పూతకి (For Children)
పూతకి అంటే ఎవరో తెలుసా? ఆమె ఒక రాక్షసి… కంసుని రాజ్యంలో ఉండేది. పసి పిల్లల్ని చంపడమే ఆమె లక్ష్యం! దానికీ కారణం ఉంది. కంసునికి దేవకీసుతుడు కృష్ణుడు… చేతిలో తన చావు రాసి పెట్టి ఉందని తెలుసు. ఆ దేవకీసుతుడు ఎవరో తెలియక పుట్టిన ప్రతిబిడ్డనీ అనుమానించి ఆయువు తీసేవాడు. అలా ఆయువు తీసే పనిని పూతకికి అప్పగించాడు! దేవకీ సుతుడు పుట్టాడో లేదో…. పుట్టి చేతులు మారాడో… మారితే ఎక్కడ మారాడో… ఎక్కడవున్నాడో… […]
పూతకి అంటే ఎవరో తెలుసా?
ఆమె ఒక రాక్షసి… కంసుని రాజ్యంలో ఉండేది. పసి పిల్లల్ని చంపడమే ఆమె లక్ష్యం! దానికీ కారణం ఉంది. కంసునికి దేవకీసుతుడు కృష్ణుడు… చేతిలో తన చావు రాసి పెట్టి ఉందని తెలుసు. ఆ దేవకీసుతుడు ఎవరో తెలియక పుట్టిన ప్రతిబిడ్డనీ అనుమానించి ఆయువు తీసేవాడు. అలా ఆయువు తీసే పనిని పూతకికి అప్పగించాడు!
దేవకీ సుతుడు పుట్టాడో లేదో…. పుట్టి చేతులు మారాడో… మారితే ఎక్కడ మారాడో… ఎక్కడవున్నాడో… ఎవరో తెలీదు. కాని ఆ శిశివు చేతిలోనే కంసుని ప్రాణం పోనున్నది. అందుకని పుట్టిన ప్రతి శిశువునూ చంపడానికి సిద్ధమయింది పూతకి! ఎలా?
మామూలు స్త్రీ రూపు ధరించింది పూతకి. బిడ్డల్లేని బాలింతలాగా మెలిగింది. పుట్టిన ప్రతి బిడ్డ తల్లి దగ్గరకూ వెళ్ళింది. అడిగి అక్కున చేర్చుకొని గుండెలకదుముకొని పాలిచ్చింది. అవి విషపు పాలు. ఆపాలు తాగిన వెంటనే పసివాళ్ళు ప్రాణాల్ని కోల్పోయేవాళ్ళు. దేవకీ సుతుని కోసం చేసే ఈ ప్రయత్నంలో ఎందరో బిడ్డలు చనిపోయారు. తల్లులెందరో కడుపుకోతతో మిగిలిపోయారు.
పూతకి ఒకరోజున నందుని ఇంటికి వచ్చింది. ఆమె రాక్షసి అనిగాని, చంపాలన్న ఆమె ఉద్దేశంగాని యశోదగాని మరెవరుగాని గుర్తించలేకపోయారు. ఇంకేముంది? చిన్నికృష్ణునికి పాలు పట్టింది పూతకి. బాలకృష్ణుడు నవ్వుతూ కనురెప్పలు కదుపుతూ కడుపునిండా విషపు పాలను తాగాడు. తాగుతూనే ఉన్నాడు ఆపకుండా. అలా పాలనే కాదు, ఆమెలోని రక్తాన్ని కూడా తాగేసాడు. తాగేస్తున్నాడు. పూతకి బాధ భరించలేకపోయింది. అరచి గగ్గోలు పెట్టింది. చిన్నకృష్ణుడు వదిలితేనా? లేదు, పూతకి తన అసలు రూపుకు మారిపోయింది. ప్రాణభయంతో విలవిల లాడింది. చిరునవ్వులు నవ్వుతూ పాలనే కాదు, ఆమె ప్రాణాల్ని పీల్చేసాడు చిన్ని కృష్ణుడు. పూతకి ప్రాణాలు విడిచింది.
పూతకినే పూతన అనికూడా అంటారు. ముందు జన్మలో రత్నప్రభ. బలి చక్రవర్తి కూతురు. యజ్ఞ సమయంలో వామనుని చూసి ఇలాంటి బిడ్డకు పాలు పట్టాలని అనుకుంది. ఆమె కోరికను కృష్ణుడు గ్రహించాడు. ఆ కారణం చేతనే పూతకిగా పుట్టిందని చెపుతారు!.
– బమ్మిడి జగదీశ్వరరావు