నాశాఖ నుంచి ఏపీకి రూ.1000 కోట్లు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాజధానికి తన మంత్రిత్వ శాఖ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణానికి కొన్ని విధి విధానాలున్నాయని, వాటిని పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఏమేమి హామీలిచ్చిందో అంతకన్నా మెరుగ్గానే ఏపీకి సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేకింగ్ ఆఫ్ డవలప్డ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ జనతాపార్టీ యేడాది పాలనపై అనేక […]
BY sarvi29 May 2015 11:23 AM IST
X
sarvi Updated On: 29 May 2015 11:23 AM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానికి తన మంత్రిత్వ శాఖ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణానికి కొన్ని విధి విధానాలున్నాయని, వాటిని పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఏమేమి హామీలిచ్చిందో అంతకన్నా మెరుగ్గానే ఏపీకి సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేకింగ్ ఆఫ్ డవలప్డ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ జనతాపార్టీ యేడాది పాలనపై అనేక విషయాలను ప్రస్తావించారు. నరేంద్ర మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళలో వేళ్ళూనుకుపోయిన అవలక్షణాలను తొలగించే పనిలో నిమగ్నమైందని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పిఏం ప్రిసైడ్… మేడమ్ డిసైడ్ అన్నట్టు ఉండేదని, ఇప్పుడు ప్రధానమంత్రే నిర్ణేత అని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని లిఖించే పనిలో నిమగ్నమై ఉందని, ఉద్యోగులు చురుకుగా పని చేస్తున్నారని, గత ప్రధాని మన్మోహన్ ఉత్సవ విగ్రహంలా ఉండేవారు కాబట్టి ఉద్యోగులు కూడా యధా రాజ… తథా ప్రజా… అన్నట్టు వ్యవహరించే వారని ఆయన విమర్శించారు. ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిని హాయిగా జీవించే పరిస్థితులు కల్పించాలన్నదే మోడీ ప్రభుత్వ నినాదం…విధానం అని వెంకయ్య అన్నారు. అందుకే సామాజిక భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని, ఒక్క నెల కాలంలో 15 కోట్ల బ్యాంకు అకౌంట్లను తెరిపించిన ఘనత ఒక్క మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. పేదల కోసం భీమా పథకాలు ప్రవేశపెట్టామని, చిన్నచిన్న వృత్తులు చేసుకునే వారికి రుణాలివ్వడం, వారికి ఆర్థిక ఆసరాగా ఉండడం కోసం ముద్ర బ్యాంకులు ఏర్పాటు చేశామని, నిరు పేదలందరికీ గృహాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అటల్ అమృత్, స్మార్ట్ సిటీలు, అందరికీ ఇళ్ళు అనే నినాదాలతో పని చేస్తుందని వెంకయ్య తెలిపారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మోడి వల్ల దేశానికి మంచి నాయకత్వం లభించిందని, గత యేడాది పాలన తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. అభివృద్ధి మొత్తం ఒక్క యేడాదిలో జరగదని, ఇది పెద్ద సమయం కూడా కాదని, ప్రజారంజకంగా పని చేయడానికి, వారి ఆశలు తీర్చడానికి మరో నాలుగేళ్ళు పాలించే అవకాశం ఉందని కేంద్రమంత్రి అన్నారు.
Next Story