Telugu Global
Family

రాజర్షి " బ్రహ్మర్షి (Devotional)

విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేసి రాజర్షి అని బిరుదును సంపాదించాడు. తన శక్తి సామర్థ్యాల చేత, మహిమల చేత ఎంతో కీర్తిని సంపాదించాడు. ప్రజలందరూ విశ్వామిత్రుణ్ణి “బ్రహ్మర్షీ” అని పిలిచేవారు.             కానీ వశిష్టమహాముని ఒక్కడే విశ్వామిత్రుణ్ణి ఎప్పుడూ “రాజర్షీ” అని సంబోధించేవాడు. ఆ మాట ఎంత గౌరవప్రదమయినప్పటికీ అది బ్రహర్షి అన్న మాటకన్నా ఒక మెట్టు తక్కువదే. అందుకని విశ్వామిత్రుడు వశిష్టమహర్షి తనను “రాజర్షీ”! అని సంబోధించినప్పుడల్లా అవమానంగా భావించేవాడు. తనను కించపరుస్తూ అలా సంబోధిస్తున్నాడని […]

విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేసి రాజర్షి అని బిరుదును సంపాదించాడు. తన శక్తి సామర్థ్యాల చేత, మహిమల చేత ఎంతో కీర్తిని సంపాదించాడు. ప్రజలందరూ విశ్వామిత్రుణ్ణి “బ్రహ్మర్షీ” అని పిలిచేవారు.

కానీ వశిష్టమహాముని ఒక్కడే విశ్వామిత్రుణ్ణి ఎప్పుడూ “రాజర్షీ” అని సంబోధించేవాడు. ఆ మాట ఎంత గౌరవప్రదమయినప్పటికీ అది బ్రహర్షి అన్న మాటకన్నా ఒక మెట్టు తక్కువదే. అందుకని విశ్వామిత్రుడు వశిష్టమహర్షి తనను “రాజర్షీ”! అని సంబోధించినప్పుడల్లా అవమానంగా భావించేవాడు. తనను కించపరుస్తూ అలా సంబోధిస్తున్నాడని అనుకునేవాడు.

విశ్వామిత్రుడి మనసులో వశిష్టుని పట్ల క్రమంగా క్రోథం పెరిగింది. ప్రతీకారవాంఛ పెరిగింది. ఎట్లాగయినా వశిష్టుని పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. చివరికి వశిష్టుణ్ణి అంతం చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఒక రోజు చీకటి పడుతోంది. విశ్వామిత్రుడు పదునైన కత్తిని తీసుకుని వశిష్టుని ఆశ్రమం దగ్గర ఉన్న ఒక పొదలో దాగి వశిష్టుని రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

ఆకాశంలోకి మెల్లగా చంద్రుడు వచ్చాడు. వెన్నెల పరిసరాలంతా నిండిపోయింది. వాతావరణం మనోహరంగా, ఆహ్లాదంగా ఉంది. ఆశ్రమం నించీ వశిష్టుడు, ఆయన భార్య అరుంధతి ఇద్దరూ బయటికి వచ్చారు. దగ్గరవున్న ఒక పరిచిన రాతి బండపై సుకా సీనులయ్యారు. అరుంధతి పరిసరాల్ని చూసి పరవశించిపోయింది.

“ఆకాశం ఎంత నిర్మలంగా ఉంది. పిండారబోసినట్లు వెన్నెల లోకాన్నంతా మెరిపిస్తోంది. ప్రత్యేకించి ఈ రోజు వెన్నెల మనోహరంగా ఉంది స్వామీ” అంది భర్తతో

వశిష్టుడు “అవును దేవీ! విశ్వామిత్రుని కీర్తిలా ఈ వెన్నెల విశ్వమంతా వ్యాపించింది” అన్నాడు.

పొదలో దాక్కున్న విశ్వామిత్రుని చేయి వణికి కత్తిజారి కిందపడింది. కళ్ళలో నీళ్ళు కదిలాయి. వశిష్టుని పట్ల అపారగౌరవం ఏర్పడింది.

“ఏమిటి? ఇంత సహృదయుడయిన వశిష్టుణ్ణా నేను సంహరించాలనుకున్నది! నన్ను తక్కువ చేస్తున్నాడనుకున్నా కానీ నా గురించి ఆయన ఎంత ఉన్నతంగా, ఉదాత్తంగా భావిస్తున్నాడు! నేనెంత దురహంకారిని, దుష్టుణ్ణి, నేను క్షమించలేని మహాపరాధం చేశాను అనుకుని కన్నీళ్ళతో, జోడించిన చేతుల్తో పొదనించి బయటికి వచ్చి “వశిష్టమహర్షీ! నన్నుక్షమించు” అని వశిష్టమహర్షి పాదాలపై పడ్డాడు.

వశిష్ట మహాముని “బ్రహర్షి విశ్వామిత్రా! మీ అంతటి వారికిది తగదు, లేవండి” అని విశ్వామిత్రుని లేపి ఆలింగనం చేసుకున్నాడు.

ఆ పిలుపుతో, ఆ చర్యతో విశ్వామిత్రుడు మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఎప్పటినించో తాను ఆశిస్తున్న విధంగా వశిష్టుడు పిలిచాడు. అది మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

“వశిష్టమహర్షీ! నాకు ఇప్పుడు ఆశ్చర్యం కలిగించింది మీ సంబోధన! నిన్నటిదాకా రాజర్షిగా పిలిచేవారు. ఇప్పుడు బ్రహ్మర్షి అని సంబోధించారు. ఈ మార్పుకి కారణమేమిటి?” అన్నాడు.

వశిష్టుడు “విశ్వామిత్రా! నిన్నటి దాకా నువ్వు అపార తపో సంపన్నుడవని, ఘటనా ఘటన సమర్థుడవని గర్వించావు. ఇప్పుడు నీ అహంకారం అదృశ్యమయింది. నువ్వు సౌమ్యుడవయ్యావు. వినయ సంపన్నుడవయ్యావు. అందుకని నీ రాజస గుణం స్థానంలో శాంతం చోటు చేసుకుంది. అందువల్ల ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షి వయ్యావు” అన్నాడు.

తనలో పరివర్తన తీసుకొచ్చిన వశిష్టునికి విశ్వామిత్రుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

– సౌభాగ్య

First Published:  2 Jun 2015 6:31 PM IST
Next Story