రంగన్న ఓ అగ్ని శిఖ
తిరుగుబాటు తత్త్వం కొందరికి చిన్ననాటే అలవడుతుంది. కాని రాను రాను జీవితానుభవం నేర్పే పాఠాల వల్ల ఈ తత్వం చాలా మందిలో చల్లారుతుంది. కాని తిరగబడక తప్పని పరిస్థితులు ఇంకా ఉన్నాయనుకునే చైతన్యం ఉన్న వారికి జీవితాంతం తిరుగుబాటు ధోరణి కొనసాగుతుంది. దాశరథి రంగాచార్య చివరి క్షణం దాకా తిరగబడుతూనే ఉన్నారు. శారీరంకంగా బలహీన పడినా ఆయనలో ఈ లక్షణం మాత్రం అంతిమ క్షణాల దాకా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. స్కూలులో చదువుకునే రోజుల్లో రూమీ టోపీ […]
తిరుగుబాటు తత్త్వం కొందరికి చిన్ననాటే అలవడుతుంది. కాని రాను రాను జీవితానుభవం నేర్పే పాఠాల వల్ల ఈ తత్వం చాలా మందిలో చల్లారుతుంది. కాని తిరగబడక తప్పని పరిస్థితులు ఇంకా ఉన్నాయనుకునే చైతన్యం ఉన్న వారికి జీవితాంతం తిరుగుబాటు ధోరణి కొనసాగుతుంది. దాశరథి రంగాచార్య చివరి క్షణం దాకా తిరగబడుతూనే ఉన్నారు. శారీరంకంగా బలహీన పడినా ఆయనలో ఈ లక్షణం మాత్రం అంతిమ క్షణాల దాకా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది.
స్కూలులో చదువుకునే రోజుల్లో రూమీ టోపీ పెట్టుకోవాలన్న నిజాం ప్రభుత్వ ఆదేశాన్ని ఎదిరించడానికి బాల్యంలోనే సమ్మె చేయించిన వారు దాశరథి. దానితో ఆయనను పాఠ శాల నుంచి బహిష్కరించడమే కాదు నిజాం ఇలాఖాలోనే ఎక్కడా చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. అయినా ఆయన తన ధోరణి మార్చుకోలేదు. ఆ తర్వాతేప్పుడో చదువు కొనసాగించారు. తెలంగాగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అండదండలందించారు. స్వయంగా పోరాటంలోకి దూకారు. జైలు శిక్ష అనుభవించారు.
1972 నుంచి రంగాచార్యతో పరిచయం. కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. 1974లో హైదరాబాద్ లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో మహాసభల ఆవరణ వెలుపల అభ్యుదయ రచయితల సంఘం తరఫున ఎర్రటి ఎండలో పుస్తక ప్రదర్శన నిర్వహించాం. మా బాధ చూడలేక మధ్యమధ్యలో మజ్జిగ ఇప్పించే వారు. ఆ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఏ చదువుతున్నప్పుడు ఒక ఏడాది ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఏదో కోర్సు చేయాల్సి వచ్చింది. అప్పటికే ఆయన మునిసిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంటు కమిషనర్ హోదాలో ఉన్నారు. రోజూ క్రమం తప్పకుండా యూనివర్సిటీకి వచ్చే వారు. అప్పుడు నేను, కాచినేని రామారావు ఒకే ఆత్మగల రెండు శరీరాలుగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కనిపించే వాళ్లం. ఎవరు కనపడితే వారితో చర్చోపచర్చలు, వారిని మా దారికి తీసుకు రావడమే మా లక్ష్యం. అలా మేం “హితబోధ”లో నిమగ్నమై నడుస్తూ వెళ్తున్నప్పుడు రంగాచార్య పక్కనున్న వాళ్లు ఎవరో మమ్మల్ని చూసి ఆయనకు చెప్తే “వాళ్లకు వినిపించదయ్యా. వాళ్లు వాకింగ్ క్లాసులు పెడుతుంటారు” అని అనే వారు.
నేను విశాఖ పట్నంలో పని చేస్తున్నప్పుడు ఆయన ఒక సారి అక్కడికి వచ్చి ఫోన్ చేశారు. వస్తా లెండి అని చెప్పా. కాని సాయంత్రం దాకా వెళ్లడం కుదర లేదు. “ఆయన ఆఫీసు పనిలో పడితే ఇంకేమీ పట్టించుకోడు. మనమే వెళ్లి కుర్చీలోంచి లేపి తీసుకొద్దాం పదండి” అని కారేసుకుని నేరుగా మా ఆఫీసుకు వేంచేసి నన్ను లేవదీసుకు పోయారు. వయసులో నా కన్నా పాతికేళ్లు పెద్దైనా మమ్మల్నందరినీ చాలా అపేక్షతోనే చూసే వారు.
