Telugu Global
Family

నారదుడు (For Children)

ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చెప్పి తగాదారేపి తమాషా చూసేవాణ్ని నారదుడని అంటూ ఉంటాం. నారదుణ్ని తలచుకోగానే “కలహభోజనుడు” బిరుదూ తగిలిస్తాం. కలహాలు కడుపు నింపుతాయా అంటే – కలహాల వల్ల చివరకు లోక కళ్యాణమే జరుగుతుంది. కాబట్టి కలహం కూడా కమనీయమే!             “నారద” అంటే జలాన్నిచ్చేవాడు అని అర్థం. వామనావతారం ధరించిన విష్ణువు ఒక అడుగు భూమి మీద, మరో అడుగు ఆకాశంలోకి వేసినపుడు – ఆ భగవంతుని పాదాలు కడగడానికి  బ్రహ్మ “నారద” అన్నాడు. అలా […]

ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చెప్పి తగాదారేపి తమాషా చూసేవాణ్ని నారదుడని అంటూ ఉంటాం. నారదుణ్ని తలచుకోగానే “కలహభోజనుడు” బిరుదూ తగిలిస్తాం. కలహాలు కడుపు నింపుతాయా అంటే – కలహాల వల్ల చివరకు లోక కళ్యాణమే జరుగుతుంది. కాబట్టి కలహం కూడా కమనీయమే!

“నారద” అంటే జలాన్నిచ్చేవాడు అని అర్థం. వామనావతారం ధరించిన విష్ణువు ఒక అడుగు భూమి మీద, మరో అడుగు ఆకాశంలోకి వేసినపుడు – ఆ భగవంతుని పాదాలు కడగడానికి బ్రహ్మ “నారద” అన్నాడు. అలా జలాలను తెచ్చి తండ్రికి ఇచ్చాడు నారదుడు. బ్రహ్మ తొడనుండి పుట్టినవాడుగా చెపుతారు. కంఠం నుండి పుట్టిన వాడిగా చెపుతారు. బ్రహ్మ మానసపుత్రుడుగా నారదుణ్ని అందరూ గుర్తిస్తారు. గౌరవిస్తారు. మనిషికి కావలసిన జ్ఞానాన్ని అందించేవాడని కూడా అర్థం ఉంది. నారదుడు త్రిలోక సంచారి. సంసారమూ లేదు. సంతానమూ లేదు. ఉన్నదల్లా హరిభక్తి. అదే అతని శక్తి! పుట్టిన వెంటనే తల్లి సరస్వతి దగ్గరకు పోయి సంగీత విద్యని నేర్చుకున్నాడు. వాయుదేవుని వల్ల “మహతి” అనే వీణను పొందాడు. కొడుకు గానామృతాన్ని విన్న బ్రహ్మ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. “నారాయణ.. నారాయణ” అని సమస్యవున్న చోటల్లా ప్రత్యక్షమయ్యేవాడు. లేని సమస్యను సృష్టించేవాడు. ఉన్న సమస్యని తీర్చేవాడు. నిందలు అతనికి విందులు! ఇంతకీ నారదునికి సమస్యలు లేవా? కష్టాలు లేవా? ఉన్నాయి…

