కాదన్నది నిశితంగా రాజకీయాలను గమనిస్తున్న వారి మనోగతం. ప్రస్తుతం ఓటుకు నోటు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్న ఈ అంశం ఇపుడు ఢిల్లీ గడప కూడా తొక్కింది. అయితే తెలంగాణలో ఇంతలా వ్యవహారం ముదరడానికి కారణం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహనే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఆయనకు వ్యతిరేకంగా విమర్శలు చేయడమే కాదు… ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి ఓ లేఖ రాస్తూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కలుషితం అయిపోవడానికి గవర్నర్ నరసింహన్ కూడా ఓ కారణమని ఎత్తిచూపారు.
ముందు నుంచీ గవర్నర్ నరసింహన్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల వలసలను తొలిగా ప్రోత్సహించింది సీఎం కేసీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నలుగురిని, తెలుగుదేశం నుంచి ఐదుగురిని ఆయన రకరకాలుగా ప్రలోభాలు పెట్టి ఆకర్షించారని ఆయన ఆరోపించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆకర్షిస్తున్నా గవర్నర్ నరసింహన్ ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని… ఇలా ఫిరాయింపులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్పడుతున్నా గవర్నర్ తనకు సంబంధం లేనట్లు వ్యవహరించడంతో ఈ ఫిరాయింపులు దారి తప్పాయని జీవన్‌రెడ్డి తన లేఖలో రాష్ట్రపతికి తెలిపారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిగా ప్రమాణం చేయించి గవర్నర్ తప్పు చేశారని విమర్శించారు. ఒకపార్టీ తరఫున గెలిచిన వ్యక్తిని ఇంకో పార్టీ మంత్రిపదవి ఇచ్చి సత్కరిస్తుంటే గవర్నర్ జోక్యం చేసుకుని వారించవలసిన అవసరం లేదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇందులో ఒకరిని నిందించి ప్రయోజనం లేదని, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో చంద్రబాబు ఈ ఆకర్షణ మంత్రాలు పఠిస్తూ జపాలు చేస్తున్నారని, గవర్నర్ నరసింహన్ ఇవేమీ పట్టించుకోకుండా గుళ్ళూ గోపురాలు తిరుగుతూ అసలు వ్యవహారాలను గాలికి వదిలేస్తున్నారని ఆయన తన లేఖలో ఆరోపించారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్…ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. గవర్నర్… రాజకీయ కుట్రలను అడ్డుకోకపోతే ఇక ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్ నరసింహన్ వైఫల్యం చెందారని అందుకే స్వయంగా కల్పించుకోవాలంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇలా కేసీఆర్, చంద్రబాబుతో సహా గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో ఇపుడు జనం, రాజకీయ నాయకుల దృష్టి గవర్నర్ వైపు మళ్ళుతోంది. ఆయన ఇకముందైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారా? ఎప్పటిలాగే రాజకీయ అవినీతి అంశాలను, ఫిరాయింపులను తనకు సంబందం లేనట్టు గాలికి వదిలేస్తారా? లేక ఇప్పటికైనా తనకున్న అధికారాలను ఉపయోగించి విచక్షణతో వ్యవహరిస్తారా అని రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు.
Next Story