ప్రత్యేక సందర్భాలలో ఆత్మీయులైన వారిని స్వయంగా ఆహ్వానించాలనుకుంటాం. తీరా మర్చిపోవడమూ సహజమే. నా పెళ్లప్పుడు అలాగే జరిగింది. ఆయనను ఆహ్వానించనే లేదు. ఉదయం తొమ్మిదింటికి పెయ్యయితే ఏడింటికి గుర్తొచ్చింది. మా మిత్రుడొకరికి ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి చెప్పమన్నాను. ఆశ్చర్యంగా సరిగ్గా తొమ్మిది గంటలకల్లా రంగాచార్య వచ్చేశారు. అదీ ఆయన ఆత్మీయతకు నిదర్శనం. 1974 లో హైదరాబాద్ పాతనగర రచయితల సంఘం తరఫున ఓ మహా సభ నిర్వహించాం. మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. మా కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి మతోన్మాద శక్తులు సకల బందోబస్తుతో వచ్చాయి. కాని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ కార్యక్రమం ఆగకుండా కొనసాగించాగలిగాం. ఉదయం నుంచి రంగాచార్య ఆ సభల్లో పాల్గొన్నారు. సాయంత్రం బహిరంగ సభలో ఆయనా మాట్లాడాల్సి ఉంది. పొద్దున్నుంచి మతోన్మాదుల ఆగడాలను గమనించిన ఆయన తన ఉపన్యాసంలో విచ్ఛిన్నకారుల మీద విరుచుకుపడ్డారు. వారి నోళ్లు మూయించారు. ఆయన మాటల్లో అంత పదును ఎప్పుడూ చూడలేదు.
ఒక్కొక్క సారి ఆయన చిన్నపిల్లాడిలా ప్రవర్తించే వారు. నాగార్జున సాగర్ లో ఓ సభ పెడితే నేనూ ఆయనతో పాటు వెళ్లాలి. అనివార్య కారణాల వల్ల నేను వెళ్లలేదు. ఆ సభలో శ్రీ శ్రీ కూడా ఉన్నారు. శ్రీ శ్రీ ముందు ఎంతటి వారైనా చిరుదీపాలేగా. రంగాచార్య నొచ్చుకున్నారు. కావాలనే నేను గైరుహాజరయ్యానని భావించారు. ఆ సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి. ఆ తర్వాత కొన్నాళ్లకు అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సమావేశం జరిగితే ఇంగ్లిషులో ఏడు పేజీల రాజీనామా లేఖ రాసుకొచ్చి తన రాజీనామా ఆమోదించాలని పట్టుబట్టారు. ఆయన రాజీనామా చేయడం ఎవరికీ ఇష్టం లేదు. ఆయనేమో పట్టు విడవరు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి. చివరకు నేను ఓ సాంకేతిక కారణం చూపి ఆయన రాజీనామాను ఆమోదించే అధికారం కార్యవర్గానికి లేదని లా పాయింటు లాగాను. మిమ్మల్ని ఎన్నుకున్నది అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర సమితి. దానికి మాత్రమే మీ రాజీనామాను పరిశీలించే అధికారం ఉందన్నాను. పెద్దలందరూ నన్ను సమర్ధించారు. మరుసటి మహా సభ జరిగే లోపల రాష్ట్ర సమితి సమావేశం జరిగితేగా. అంత వరకు ఆయనే ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
హైదరాబాద్ 400 సంవత్సరాల ఉత్సవాలు జరిగినప్పుడు హైదరాబాద్ చరిత్రను నిజాం నవాబుల శకానికి పరిమితం చేయాలన్న కుట్ర జరిగింది. దీన్ని పరాస్తం చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. నా వాదనకు మద్దతుగా అప్పుడు నేను పని చేస్తున్న పత్రికలో రంగాచార్య వ్యాసం రాసి ఆదుకున్నారు. నిజాం ఎంతటి నిరంకుశుడో రుజువు చేస్తూ అద్భుతమైన వ్యాసం రాశారు. ఆయన వ్యాసంతో అంటుకున్న కొలిమిని నేను చాలా రోజులే కొనసాగించాను. డా. రాజ్ బహదూర్ గౌర్ ఇత్యాదులతో వరసగా వ్యాసాలు రాయించాను.
నా వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకునే వారు. నేను వెబ్ సైట్ల మాయలో పడి నికరమైన ఉద్యోగం వదులుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తానే ఫోన్ చేసి వద్దని వారించారు. పోగాలం దాపురించిన వారికి అరుధతీ నక్షత్రం, ధూప నిర్వాణ గంధం లాంటివి కనిపించక పోవడం సహజమే. అనుభవంతో చెప్పిన ఆయన మాట విననందుకు అనుభవించాల్సిన ఫలితమే అనుభవించాను.
