భారం...అమ్మాయిలు కాదు...ఆలోచనలు!
చిన్నవయసులోనే పిల్లలకు చేసే బాల్య వివాహాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తాయని, సరైన వయసులో జరిగే పెళ్లి జంటకు ఆనందాన్ని ఇస్తుందని, లేటు వయసులో చేసుకుంటే ఇతరులకు ఆ పెళ్లి వినోదంగా మారుతుందనే నానుడి ఒకటి వినే ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే మనదేశంలో పెళ్లిళ్లు చాలా వరకు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేవే. మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒక మహిళకు 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లవుతోంది. గత నెలలో విడుదల అయిన తాజా జనాభా లెక్కల వివరాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. మహిళల వైపు నుండి […]
చిన్నవయసులోనే పిల్లలకు చేసే బాల్య వివాహాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తాయని, సరైన వయసులో జరిగే పెళ్లి జంటకు ఆనందాన్ని ఇస్తుందని, లేటు వయసులో చేసుకుంటే ఇతరులకు ఆ పెళ్లి వినోదంగా మారుతుందనే నానుడి ఒకటి వినే ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే మనదేశంలో పెళ్లిళ్లు చాలా వరకు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేవే. మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒక మహిళకు 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లవుతోంది. గత నెలలో విడుదల అయిన తాజా జనాభా లెక్కల వివరాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.
మహిళల వైపు నుండి ఆలోచిస్తే ఇది చాలా బాధని కలిగించే విషయం. నిరాశానిస్పృహలనూ కలిగించే నిజం. అందరికీ ఆనందాన్ని ఇచ్చే ప్రపంచం ఎప్పటికి మన కళ్లముందుకు వస్తుందనే ఆవేదనను మిగిల్చే వాస్తవం. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయని, రుజువులతో సహా బయటకు వస్తున్నా ఈ ధోరణి మాత్రం మారడం లేదు. రాజస్థాన్‌లో అమ్మాయిలకు మరీ చిన్న వయసులో వివాహాలు జరుగుతున్నాయని డేటా వివరిస్తోంది.
దేశంలో దాదాపు 58కోట్ల మహిళా జనాభా ఉంటే అందులో సుమారు 10కోట్ల మందికి పైగా ఇలా బాల్య వివాహాలు చేసుకున్నవారే ఉన్నారు. ఇంత కంటే విచిత్రం ఏమిటంటే బాల్య వివాహం చట్టపరంగా నేరమైనా 2001నుండి 2011 వరకు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నమోదైన కేసులు కేవలం 948. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో అందించిన వివరాలు ఇవి. 157మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించారు.
2006లో సవరించిన బాల్య వివాహాల నిరో ధక చట్టం ప్రకారం బాల్య వివాహాలకు జైలు శిక్షను మూడు నెలల నుండి రెండు సంవత్సరాలకు, అదే విధంగా జరిమానాను 2 లక్షల వరకు పెంచారు.
బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో 31.38శాతంతో రాజస్థాన్ప్రథమ స్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మధ్య ప్రదేశ్ ఉన్నాయి. ఇక మగ పిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేస్తున్నరాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాలు మొదటిస్థానాల్లో ఉన్నాయి. ఆడపిల్ల ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్లిపోతుంది కాబట్టి ఆమె చదువుపై ఖర్చు చేయడం వృథా అనే భావజాలం ఇంకా తల్లిదండ్రుల్లో అలాగే ఉంది. ఆడపిల్లకి మనిషిగా అందాల్సిన హక్కులు అందడం లేదనే బాధ గానీ, అపరాధ భావనగానీ ఇప్పటికీ వారిలో ఉండటం లేదు.
పెద్ద కుటుంబాల్లో అమ్మాయిలు ఉన్నపుడు వారి భారాన్నిఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని తల్లిదండ్రులు భావిస్తున్నారని రాజస్థాన్‌లో మహిళా సాధికారతకు కృషి చేస్తున్న సాంబలి ట్రస్ట్ స్థాపకుడు గోవింద్ సింగ్ రాథోర్ అంటున్నారు. బాల్య వివాహాలను నిరోధించే చట్టం అమలు విషయంలో చూపుతున్నఅలసత్వమే ఇందుకు కారణమని న్యూఢిల్లీలో ఉన్న యునిసెఫ్ ఇండియా ప్రతినిధి దోరా గిస్టి అంటున్నారు.. ఈ విషయంలో చట్టం ఉందని అందరికీ తెలుసు అయినా దాన్నిఅధిగమించడం ఆగడం లేదు. ఆడవాళ్లకు సమాజంలో సమానత్వం అందేవరకు ఇలాంటివి ఆగవు… ఆడపిల్లల స్వేచ్ఛను దెబ్బతీసే ఇలాంటి సంప్రదాయాలు ఆగనంతకాలం వారికి సమానత్వం రాదు. ఒక విష వలయంగా ఉన్న ఈ సమస్యకి మొదలెక్కడో, చివరెక్కడో చెప్పలేము. అంతా కలిసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కానీ ఓ మంచి పరిణామ క్రమం ముందుకు వెళ్లదు.
అమ్మాయిలు ఏడ్చి మొత్తుకుని పెళ్లి ఆపుచేయించిన కేసుల్లో ప్రభుత్వాలు స్పందించి అలాంటి ఆడపిల్లల చదువుకోసం అయ్యే ఖర్చును భరించడం, ప్రోత్సాహకాలు అందించడం చేస్తోంది. అలాంటివార్తలను చూస్తున్నాం. కానీ అలా తెగించలేని పిల్లలు మాత్రం మౌనంగా మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. సమాజం, ప్రభుత్వాలు, తల్లిదండ్రులు అందరిలోనూ కనబడుతున్న అలక్ష్యం…అలసత్వం…. ఇది. దీన్ని ఎలా చూడాలి… పుట్టకముందే కడుపులోనే చంపేసే వారికంటే ఈ పెళ్లి చేసి పంపేవాళ్లు కాస్త మేలే కదా…అనా….