Telugu Global
Family

మనస్సాక్షి (Devotional)

ఆ నగరంలో గొప్ప మసీదు ఉంది. ఆ మసీదులో గొప్ప మహాత్ముని సమాధి ఉంది. మసీదుకు వచ్చిన అందరూ ఆ సమాధిని సందర్శిస్తారు. ప్రార్థనలు చేస్తారు. ఆ మహాత్ముడు ఎంత మంచి బోధనలు చేశారో మనసారా తలచుకుంటారు. ఉత్తముల్ని గుర్తు తెచ్చుకుంటే తమ జీవితం ప్రశాంతంగా గడుస్తుందని జనం నమ్ముతారు.             ఆ సమాధి సందర్శనానికి ఒక ఫకీరు వచ్చాడు. సమాధికి ధూపం వేసి మహాత్ముణ్ణి తలచుకున్నాడు. మనసు ప్రశాంతమయింది. కాసేపటికి నమాజు చేసే సమయం దగ్గర […]

ఆ నగరంలో గొప్ప మసీదు ఉంది. ఆ మసీదులో గొప్ప మహాత్ముని సమాధి ఉంది. మసీదుకు వచ్చిన అందరూ ఆ సమాధిని సందర్శిస్తారు. ప్రార్థనలు చేస్తారు. ఆ మహాత్ముడు ఎంత మంచి బోధనలు చేశారో మనసారా తలచుకుంటారు. ఉత్తముల్ని గుర్తు తెచ్చుకుంటే తమ జీవితం ప్రశాంతంగా గడుస్తుందని జనం నమ్ముతారు.

ఆ సమాధి సందర్శనానికి ఒక ఫకీరు వచ్చాడు. సమాధికి ధూపం వేసి మహాత్ముణ్ణి తలచుకున్నాడు. మనసు ప్రశాంతమయింది. కాసేపటికి నమాజు చేసే సమయం దగ్గర పడింది. అంతలో ఒక రాజు మందీ మార్బలంతో వచ్చాడు. సేవకులందరూ బయటనే రాజుకు రక్షణవలయంగా ఏర్పడ్డారు.

రాజు గంభీరంగా మసీదులోకి అడుగుపెట్టాడు. అందరిలాగే ఆయన నమాజు చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు. అక్కడవున్న రాజుకు ఆటంకమెందుకని ఫకీరు వెళ్ళబోయాడు. కారణం ఫకీరుకు ఆ రాజు గురించి తెలుసు. ప్రజల్ని పీడించి పీల్చి పిప్పి చేసే రాజు అతను. విపరీతమయిన పన్నులభారంతో రైతులు నానా బాధలు పడడానికి ఆ రాజే కారణం. అందుకని అక్కడి నించీ నిష్ర్కమించాలని ఫకీరు భావించాడు.

రాజు ఫకీరును చూసి “మీరు సర్వసంగపరిత్యాగులు. నిత్యం అల్లా సేవలో ఉంటారు. మీలాంటి వుత్తములు నాతో బాటు దైవప్రార్థన చెయ్యండి. పైగా శత్రురాజు నాపై దండెత్తే ప్రమాదం పొంచివుంది. ఆ భయం తొలగిపోయి దేవుడు నన్ను కరుణించాలని ప్రార్థించండి”. అన్నాడు. ఫకీరు ఆ రాజును పరిశీలనగా చూశాడు. అతను తన పరిపాలన గురించి, ప్రజల్ని తను పెట్టే బాధల గురించి అణుమాత్రం ఆలోచించడంలేదు. ఎంతసేపూ తన భద్రత గురించే భయపడుతున్నాడు. అతనికి ఏమాత్రం విచక్షణ, వివేకం లేవు. ఏకోశానా అతనికి మనస్సాక్షి ఉన్నట్లు కనిపించడం లేదు.

ఫకీరు దృఢ నిశ్చయంతో ఏది ఏమైనా ఇతనికి ఉన్న విషయం చెప్పాలి. ప్రజల బాధలు వివరించాలి. అని దృఢ సంకల్పానికి వచ్చాడు.

“రాజా! మీరు మీ శత్రుభయం గురించి, మీ సుఖాల గురించి, నన్ను భగవంతుణ్ణి ప్రార్థించమన్నారు. ఎప్పుడయినా ఇతర విషయాలను గురించి మీ దేశంలోని ప్రజల బాగోగుల గురించి ఆలోచించారా? వాళ్ళపై భరించలేని పన్నులు వేసి వాళ్ళని బతకనీకుండా చేస్తున్నారు. కేవలం దేవుని దయ మీ మీదకే రావాలని భావిస్తున్నారు. ఆ పేద ప్రజల పట్ల దేవుని కృప ఉండాలని మీరు ఎందుకనుకోరు? వాళ్ళపట్ల దయగా ఉండండి. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. బలహీనులయిన పేదవాళ్ళ పట్ల మీరు దయగా ఉంటే బలవంతులయిన శత్రువులు మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేరు” అన్నాడు.

ఆ మాటల్తో రాజు కళ్ళు తెరుచుకున్నాయి. ఫకీరుకు క్షమాపణలు చెప్పి ప్రజలపై పన్నుల భారం తగ్గించాడు.

– సౌభాగ్య

First Published:  1 Jun 2015 6:31 PM IST
Next Story