అన్యాయం జరిగినప్పుడు నిరసంచని వారన్నా, తిరగబడని వారన్నా ఆయనకు ఒళ్లు మంట. ఎవరో ఆయన ఇంటికి వెళ్తే టీ ఇచ్చారు. అందులో చక్కెర లేదు. ఆ అథితి మొహం అదోలా పెట్టి టీ తాగడం గమనించి ఏమైంది చక్కెర లేదా అని అడిగారు రంగాచార్య. అవునని సదరు వ్యక్తి నంగినంగిగా సమాధానం చెప్పాడు. టీలో చక్కెర తక్కువైతే చెప్పలేని వారు ఎలా బతుకుతారయ్యా, ఎలా తిరగబడగలరు అన్న పెద్ద మనసు ఆయనది. తిరుగుబాటు అంటే ఆయనకు అంత ప్రాణం.
తను మనసారా ఏది నమ్మితే దానికి కట్టుబడి ఉండే వారు. సైద్ధంతిక అంశాలలో కూడా ఆయనది అదే దారి. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన అవతారం మార్చేసి అచ్చమైన వైష్ణవుడి వేషంలో కనిపించే వారు. ధోవతి, అంగ వస్త్రం, ఊర్ధ్వ పుండ్రాలు ఇదీ ఆయన అవతారం. కాని వేదికెక్కితే మార్క్సిజం ఎంత గొప్పదో చెప్పే వారు. ఇది వైరుధ్యంగా కనిపించవచ్చు. కాని ఆయనకు మతం మీద కన్నా దైవ మీదే విశ్వాసం మెండు. మార్క్సిజం మాత్రమే జనానికి నిష్కృతి కల్పించగలదన్న విశ్వాసమూ అంతే సమానంగా ఉండేది ఆయనలో. అందుకే రెండిటినీ సమాంతరంగా నమ్మగలిగారు. ఫ్యూడల్ నిరంకుశ పాలనను నిరసిస్తూ చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జనపదం నవలలు రాసిన చేత్తోనే ఒంటి చేతిమీద నాలుగు వేదాలను తెలుగులో రాశారు. తాను తప్ప మరెవరూ ఆ పని చేయలేరని ధీమాగా చెప్పే వారు. తాను కమ్యూనిస్టును కాకుండా ఉంటే వేదాలను తెలుగు చేయలేక పోయేవాడిననే వారు. తన వేదం మాత్రం కమ్యూనిస్టు మానిఫెస్టోనే అని సగర్వంగా చెప్పే వారు. దైవ భక్తి విశ్వాసానికి సంబంధించింది. మార్క్సిజం ఆచరణకు సంబంధించింది. ఈ రెండు పార్శ్వాలు రంగాచార్యలో కనిపిస్తాయి. దైవ భక్తి, మతాభినివేశం ఉన్న వారు జన శ్రయస్సు కోరుకోవాడానికి అనర్హులు కారుగా!
మున్సీపాలిటీ మారెడ్ పల్లి లో ఆయనకో ఇంటిని కేటాయించింది. అక్కడే పేదలు గుడిసెలు వేసుకుని ఉండే వారు. ఆ స్థలం నాదేనని ఓ దాదా తయారయ్యాడు. ఈ ఆగడాన్ని వ్యతిరేకించడానికి రంగాచార్య గుడిసెవాసులను సమీకరించి ఉద్యమం లేవ దీశారు. ఆ దాదా డబ్బిచ్చి పేదలను కొనేశాడు. డబ్బు ఎంతటి అకృత్యాలకు పాల్పడేలా చేస్తుందో గ్రహించిన రంగాచార్య “మాయ జలతారు” నవల రాశారు.
మంచం పట్టిన తర్వాత కూడా ఆయన ఆలోచనా స్రవంతి ఆగలేదు. ప్రపంచీకరణ అందరినీ మిగేస్తోందని ఆవేదన పడే వారు. ప్రపంచీకరణ, పశ్చిమ దేశాల పెత్తందారీ వైఖరికి వ్యతిరేకంగా జనాగ్రహం పెల్లుబకవలసినంత రీతిలో లేదని ఆయన మనసు క్షోభించేది. ప్రపంచీకరణ పేరుతో జనాన్ని అణచి వేసే ధోరణికి వ్యతిరేకంగా శాంతి కోరుకునే వారందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని కొద్ది నెలల కింద కలుసుకున్నప్పుడు కూడా రంగాచార్య చెప్పారు. ఇప్పుడు మనం తిరగబడక పోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని హెచ్చరించారు. మనం తిరగబడక పోతే భావి తరాల వారిని బానిసత్వంలోకి నెట్టేసినట్టే అన్నారు. ఆయనకు ఒంట్లో శక్తి ఉంటే కచ్చితంగా లేచి ప్రజోద్యమాల్లో భుజం భుజం కలిపి నడిచే వారే. అక్షర వాచస్పతి అయిన ఆయన అక్షరాలు, జీవన యానమే మనకు స్ఫూర్తి.
– ఆర్వీ రామారావ్