ఉత్తముల ఉనికి (Devotional)
ఉత్తములు ఎక్కడుంటే ఉల్లాసమక్కడుంటుంది. సాధు స్వభావులు ఎక్కడుంటే ఆ పరిసరాలంతటా శాంతం ఉంటుంది. దుష్టులకు దూరంగా ఉండమనడంలో ఉత్తములకు దగ్గరగా ఉండమనడంలో అంతరార్థమదే. పూల చుట్టూ పరిమళమున్నట్లు మనిషి తత్వం అతన్ని చుట్టి ఉంటుంది. అతనితో బాటే సాగుతుంది. బుద్ధుడు ఏ ఋతువులోనయినా ఎక్కడికి వెళ్ళినా అతని పరిసరాలు ప్రకాశించేవట. “శిశిర ఋతువులో ఆకులన్నీ రాలి చెట్లు మోడులయినా బుద్ధుడు ఆ ప్రదేశానికి వెళితే చెట్లన్నీ చిగురించి పూలు పూచి కళకళలాడేవట! అట్లాగే […]
ఉత్తములు ఎక్కడుంటే ఉల్లాసమక్కడుంటుంది. సాధు స్వభావులు ఎక్కడుంటే ఆ పరిసరాలంతటా శాంతం ఉంటుంది. దుష్టులకు దూరంగా ఉండమనడంలో ఉత్తములకు దగ్గరగా ఉండమనడంలో అంతరార్థమదే.
పూల చుట్టూ పరిమళమున్నట్లు మనిషి తత్వం అతన్ని చుట్టి ఉంటుంది. అతనితో బాటే సాగుతుంది.
బుద్ధుడు ఏ ఋతువులోనయినా ఎక్కడికి వెళ్ళినా అతని పరిసరాలు ప్రకాశించేవట. “శిశిర ఋతువులో ఆకులన్నీ రాలి చెట్లు మోడులయినా బుద్ధుడు ఆ ప్రదేశానికి వెళితే చెట్లన్నీ చిగురించి పూలు పూచి కళకళలాడేవట!
అట్లాగే ధర్మరాజు శాంతమూర్తి. ధర్మానికి కట్టుబడినవాడు. నెమ్మది తనమున్న వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడి పరిసరం శాంతితో నిండి పోయేది.
భారత యుద్ధానంతరం స్వర్గారోహణ చేస్తూ ధర్మరాజు వెళుతున్నాడు. మార్గం మధ్యంలో నరకం పక్కగుండా నడుస్తున్నాడు.
నరకంలో మనుషుల్ని చిత్రహింసలు పెట్టడం, నూనెలో కాల్చడం, మంటల్లో వేయడం వంటివి బోలెడు దారుణాలు జరుగుతూ ఉంటాయి. పాపులు చేసిన కర్మలకు అవి ప్రతిఫలాలు. దాంతో నరకంలో వేడి విపరీతంగా ఉంటుంది. భరించలేనంత వేడి.
ధర్మరాజు శాంత మూర్తి. ఆయన నరకం పక్కనించీ వెళుతూ ఉంటే ఆయన శరీరంనించీ ఆ చలువ దనం ప్రసరించి నరకమంతా పిల్లగాలి వ్యాపించినట్లయింది. దాంతో అందరు పాపులూ ఆహ్లాదాన్నిఅనుభవించారు. ఎందుకిలా జరిగిందని చూస్తే పక్కగా ధర్మరాజు వెళుతున్నాడు.
దాంతో నరక వాసులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి “స్వామీ! మీరు అడుగు పెడితేనే మేము ఆహ్లాదాన్ని, చలువను, ఆనందాన్ని పొందాం. దయచేసి మీరు ఇక్కడ కొంతకాలం ఉంటే మేము ఎంతో ప్రశాంతతని అనుభవిస్తాం. దయచేసి మమ్మల్ని కరుణించి మీరు కొంతకాలం ఇక్కడుండండి. మేము అనుక్షణం చిత్రహింసలనుభవించే వాళ్ళం. మీరు కొంతకాలం ఇక్కడ ఉంటే మా పాపాలకు విముక్తి లభిస్తుంది” అని ప్రార్థించారు.
ధర్మరాజు చిరునవ్వు నవ్వి వాళ్ళ కోరికను మన్నించి అక్కడ కొంతకాలం ఉండడానికి అంగీకరించాడు.
కానీ అట్లా ఆయన అక్కడే ఉంటే పరిస్థితులు తలకిందులవుతాయి కదా! అప్పుడు స్వర్గానికి నరకానికీ తేడా ఉండదు. పాపులకు శిక్షలుండవు. ధర్మరాజు వల్ల ధర్మం తలకిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎంతకాలానికీ ధర్మరాజు రాకపోయేసరికి దేవదూతలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నరకవాసుల్తో ఉన్న ధర్మరాజుని చూశారు. “ధర్మరాజా! ఇక బయల్దేరండి, మనం స్వర్గానికి వెళదాం” అన్నారు. ధర్మరాజు “నేను చేసిన పుణ్యాన్నంతా ఈ నరకవాసులకు ఇచ్చాను. ఇక నేను స్వర్గంలో అడుగు పెట్టడానికి నాకు పుణ్యం లేదు. నేను ఇక్కడే ఉండిపోతాను” అన్నాడు.
దేవదూతలు “ధర్మరాజా! మీరు పుణ్యాత్ములు. ధర్మాత్ములు మీరు ఇచ్చిన పుణ్యం తరిగేది కాదు. ఇచ్చేకొద్దీ పెరిగేది. కొంతకాలం మీ దయవల్ల ఈ నరకవాసులు ప్రశాంతిని అనుభవించారు. ఇకచాలు. దయచేసి బయల్దేరండి” అన్నారు.
ధర్మరాజు నరకవాసుల దగ్గర సెలవు తీసుకుని స్వర్గయాత్రకు బయల్దేరాడు.
– సౌభాగ్య