ఒకరోజు బ్రహ్మ కుమారులను పిలిచి, మీకు తగ్గ అందాల అతివల్ని సృష్టిస్తాను, పెళ్ళి చేసుకొని ప్రజా సంతతి పెంచమని కోరాడు. హరి మీద తప్ప మరొకరి మీద మనసులేదని నారదుడు చెప్పాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. స్త్రీ లోలుడవవుతావని శపించాడు. బ్రహ్మకు పూజాధికాలు లేకుండా ప్రతిశాపమిచ్చాడు నారదుడు. అలా ఓ గంధర్వుని ఇంట ఉప బర్హనుడై పుట్టి లాలావతినీ ఆమె చెల్లెళ్ళను పెళ్ళాడాడు. బ్రహ్మలోకాన దేవసత్రయాగానికి భార్యలతో వెళ్ళి – రంభను చూసి కన్ను గీటి సభా మర్యాదను పాటించక శాపానికి లోనయ్యాడు. లీలావతి ప్రతిశాపంతో ఉపశమనమూ పొందాడు నారదుడు. తిరిగి బ్రహ్మలోకంలో పుట్టాడు. మళ్ళీ అదే కోరిక కోరాడు బ్రహ్మ. పెళ్ళి చేసుకొని పిల్లల్ని కంటే పున్నామ నరకం నుండి తప్పిస్తానని చెప్పడంతో నారదుడు అంగీకరించాడు. కాని పెళ్ళివేపు మనసు పోలేదు. హరి మీదికే మళ్ళింది. తపస్సుకు దిగాడు. ఇంద్రుడు భయపడ్డాడు. అప్సరసల్ని పంపాడు. గురికాకుండా కామాన్ని జయించాడు నారదుడు. శివశక్తి తప్ప నీ శక్తికాదని విష్ణువు చెప్పినా గర్వంతో నారదుడు నమ్మలేదు. ఫలితంగా అంబరీషుని పుత్రికను పెళ్ళాడడానికి స్నేహితుడైన పర్వతునితో పోటీపడ్డాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు విష్ణువుని కలిసి – ఒకరిది కోతి ముఖం అవ్వాలని మరొకరు – ఇద్దరూ ఒకే కోరిక కోరాడు. అలా ఇద్దరూ కోతి ముఖాలతో కనబడి అవమానం పాలయ్యారు. తమకు దక్కవలసిన అమ్మాయిని విష్ణువు పెళ్ళి చేసుకోవడం చూసి భార్యవియోగం పొందుతావని శపించి, వానరు(కోతు)ల మూలానే నీ భార్యని కలుసుకుంటావని ఉపశమనమిచ్చాడు. ప్రభావంగా రాముడై పుట్టినప్పుడు సీతకు దూరమయ్యాడు. నారదుని అహం అణిగింది. తండ్రికోరికమేరకు సృంజయుని కూతురు సుకుమారిని పెళ్ళాడాడు. వానర ముఖమున్నా భర్తతో భక్తిగా మెలిగింది సుకుమారి. అటువంటి కూతుర్ని ఇచ్చిన సృంజయునికి కొడుకు పుడతాడనీ – వాడి మల మూత్రాలు బంగారమవుతాయని వరం ఇచ్చాడు. హరి భక్తిలో నన్నుమించిన వారు లేరనుకొని విష్ణుమాయకు తలవంచాడు. తుంబురుని గానాన్ని లక్ష్మి మెచ్చుకోవడం తనని అవమానించడంగా భావించి రాక్షస గర్భంలో పుట్టమని శపించాడు. దక్ష ప్రజాపతి – కొడుకులను సంసార మార్గం వదిలి మోక్ష మార్గం పట్టించినందుకు – నీకు నిలకడలేకపోవుగాక! అని శాపానికీ గురయ్యాడు. కలహ భోజుడయ్యాడు. జలం ధరుణ్ని పార్వతి మీదికి ఉసిగొల్పి సంహారానికి సాయపడ్డాడు. మహిషాసురుణ్నిమట్టుబెట్టడంలో కూడా నారదుని పాత్ర ఉంది. కాలయముని విషయంలోనూ అంటే. అప్సరసల్లో ఎవరు మేటో తేల్చినా, తులసీ దళానికి కృష్ణుడు లొంగి సత్యభామ గర్వం వీడినా, గర్భస్త శిశువుగా ఉన్న ప్రహ్లాదుని ప్రాణాలు కాపాడినా, నక్షత్ర మండలంలో తన ఉపదేశంతో ఉన్నత స్థానం పొందినా, ధర్మరాజు రాజసూయ యాగం చేసినా విష్ణు తత్త్వాన్ని గ్రహించినా, గాలవుడు సద్గురువు ఆశ్రయమే ఉత్తమ ఆశ్రమమని తెలుసుకొన్నా, అకంపనుని మృత్యు దుఃఖం పోగొట్టినా, సృంజయునికి షోడశ రాజుల చరిత్ర చెప్పి తత్వాన్ని ఉపదేశించినా, ఇంద్రాజిత్తునకు విరుగుడుగా గరుత్మంతుణ్ని రామలక్ష్మణులు స్మరించినా, శకునికి ధర్మతత్వాన్ని ఉపదేశం చేసినా – యేం చేసినా లోక కళ్యాణం కోసమే నారదుడు చేసాడు! జ్యోతిర్నారథం, నారదస్మృతి, బృహన్నారథం, లఘునారదం, నారద శిల్పశాస్త్రం లాంటి అనేక గ్రంథాలు రాసాడు. అన్నిటిని మించి పరోపకారి… అదే నారద దారి!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  2 Jun 2015 6:32 PM IST
Next Story